రాజీనామాలుండవు... తొలగింపులే...!
జాతీయ పార్టీ, కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన తమ పార్టీ నాయకత్వం తీరే చిత్రవిచిత్రంగా ఉంటుందని కాంగ్రెస్‌పార్టీ నాయకులే గొణుక్కుంటున్నారట. రాష్ర్టంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ జీహేచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమైన తీరు పట్ల జాతీయనాయకులు సైతం విస్మయం వ్యక్తంచేశారు. ప్రత్యేక రాష్ర్టంగా తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఇదేమి గతి అంటూ కూడా రాష్ట్రనాయకుల తీరుపై ఒకింత అసహనం కూడా వెలిబుచ్చుతున్నారట. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీపీసీసీ ముఖ్యనేత ఒకరు ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ను కోరారట.
అపాయింట్‌మెంట్ అయితే దొరకలేదు కాని అసలు ఎందుకు కలవాలని అనుకుంటున్నారో చెప్పాలని గట్టిగా అడిగారట. ఆ విషయాన్ని సోనియాగాంధీకే చెబుతానని సదరు నేత చెప్పినా అదేం కుదరదు కారణం చెప్పాల్సిందేనంటూ ఢిల్లీనేతలు రెట్టించారట. జీహేచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పేందుకే అపాయింట్‌మెంట్ కోరానని ఆ ముఖ్యనేత అసలు విషయం బయటపెట్టారట. దీనికి ప్రతిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి వచ్చినపుడు తామే పిలిపిస్తామని అధిష్టానం దూతలు ఆ నేతకు చెప్పి పంపించేశారట. కాంగ్రెస్‌లో పార్టీ అధ్యక్షులు రాజీనామాలు చేయడమంటూ ఉండదని, తొలగింపులే ఉంటాయనేది దీనివెనక అసలు రహస్యమని రాష్ర్టపార్టీ నేతలు చెవులు కొరుక్కోవడం కొసమెరుపు.