ఆర్టీసీకి స్వల్ప ఊరట
బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్ల కేటాయింపు
అప్పులు, నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని ప్రభుత్వం కాస్త కనికరించింది. బడ్జెట్‌లో దాదాపు రూ.1,000 కోట్లు కేటాయించింది. రాయితీ పాస్‌ల రూపంలో ఆర్టీసీ ఏటా రూ.520 కోట్ల దాకా నష్టపోతోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి తిరిగి చెల్లించాల్సి ఉంది. తాజా బడ్జెట్‌లో ఆ పద్దు కింద రూ.520 కోట్లు, కొత్త బస్సుల కొనుగోలుకు రుణంగా రూ.140 కోట్లు, ప్రభుత్వ పూచీకత్తుపై ఆర్టీసీ తీసుకున్న రుణాల చెల్లింపుకు రూ.334 కోట్లు కేటాయించింది. వెరసి రూ.1,000 కోట్లు చూపడంపై ఆర్టీసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అర్చకులకు శుభవార్త
ఉద్యోగుల తరహాలో తమకు కూడా ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలన్న దేవాదాయ శాఖ అధీనంలోని ఆలయ అర్చకులు, ఉద్యోగుల డిమాండును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. వారికి జీతాల కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది. ఆలయాల ఆదాయం నుంచి 12 శాతం దేవాదాయ శాఖ తీసుకునే మొత్తానికి దీన్ని జత చేసి జీతాల నిధిగా చూపనున్నారు. దేవాదాయ శాఖ సర్వశ్రేయో నిధికి రూ.50 కోట్లు గ్రాంటుగా ప్రకటించింది. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, కొత్త ఆలయాలను ధూపదీప నైవేద్యాల పథకం కిందకు తేవటం, బలహీన వర్గాల కాలనీల్లో రామాలయాల నిర్మాణానికి వీటిని వినియోగిస్తారు.
పర్యాటకానికి రూ.93 కోట్లు
పర్యాటక, సాంస్కృతిక శాఖకు బడ్జెట్లో రూ.93 కోట్లు కేటాయించారు. తెలంగాణ సాంస్కృతిక సారథికి రూ.17.12 కోట్లు, వృద్ధ కళాకారుల పించన్‌కు రూ.5.85 కోట్లు, సాంస్కృతిక అకాడమీలకు రూ.13 కోట్లు కేటాయించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.100 కోట్లు కేటాయించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రభుత్వం కొనసాగించింది. పరిశ్రమలు, వాటి పరిధిలోని లిడ్‌క్యాప్, చేనేత, చక్కెర, గనుల శాఖకు కలిపి మొత్తం రూ.985.15 కోట్లు కేటాయించింది. ఇందులో పరిశ్రమల ప్రోత్సాహక రాయితీల కింద రూ.155.39 కోట్లు, విద్యుత్ రాయితీలకు రూ.180 కోట్లు కేటాయించింది. మెదక్ జిల్లాలోని నిమ్జ్ ప్రాజెక్టుకు భూ సేకరణ కోసం కేటాయింపులను రూ.200 కోట్లకు పెంచింది. చేనేత, జౌళి శాఖకు గతేడాది తరహాలోనే రూ.83 కోట్ల కేటాయింపులను కొనసాగించింది.
‘విద్యుత్’ సబ్సిడీలు అంతంతే!
రూ.5,340 కోట్ల లోటు
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచడం తప్పేలా లేదు. వ్యవసాయ విద్యుత్ సరఫరాను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచిన నేపథ్యంలో విద్యుత్ సబ్సిడీలను పెంచాలన్న విద్యుత్ పంపిణీ సంస్థల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017–18లో ఆర్థిక లోటును రూ.9824 కోట్లుగా డిస్కంలు అంచనా వేశాయి. ఇందులో రూ.7150.13 కోట్లను సబ్సిడీగా ప్రభుత్వం భరించాలని కోరగా, తాజా బడ్జెట్‌లో రూ.4484.3 కోట్లు మాత్రమే కేటాయించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సబ్సిడీ కింద కేవలం రూ.3387.8 కోట్లు కేటాయించింది. 100 యూనిట్లలోపు వాడే వినియోగదారులకు సబ్సిడీ కింద మరో రూ.988.09 కోట్లు కేటాయించింది.
అలా చూసినా రూ.5340 కోట్ల లోటు అలాగే ఉండనుంది. చార్జీల పెంపుతో రూ.2,300 కోట్ల దాకా పూడ్చుకునేందుకు డిస్కంలు ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నాయి. అందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా మరో రూ.3,000 కోట్ల దాకా లోటును ఎదుర్కోనున్నాయి. ఉజ్వల్ డిస్కం అష్యురెన్స్ యోజన (ఉదయ్) పథకంలో చేరి అప్పుల భారం నుంచి విముక్తి పొందిన డిస్కంలు మళ్లీ అప్పులు, నష్టాల బాటపట్ టేసూచనలు కనిపిస్తున్నాయి.