ముగిసిన ఎన్నికల ప్రచారం
ముగిసిన ఎన్నికల ప్రచారం
చివరి రోజూ అగ్రనేతల విస్తృత పర్యటనలు
మొదలైన ప్రలోభాలు
మాణికేశ్వరీ నగర్‌లో కాంగ్రెస్ -టీఆర్‌ఎస్‌ల ఘర్షణ
ఎన్నికల రణరంగంలో ప్రచార సంగ్రామం ముగిసింది. ప్రలోభాలకు తెర లేచింది. ఇంతవరకూ అభివృద్ధి... హామీల మంత్రాలు పఠించిన నాయకులు.. ఆదివారం సాయంత్రం నుంచి ఓటర్లను ఆక ట్టుకునేందుకు నజరానాల పంపకాల్లో మునిగారు.
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టానికి తెరపడింది. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు భారీ ర్యాలీలు, బహిరంగ సభలతో నగరం హోరె త్తింది. వివిధ పార్టీల అగ్రనేతలంతా నగరంలో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలతో బల ప్రదర్శనలు చేశారు. ప్రచారం ముగిసిన వెంటనే వివిధ పార్టీల నేతలు పోలింగ్ బూత్‌ల వారీగా తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ... బస్తీలు, స్వయం శక్తి మహిళా సంఘాల వారిగా పోల్ మేనేజ్‌మెంట్‌లో నిమగ్నమయ్యారు. తార్నాకలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి అనుచరులపై టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆలకుంట హరి అనుచరులు దాడి చేయటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్తీకరెడ్డి ఓయూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్-ఎంఐఎం పార్టీల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఇదిలా ఉంటే బహిరంగ ప్రచారం ముగిసినా సోషల్‌సైట్లు, వాట్సాప్‌గ్రూపుల ద్వారా అభ్యర్థులు తమను బలపర్చాల్సిందిగా ఓటర్లను వేడుకున్నారు.
చివరి రోజు అగ్రనేతల హంగామా
ప్రచారం చివరి రోజున వివిధ పార్టీల అగ్రనేతలు విస్తృత ప్రచారం చేశారు. 150 డివిజన్లలో మొత్తం 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో వారి తర ఫున ముఖ్య నేతలు ప్రచార భారాన్ని మీద వేసుకున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూకట్‌పల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఆదివారం సుడిగాలి పర్యటన చేయగా... బీజేపీ కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలు నగరంలో సుమారు 8 సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పక్షాన నారా లోకేష్, రేవంత్‌రెడ్డి శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. కాంగ్రెస్ పక్షాన షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి, మధుయాష్కి తదితరు లు ప్రచారంలో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగి యటంతో అన్ని పార్టీలూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యాయి. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఒకరి పంపకాలను మరొకరు అడ్డుకునే దిశగా షాడో టీంలు ఏర్పాటు చేసుకున్నారు.