పాచిక పారదు | TPCC President uttamkumar Reddy Interview | Sakshi
Sakshi News home page

పాచిక పారదు

Published Wed, Jan 27 2016 12:40 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

పాచిక పారదు - Sakshi

పాచిక పారదు

సెంటిమెంట్
 
♦ గ్రేటర్ లో మెజారిటీ స్థానాలు మావే...
♦ కాంగ్రెస్ మాటల పార్టీ కాదు.. చేతల్లో చూపిస్తాం...
♦ పండగలు, సెలవులతో కేసీఆర్.. విదేశాల్లో మోదీ టైంపాస్
♦ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
 
 ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పక్కా హైదరాబాదీ. నగరంలోనే పుట్టి పెరిగారు. క్రమశిక్షణ కలిగిన ‘సైనికుడు’. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని నగరంలో పూర్తిచేసి.. ఆపై నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. భారత వైమానిక దళంలో పనిచేసి 1992లో రాజకీయాల్లో చేరేందుకు కెప్టెన్ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్ష హోదాలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్ల పంపకం.. మొదలుకుని ప్రచార వ్యూహాలన్నింటిలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఉత్తమ్ సెంటిమెంట్ మాటలు చెప్పే పార్టీల ప్రచారానికి మోసపోవద్దని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సెంటిమెంట్‌ను నమ్ముకున్న టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదంటున్నారు. తమ అభ్యర్థుల విజయానికి విస్తృత స్థాయిలో పాదయాత్రలు, రోడ్డు షోల్లో నిమగ్నమైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. - సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
 
 ఇంటర్వ్యూ
 
 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మీ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది?

 ఫిబ్రవరి 2న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో తప్పకుండా విజయం సాధించబోతున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండే వారిని ఈ మారు పోటీకి పెట్టాం. మాటలు చెప్పే వారిని కాకుండా చేతలు చేసే వారిని పోటీలో నిలిపాం. ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆడంబ రాలు, హడావుడి లేకుండా సెలైంట్‌గా ముందుకు పోవాలని నిర్ణయించాం. ఖచ్చితంగా 150 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో మా అభ్యర్థులు విజయం సాధించి తీరుతారన్న విశ్వాసం ఉంది. 29,30 తేదీల్లో ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ  ఆజాద్‌లు ప్రచారంలో పాలుపంచుకోబోతున్నారు.

 అభ్యర్థుల ఎంపిక ఎలా సాగింది.. కొందరు సీట్లు అమ్మారన్న ఆరోపణలు వచ్చాయి కదా..
 అదంతా పచ్చి అబద్దం. అన్ని సామాజిక వర్గాల సమతూకం పాటిస్తూ సెలక్ట్ ఆండ్ ఎలక్ట్ పద్ధతిని పాటించాం. ఏ పార్టీ జాబితాలో లేని సామాజిక వర్గాలన్నీంటికి మా జాబితాలో స్థానం కల్పించాం. కొన్ని చోట్ల ఆరోపణలు రాగా..వాటిపై విచారణ జరిపించాం. ఎక్కడా వాస్తవం లేదు. పార్టీలో అందరి నిర్ణయం మేరకు ఎంపిక చేసిన అభ్యర్థులు వారు.  పార్టీలో ఉన్న కొందరికి అవకాశం రాకపోవవచ్చు. వారందరికీ పార్టీ పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. అసంతృప్తులను ఇళ్లకు వెళ్లి కలుస్తున్నాం.

 కాంగ్రెస్ నగరానికి ఏమీ చేయలేదని.. అందుకే ఓడించాలంటున్న టీఆర్‌ఎస్ పిలుపుపై ఎలా స్పందిస్తారు?
 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు హైదరాబాద్‌కు ఏం చేశాయని ప్రశ్నిస్తే అది వారి అమాయకత్వం తప్ప మరేమీ కాదు. అసలు ఏం చేయలేదో చెప్పమనండి. కేటీఆర్ ఇటీవలే కుత్బుల్లాపూర్ వెళ్లి గోదావరి జలాలను నెత్తిన చిలకరించుకుని తానే అపర భగీరథునిగా ప్రకటించుకున్నారు. అది నిజమేనా..ఒక్క సారి గుండెపై చేయి వేసుకుని చెప్పమనండి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి జలాల తరలింపు పనులను 2008లో ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలోనే 99 శాతం పనులు పూర్తయ్యాయి. కృష్ణా 2,3 దశ పనులను ప్రారంభించింది కూడా మేమే. ఇక మెట్రో రైలు, ఔటర్‌రింగ్ రోడ్డు, రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్, పాతబస్తీకి రూ.2000 కోట్ల ప్రాజెక్ట్, మురికివాడల్లో నిరుపేదలకు ఉచితంగా నల్లా కనెక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మౌళిక వసతుల కల్పన లాంటి గొప్ప పనులు చేసింది మా హాయాంలోనే కాదా..?

 సంప్రదాయానికి భిన్నంగా మేయర్ అభ్యర్థిని ముందే ప్రకటించారు.. ఎందుకు?
 కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం మేం కొత్త సంప్రదాయానికి తెరలేపాం. స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలు, అభ్యర్థుల ప్రభావం కూడా భారీగానే ఉంటుంది. అందుకే మేయర్ అభ్యర్థిగా ముందుగానే యువకుడు, విద్యావంతుడైన విక్రంగౌడ్‌ని ఎంపిక చేసి ప్రకటించాం. మా పార్టీ మాదిరిగానే మిగతా పార్టీలు కూడా మేయర్ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా.
 
 రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలన ఎలా ఉంది.. మీరెన్ని మార్కులు వేస్తారు?
 పందొమ్మిది నెలల కాలంలో వారి చేసిన గొప్ప పనులు ఏమున్నాయి? మార్కులు వేయడానికి.. ఎక్కువ సమయాన్ని మోదీ విదేశాల్లో గడిపితే.. కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు పరిమితమయ్యారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గిపోయినా తమ కక్కుర్తి కోసం డీజీల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను తగ్గించలేకపోయారు.‘మోదీ అయేతో..అచ్చే దిన్ ఆయేగా’అన్నారు..ఎక్కడ అచ్చేదిన్ వచ్చాయి చెప్పండి. వారి విధానాలతో రైతులు, విద్యార్థులు ‘చచ్చేదిన్’ మాత్రం వచ్చాయి. హైదరాబాద్‌కు  రొటీన్‌గా వచ్చిన నిధులు తప్పితే ఒక్క రూపాయి అయినా అదనంగా రాలేదు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే..సెంటిమెంట్లతో పాలన కొనసాగిస్తున్నారు. పండగలు, సెలవులు, యాగాలతో కాలం గడిపేశారు. కేసీఆర్ చెప్పేది చేయడు..చేసేది చెప్పడు అని ఇప్పటికే అందరికీ అర్థమైంది. ఒక్క 350 డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టి హైదరాబాద్‌లో 3 లక్షల మంది వద్ద దరఖాస్తులు తీసుకున్నారు. సీమాంధ్రులను భాగోజాగో అని నేడు ఆయన కొడుకుతో క్షమాపణలు చెప్పిస్తున్నారు. ఇక ఎంఐఎం అవకాశవాద పార్టీగా తేలిపోయింది. నగర ప్రజలు తెలివైనవారు..చేతలు చేసేది ఎవరు, మాటలు చెప్పేది ఎవరో వారే నిర్ణయిస్తారు.
 
 అబ్బో.. ఆరోజులే వేరు!
 ప్రచారం శైలిలో ఎన్నిమార్పులో...అప్పట్లో గోడలపై రాతలు, వాల్‌పోస్టర్లే మాకు ప్రచారం కల్పించేవి. మైకులు లేవు, వాహనాలు లేవు. నడిచి వెళ్తూ ప్రజలను కలిసే వాళ్లం. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రచారం చేసేవాళ్లం..’ అంటూ తన ఎన్నికల జ్ఞాపకాలను వివరించారు మాజీ ఎంపీ వర్రి తులసీరామ్. గ్రేటర్ ఎన్నికల హంగామా గురించి ఆయన స్పందిస్తూ తాను 1971, 77, 1984 సంవత్సరాల్లో ఎన్నికలను ఎదుర్కొన్నానని, పెద్దపల్లి, నాగర్‌కర్నూలు నుంచి ఎంపీగా మూడుసార్లు గెలిచానని చెప్పారు. ‘అప్పట్లో ఎక్కడో ఒక ప్రాంతంలో బట్టతో తయారైన బ్యానర్‌ను ఏర్పాటు చేసే వాళ్లం. అదే పెద్ద గొప్పగా భావించేవాళ్లం’ అని తెలిపారు. ఇప్పుడు ఫ్లెక్సీ లు, జెండాలు, బ్యానర్లు, టోపీలు, భారీగా వాహనాలను చూస్తుంటే..ఎన్నికల హంగామా ఇంత అవసరమా అన్పిస్తుంది. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ఓటర్లు అప్పుడైనా..ఇప్పుడైనా చైతన్యవంతులే అనిఅన్నారు.      - రాజేంద్రనగర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement