సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సులభతరం చేస్తూ ప్రభుత్వం జీఎస్టీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడనుంది. రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా సరళీకృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 సేవా కేంద్రాలను ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు.
జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ టాక్స్ విజన్, మిషన్ వాల్యూస్, ’జీఎస్టీ మిత్ర’ లోగోను ఆవిష్కరించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 195 మంది అధికారులు, సిబ్బందికి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారులకు అనుకూల వాతావరణాన్ని కలి్పంచేలా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.
సేవా కేంద్రాల ద్వారా వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఉత్తమ సేవలు అందుతాయని, జీఎస్టీ ఎగవేతలను అరికట్టవచ్చని చెప్పారు. కొందరు ఇన్‌పుట్ టాక్స్ ఎగవేతకు పాల్పడటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని తెలిపారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టు ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామన్నారు. దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాల్లోనే ఉందని తెలిపారు. పన్ను చెల్లించే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో టాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు.
ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత, సరళతర విధానాలు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. టాక్స్ పేయర్, వాణిజ్య పన్నుల శాఖ సమన్వయంతోనే పారదర్శకత సాధ్యమైందన్నారు. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా వెబ్‌సైట్ ను తీర్చిదిద్దారని తెలిపారు. పన్ను చెల్లింపుల వ్యవహారంలో ఇతర దేశాల్లో మాదిరి మన రాష్ట్రంలో వేధింపులకు తావు లేదన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ కస్టమ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్, జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జర్, స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, గుంటూరు సెంట్రల్ టాక్సెస్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీ రాబడిలో మొదటి స్థానం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతో వాణిజ్య పన్నుల శాఖలో పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలందించేలా సంస్కరణలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా పన్నులు కట్టే వారిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.
నవంబర్ నెలలో జీఎస్టీ పన్నుల వసూళ్లలో 31 శాతం వృద్ధి రేటుతో తమిళనాడు (20%), కేరళ (20%), తెలంగాణ (18%), కర్ణాటక (17%), ఒడిశా (3%) కన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌నాటికి రూ.21,180.57 కోట్ల జీఎస్టీ వసూలు ద్వారా 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 17.14 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment