పోలీస్... ధనా ధన్!
ఆధునీకరణ, టెక్నాలజీ వినియోగానికి భారీగా నిధులు
⇒ రూ.975.95 కోట్లు హోంశాఖకు ప్రగతి బడ్జెట్ కింద
⇒ రూ.3852.21 కోట్లు నిర్వహణ పద్దు కింద కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌లో హోంశాఖకు అగ్రతాంబూలం దక్కింది. పూర్తి స్థాయి ఆధునీకరణ, టెక్నాలజీ వినియోగం, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. నిర్వహణ పద్దు కింద రూ.3,852.21 కోట్లు కేటాయించగా, ప్రగతి పద్దు కింద హోం శాఖకు రూ.975.95 కోట్లు ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. హోంశాఖ కింద విభాగాలుగా ఉన్న డీజీపీ(హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్), జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ, సైనిక్ వెల్ఫేర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, కమిషనర్ ప్రింటింగ్, పోలీస్ అకాడమీ, నగర కమిషనరేట్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, ఇంటెలిజెన్స్ విభాగం, హోంగార్డు విభాగం, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు సముచిత స్థానం కల్పిస్తూ బడ్జెట్ ప్రతిపాదించారు.
సీక్రెట్ సర్వీసెస్‌కు రూ.11.6 కోట్లు..
పోలీస్ శాఖలోని కమిషనర్లు, ఎస్పీలు, పోలీస్ దళాలు, డీజీపీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో రహస్య కార్యకలాపాలకు రూ.11.66 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో డీజీపీ కింద సీక్రెట్ సర్వీసెస్ వాటా రూ.4.58 కోట్లు, నగర కమిషనర్ వాటా కింద రూ.1.2 కోట్లు కేటాయించారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు రూ.60 లక్షల చొప్పున కేటాయించారు. మిగిలిన జిల్లాలకు రూ.12 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది.
నగర పోలీస్‌కు ‘సింహ భాగం’
పోలీస్ శాఖకు ప్రగతి పద్దుల కింద కేటాయించిన రూ.975 కోట్లలో హైదరాబాద్ నగర కమిషనరేట్‌కు ప్రధాన వాటా దక్కింది. నగర కమిషనరేట్‌కు రూ.509.21 కోట్లు కేటాయించారు. సీసీటీవీలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐటీ బ్యాక్ బోన్ సపోర్ట్ నిర్వహణ, పోలీస్‌స్టేషన్ల ఆధునీకరణ కింద ఈ నిధులు ఉపయోగించుకునేందుకు వీలు కల్పించారు.
ఆధునీకరణకు రూ.76 కోట్లు
రాష్ట్ర పోలీస్ శాఖలో కీలకంగా ఉన్న దళాల ఆధునీ కరణ, ఆయుధాలు, ఎక్విప్‌మెంట్ తదితరాలకు రాష్ట్ర వాటా కింద రూ.76.29 కోట్లు కేటాయించారు. అయితే ప్రతి ఏటా మోడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించే నిధుల్లో రాష్ట్ర వాటాగా రూ.76.29 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రభుత్వం స్ప ష్టంచేసింది. ప్రతీ జిల్లాలోనూ ఉన్న పోలీస్ శిక్ష ణ కేంద్రాలను ఆధునీకరించడానికి, మరింత నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు రూ.15 కోట్లు కేటాయించారు.
హోంగార్డులకు పెద్దగా దక్కని ప్రాధాన్యత
ఈ బడ్జెట్‌లో హోంగార్డు లకు రూ.1.73 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇటీవలే సీఎం కేసీఆర్ హోంగార్డులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు జీతభత్యాలను పెంచుతామని ప్రకటించారు. దీంతో ఈ హామీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఓకే అవుతుందా? లేక ఇదే ఏడాది ప్రత్యేక నిధుల ద్వారా అమలు చేస్తారా అన్న అంశంపై సందిగ్ధత ఏర్పడింది.
నిర్మాణాలకు రూ.94 కోట్లు..
కొత్త జిల్లాలు, కొత్త బెటాలియన్లకు సంబంధించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్, బ్యారక్ తదితర నిర్మాణాలకు రూ.76 కోట్లు కేటాయించారు. ఇందులో వరంగల్ కమిషనరేట్ నిర్మాణానికి రూ.10 కోట్లు ఇచ్చారు. భవనాల నిర్మాణానికి రూ.43 కోట్లు, టెక్నాలజీ బ్యాక్ బోన్, సిటీజన్ సెంట్రల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కింద రూ.5కోట్లు, ఐటీ బ్యాక్ బోన్, డాటా అనలైటిక్ కింద రూ.5 కోట్లు, అర్బన్ ప్రాంతాల్లో సీసీటీవీల ఏర్పాటుకు రూ.5 కోట్లు, కొత్త ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ల నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించారు.
‘గిరిజన’ పథకాలకు రూ.15 కోట్లు
గిరిజన యువకులు మావోయిజం బాట పట్టకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలకు రూ.15.62 కోట్లు కేటాయించింది. ఆ ప్రాంతాల్లో పోలీస్ ఆధునీకరణ కోసం మరో రూ.9.17 కోట్లు కేటాయిస్తున్నట్టు స్పష్టంచేసింది.
అగ్నిమాపక కేంద్రాలకు రూ.12 కోట్లు
నూతన అగ్నిమాపక కేంద్రాలు, భవన నిర్మాణాలకు రూ.12.23 కోట్లు కేటాయించింది. 2016–17లో రూ.47.30 కోట్లు కేటాయించగా, రూ.20 కోట్లు ఉపయోగించారు. మిగిలిన రూ.27 కోట్లను సవరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
కేంద్రం నుంచి రూ.101 కోట్లు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే ఎల్‌డబ్ల్యూఈ కింద ఈ ఆర్థిక సంవత్సరం రూ.101.10 కోట్లు కేటాయించనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. డీజీపీ యూనిట్‌కు ఈ నిధులు కేటాయించి షెడ్యూల్ కులాల ప్రగతికి కృషి చేయనున్నట్టు తెలిపింది.
ప్రాధాన్యతనివ్వడం ఎనలేని తోడ్పాటు
డీజీపీ అనురాగ్ శర్మ
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోలీస్ శాఖకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి తాము ప్రతిపాదించిన మేరకు నిధులను కేటాయిస్తున్నారని, ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో శాంతి భద్రతల పరిరక్షణలో తమ సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేస్తారని తెలిపారు. టెక్నాలజీ వినియోగం, నూతన నిర్మాణాలు, ప్రపంచ స్థాయి పోలీసింగ్, నేరాల నియంత్రణ, పోలీస్ సంక్షేమం కోసం నిధులు కేటాయించడం శుభపరిణామమని అన్నారు.