ప్రాజెక్టుల పాత పనులకు వ్యాటే!
జూలై నుంచి జరిగిన కొత్త పనులకే 18 శాతం జీఎస్టీ
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు మినహాయించింది. జూలై ఒకటో తేదీకి ముందు జరిగిన పనులు, వాటికి చెల్లించాల్సిన బిల్లులన్నింటికీ పాత వ్యాట్ అమలు చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత చేపట్టి న కొత్త పనులకు మాత్రమే జీఎస్టీ వర్తింప జేసేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదల శాఖ చేసిన సిఫార్సుల మేరకు వాణిజ్య పన్నుల శాఖ ఈ వెసులుబాటును ఇచ్చింది. దీంతో సాగునీటి కాంట్రాక్టర్లకు భారీగానే లాభం చేకూరనుంది. సాగు నీటి ప్రాజెక్టుల పరిధిలో ఉపయోగించే సిమెంటు, ఇనుము, భారీ పైపులు, యంత్ర సామగ్రిపై గతంలో 5 శాతం వరకు వ్యాట్ ఉండేది. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించేది.
జీఎస్టీ అమల్లోకి వచ్చాక వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ పన్నులన్నీ విలీనమై అవన్నీ 18 శాతం శ్లాబులోకి వచ్చి చేరాయి. నిర్మాణ రంగంలో వినియోగించే సామగ్రిపై జీఎస్టీ విధిం చడంతో ప్రాజెక్టుల అంచనా వ్యయం కూడా పెరిగిపోనుంది. గతంలో ఉన్న వ్యాట్‌తో పోలిస్తే 13 శాతం అదనంగా పన్ను భారం పడటంతో కాంట్రాక్టర్లలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఇటీవల సమీక్షించిన నీటి పారుదల శాఖ జూలై ఒకటికి ముందు ఒప్పందాలు జరిగిన ప్రాజెక్టు పనులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని వాణిజ్య పన్నుల శాఖను కోరింది.
ఈ సిఫారసులను పరిశీలించిన వాణిజ్య పన్నుల శాఖ ఒప్పందాలతో సంబంధం లేకుండా జూలై ఒకటి వరకు జరిగిన పనులు, చెల్లించాల్సిన బిల్లులన్నింటికీ గతంలో ఉన్న వ్యాట్ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు ఆరు నెలలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రస్తుత వెసులుబాటు ఈ బిల్లులన్నీ చెల్లించేంత వరకు కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం కాంట్రాక్టు ఏజెన్సీలకు కలిసొచ్చే అంశమేననే అభిప్రాయాలున్నాయి.
జీఎస్టీ కౌన్సిల్‌లో మరోసారి చర్చకు...
మరోవైపు సాగునీటి ప్రాజెక్టులకు జీఎస్టీ మిన హాయించాలని శనివారం ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ వాదనను వినిపించనుంది. అందులో ఈ అంశం చర్చకు రానుందని, కేంద్రం సైతం వర్క్స్ అండ్ కాంట్రాక్టు పను లకు 18 శాతం నుంచి 12 శాతానికి శ్లాబ్ తగ్గించే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి మంత్రి కేటీఆర్ హాజరవుతారు.