స్మార్ట్ సిటీగా నెల్లూరు
మంత్రి నారాయణ
నెల్లూరు (దర్గామిట్ట): కేంద్రపట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో నెల్లూరును స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయనున్నట్టు రాష్ట్రపురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులందరికీ పింఛన్లు అందించాలన్నదే టీడీపీ లక్ష్యమన్నారు. పింఛన్లు, రేషన్‌కార్డుల జారీలో అక్రమాలను నివారించేందుకు ఆధార్‌ను అనుసంధానం చేసినట్టు ఆయన తెలిపారు.
అక్టోబర్ 2 నుంచి పింఛన్‌ను రూ.200 నుంచి రూ.1000కి పెంచుతున్నామన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.16 వేల కోట్ల లోటులో ఉన్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు సకాలంలో పనులు చేసేందుకు 7 మిషన్లు, 5 గ్రిడ్స్‌ను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఒక్కో జిల్లాలో ఒక్కోరకమైన వనరులు అపారంగా ఉన్నాయన్నారు. వాటిని వినియోగించి అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన వనరులను సమకూర్చి అభివృద్ధి చేయనున్నట్టు ఆయన తెలిపారు. అర్హులైన వారికి పింఛన్లు అందకుంటే స్పెషల్ కేసుల కింద పరిగణించి సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.రామకృష్ణ, పోలంరెడి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బల్లి దుర్గాప్రసాద్, పరసా వెంకటరత్నం, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూరల్ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు, తాళ్లపాక అనూరాధ, సీనయర్ నాయకులు బెజవాడ ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.