gst act
-
మరింత సులభంగా జీఎస్టీ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సులభతరం చేస్తూ ప్రభుత్వం జీఎస్టీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడనుంది. రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా సరళీకృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 సేవా కేంద్రాలను ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ టాక్స్ విజన్, మిషన్ వాల్యూస్, ’జీఎస్టీ మిత్ర’ లోగోను ఆవిష్కరించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 195 మంది అధికారులు, సిబ్బందికి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారులకు అనుకూల వాతావరణాన్ని కలి్పంచేలా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. సేవా కేంద్రాల ద్వారా వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఉత్తమ సేవలు అందుతాయని, జీఎస్టీ ఎగవేతలను అరికట్టవచ్చని చెప్పారు. కొందరు ఇన్పుట్ టాక్స్ ఎగవేతకు పాల్పడటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని తెలిపారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టు ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామన్నారు. దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాల్లోనే ఉందని తెలిపారు. పన్ను చెల్లించే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో టాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత, సరళతర విధానాలు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. టాక్స్ పేయర్, వాణిజ్య పన్నుల శాఖ సమన్వయంతోనే పారదర్శకత సాధ్యమైందన్నారు. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా వెబ్సైట్ ను తీర్చిదిద్దారని తెలిపారు. పన్ను చెల్లింపుల వ్యవహారంలో ఇతర దేశాల్లో మాదిరి మన రాష్ట్రంలో వేధింపులకు తావు లేదన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ కస్టమ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్, జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జర్, స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, గుంటూరు సెంట్రల్ టాక్సెస్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ రాబడిలో మొదటి స్థానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతో వాణిజ్య పన్నుల శాఖలో పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలందించేలా సంస్కరణలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా పన్నులు కట్టే వారిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. నవంబర్ నెలలో జీఎస్టీ పన్నుల వసూళ్లలో 31 శాతం వృద్ధి రేటుతో తమిళనాడు (20%), కేరళ (20%), తెలంగాణ (18%), కర్ణాటక (17%), ఒడిశా (3%) కన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌నాటికి రూ.21,180.57 కోట్ల జీఎస్టీ వసూలు ద్వారా 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 17.14 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు. -
హెల్త్ కేర్ రంగానికి ‘జీఎస్టీ’ ఊరట ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) భారం తగ్గించాలని హెల్త్‌కేర్ ఇండస్ట్రీ వేదిక– నట్హెల్త్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే చిన్న నగరాలు, పట్టణాలలో ప్రజలకు మెరుగైన బీమా కవరేజీని కల్పించే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు 2023–24 బడ్జెట్లో చర్యలు తీసుకోవాలని నట్హెల్త్ ప్రెసిడెంట్ శ్రావణ్ సుబ్రహ్మణ్యం కోరారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రీ–బడ్జెట్ నివేదిక పత్రంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఇతర రంగాల తరహాలో ఆరోగ్య సంరక్షణ రంగం జీఎస్టీ పరివర్తన ప్రయోజనాలను పొందలేకపోయింది. ►వాస్తవానికి, జీఎస్టీ ముందు కాలంతో పోలిస్తే, అనంతర కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో పన్నులు పెరిగాయి. ►పూర్తి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను క్లెయిమ్ చేసుకునే అవకాశంతో అన్ని ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ( ప్రభుత్వ, ప్రైవేట్) అవుట్‌పుట్ హెల్త్‌కేర్ సేవలపై 5 శాతం మెరిట్ రేటును విధించాలి. అలాగే అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల కోసం అవుట్‌పుట్ సేవలపై 5 శాతం జీఎస్టీ రేటును దీనిపై ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఐచ్ఛిక డ్యూయల్ రేట్ స్ట్రక్చర్‌ను విధించవచ్చు. ►ప్రస్తుతం ఆరోగ్య సేవలపై జీఎస్టీ మినహాయింపు ఉంది. అయితే ఈ సేవలపై 5 మెరిట్ రేటును విధించవచ్చు. దీనివల్ల హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్లు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి వీలుకలుగుతుంది. తద్వారా వారి ఎంబెడెడ్ (ఉత్పత్తి లేదా సేవ మూల ధర ను పెంచే పన్ను) పన్నుల భారం తగ్గుతుంది. ►ప్రొవైడర్లు, ప్రొక్యూర్మెంట్ సంస్థలకు వర్కింగ్ క్యాపిటల్ బకాయిలనూ క్లియర్ చేయాలి. ►ప్రజలు నాణ్యమైన, క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు తగిన రీతిన పొందడానికి మౌలిక సదుపాయాల సామర్థ్యాల పెంపు, విస్తరణ అవసర. టైర్–1, టైర్–2 నగరాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరం. ఇది హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ►ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పూర్తి స్థాయిలో విస్తరణ మరో కీలక అంశం. ►ఇన్సూరెన్స్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కింద ప్రొవైడర్లు అలాగే సప్లయర్ల కోసం అన్ని పేమెంట్ బ్యాక్‌లాగ్‌లు క్లియర్ చేయాలి. అది హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పురోగతి, లభ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ►ఆరోగ్య రంగానికి బడ్జెటరీ కేటాయింపులు భారీగా పెరగాలి. -
విచారణ పేరుతో వేధించడం మానుకోండి!
న్యూఢిల్లీ: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) వంటి ఒక కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ అధికారులను ఆషామాషీగా పిలవడం (సమన్స్ జారీ), వారిని అరెస్ట్ చేయడం వంటి విధానాలను విడనాడాలని క్షేత్రస్థాయి కార్యాలయాలను జీఎస్టీ (వస్తు సేవల పన్ను) ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఆదేశించింది. జీఎస్టీ చట్టం కింద యాంత్రిక పద్ధతిలో అరెస్టు చేసే విధానాలకు పాల్పడవద్దని స్పష్టం చేసింది. ప్రత్యక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) పర్యవేక్షణలో పనిచేసే ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఈ మేరకు ఫీల్డ్ ఆఫీసర్లకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వీటికి సంబంధించి కొన్ని కీలకాంశాలను చూస్తే.. ►ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛ అరెస్టు వల్ల దెబ్బతింటుంది. అటువంటి చర్య విశ్వసనీయమైన అంశాల ఆధారంగా ఉండాలి. అరెస్టును మామూలుగా, యాంత్రికంగా చేయకూడదు. ►జీఎస్టీ ఎగవేత ఆరోపణలకు సంబంధించి నేరస్థుడిని అరెస్టు చేయాలనుకుంటే, సంబంధిత అధికారుల కోసం మార్గదర్శకాల చెక్లిస్ట్ను కూడా ఫీల్డ్ ఆఫీసర్లు పరిగణనలోకి తీసుకోవాలి. నేరస్థుడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా లేదా సాక్షులను బెదిరించే అవకాశం ఉందా, నేరానికి ఆ వ్యక్తి సూత్రధారా? వంటి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు సరిచేసుకోవాలి. ►చట్టపరమైన అవసరాలను నెరవేర్చడమే కాకుండా, ఒక వ్యక్తిని అరెస్టు చేయాలని నిర్ణయించే ముందు సంబంధిత అంశాలు తప్పనిసరిగా సరైన దర్యాప్తుతో నిర్ధారించుకోవాలి. సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సాక్షులను బెదిరించడం లేదా ప్రభావితం చేయడం వంటి అవకాశాలను నిరోధించడానికి, ఆ అవసరం ఏర్పడినప్పుడే అరెస్టులు జరగాలి. ►ఏదైనా కంపెనీ లేదా పీఎస్‌యూ (ప్రభుత్వ రంగ సంస్థ) సీఎండీ, ఎండీ, సీఈఓ, సీఎఫ్ఓ వంటి సీనియర్ మేనేజ్మెంట్ అధికారులకు సాధారణంగా మొదటి సందర్భంలోనే సమన్లుజారీ చేయకూడదు. ఆదాయాన్ని కోల్పోవడానికి దారితీసిన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారి ప్రమేయంపై జరిగిన దర్యాప్తులో వారి ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే వారిని పిలిపించాలి. ►మెటీరియల్ ఎవిడెన్స్, సంబంధిత పత్రాల కోసం ఫీల్డ్ ఆఫీసర్లు కంపెనీల ఉన్నతాధికారులను ‘ఏదో ఆషామాషీగా’ పిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, జీఎస్టీ పోర్టల్‌లో ఆన్లైన్లో అందుబాటులో ఉండే జీఎస్టీఆర్–3బీ, జీఎస్టీఆర్–వంటి చట్టబద్ధమైన రికార్డుల కోసం సైతం కంపెనీ అధికారులకు సమన్లు పంపుతున్నట్లు సమాచారం. జీఎస్టీ పోర్టల్‌లో డిజిటల్‌గా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన పత్రాల కోసం సమన్ల జారీ చేయడం ఎంతమాత్రం తగదు. సుప్రీంకోర్టు రూలింగ్‌కు అనుగుణంగా... అరెస్టుకు సంబంధించిన జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇటీవలి ఇచ్చిన ఒక తీర్పును పరిగణనలోకి రూపొందాయి. ‘‘చట్టబద్ధమైన రీతిలోనే, దీనిని అనుగుణంగా నడుచుకోలేదని స్పష్టమైన ఆధారాలతోనే ఒక అరెస్ట్ జరగాల్సి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు తన రూలింగ్‌లో పేర్కొంది. అరెస్టు చేసే అధికారం– దానిని అమలు చేయడానికి గల సమర్థనకు మధ్య తేడాను గుర్తించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆకర్షణీయం వివిధ సందర్భాల్లో సాధారణ విషయాల కోసం కంపెనీల సీనియర్ అధికారులకు సమన్లు జారీ అవుతున్నాయి. కంపెనీ పన్ను విభాగంతో పరిష్కారమయ్యే అంశాలకు సైతం సీనియర్ అధికారులకు సమన్లు తగవు. ఈ నేపథ్యంలో జీఎస్టీ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ మార్గదర్శకాలు హర్షణీయం. – అభిషేక్ జైన్, కేపీఎంజీ వేధింపులకు అడ్డుకట్ట తాజా మార్గదర్శకాలు కింది స్థాయి జీఎస్టీ అధికారుల విపతీరమైన విధింపులను అరికట్టడానికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాం. రజత్ మోహన్,ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ -
జాగో కన్జ్యూమర్! 40పైసల కోసం పోతే..
-
నీకు తిక్కుంది.. కానీ లెక్కలేదు.. పెద్దాయనకి ఫైన్ విధించిన కోర్టు
బెంగళూరు కన్సుమర్ కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ఆసక్తికరంగా మారింది. వినియోగదారుల హక్కులు, వ్యాపార సంస్థల బాధ్యతలను మరోసారి చర్చకు పెట్టింది. కేవలం నలభై పైసల కోసం జరిగిన విచారణ చివరకు మూలనపడిన ఓ కొత్త సర్క్యులర్ని బయటకు వెలికి తీసింది. బెంగళూరుకు చెందిన మూర్తి అనే సీనియర్ సిటిజన్ నగరంలో ఉన్న ఎంపైర్ అనే హోటల్‌కి వెళ్లి టేక్ అవేలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. బిల్లు రూ. 264.60లు అవగా హోటల్ వాళ్లు అతని నుంచి రూ. 265లు తీసుకున్నారు. హోటల్ యాజమాన్యం తన నుంచి అన్యాయంగా 40 పైసలు దోచుకున్నారంటూ కన్సుమర్ కోర్టును 2021 జనవరిలో ఆశ్రయించాడు. దీనికి పరిహారంగా ఒక రూపాయి నష్టపరిహారం ఇప్పించాలంటూ కోర్టును కోరాడు. ఈ కేసుకి సంబంధించి హోటల్ యాజమాన్యం ఇద్దరు లాయర్లను నియమించుకోగా మూర్తి తానే వాదనలు వినిపించాడు. ఎంఆర్పీ మీద అదనంగా డబ్బులు ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించాడు. జీఎస్టీ చట్టం 2017లోని సెక్షన్ 170 ప్రకారం.. కస్టమర నుంచి ఎక్కువ సొమ్ము తీసుకోలేదని.. అధికంగా తీసుకున్న 40 పైసలు కూడా ట్యాక్స్‌లో భాగమేనంటూ హోటల్ తరఫున న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో ఒకరు నలభై పైసలు నష్టపోగా.. మరొకరు దోషిగా తేలితే జరిమానాగా ఒక రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎవ్వరూ ఈ కేసులో వెనక్కి తగ్గకుండా తమ వాదనలు కోర్టులో వినిపిస్తూ వచ్చారు. ఈ కేసులో తీర్పు వెలువరించేందుకు వినియోగదారులకు సంబంధించిన అన్ని చట్టాలను, నిబంధనలను న్యాయమూర్తి చదవాల్సి వచ్చింది. చివరకు ఓ సర్క్యులర్ ఆధారంగా చేసుకుని న్యాయమూర్తి తన తీర్పును వెలువరించారు. కేసు పెట్టిన మూర్తి యాభై పైసల కంటే తక్కువ నష్టపోయినందున కేసును కొట్టి వేసింది. ఇదే సమయంలో కోర్టు సమయాన్ని పబ్లిసిటీ కోసం వృధా చేసినందుకు రూ. 4000 జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించింది. ఏడాదికి పైగా పలు దఫాలుగా విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తికి వినియోగదారుల హక్కులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో ఓ పాయింట్ దొరికింది. దాని ప్రకారం... ఎవరైనా యాభై పైసల కంటే తక్కువ నష్టపోతే దాన్ని ఇగ్నోర్ చేయవచ్చని పేర్కొంది. కానీ యాభై పైసలు అంతకంటే ఎక్కువ నష్టపోయిన పక్షంలో చట్ట ప్రకారం అతనికి న్యాయం జరగాల్సిందేనంటూ స్పష్టం చేసి ఉంది. -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రో ధర మండుతోంది. వరుసగా ఎనిమిదోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రోల్ ఏకంగా లీటరుకు 62 పైసలు, డీజిల్ లీటరుకు 64 పైసలు పెరిగింది. 2017లో రోజువారీ పెట్రోల్ ధరల కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఒకే రోజులో పెరిగిన అధిక మొత్తం ఇదే. పెరిగిన ధరల ప్రకారం డిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 75.78 కాగా, డీజిల్ ధర 74.03గా ఉంది. ఎనిమిది రోజుల్లో లీటరు పెట్రోలుపై రూ. 4.52, డీజిల్‌పై రూ. 4.64 పెరిగింది. జీఎస్టీ పరిధిలోకి చేర్చండి: కాంగ్రెస్ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా ఎనిమిదో రోజు పెంచడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను 2004 ఆగస్టు నాటి ధరల స్థాయికి వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ముడి చమురు ధరలు 2004 ధరల స్థాయిలోనే ఉన్నాయని గుర్తుచేశారు. పెట్రోల్, డీజిల్‌ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని అన్నారు. -
ఐసోలేషన్‌కు కాదు.. జైలుకు వెళ్లాడు
న్యూఢిల్లీ: బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ప్రధాన కార్యదర్శి అనేది ప్రతిష్టాత్మక పదవి. అందులోనూ దేశ రాజధానికి చెందిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో ఆ హోదాకు ఉండే విలువే వేరు. అలాంటి వ్యక్తి, డీడీసీఏ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న వినోద్ తిహారా నెలరోజులుగా కనిపించకుండా పోయాడు. కొందరు సన్నిహితులు చెప్పిన సమాచారం మేరకు ఆయనకు కరోనా సోకినట్లు అసోసియేషన్ సహచరులు భావించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కూడా కుటుంబసభ్యులు ఖరారు చేయడంతో అంతా అలాగే అనుకున్నారు. డీడీసీఏలో జరిగిన అవినీతి గురించి ఇటీవల విచారణ జరిగిన సమయంలో కూడా ఒక లాయర్ ఇదే విషయాన్ని చెప్పారు. అయితే అసలు సంగతి బయటపడటంతో అంతా అవాక్కయ్యారు. జీఎస్టీకి సంబంధించి ఒక కేసులో తిహారాను పోలీసులు అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఆయన మీరట్ జైల్లో ఉన్నారు. నేరం తీవ్రత స్పష్టత తెలియకపోయినా... జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించడంతోనే మార్చి 17న తిహారాను అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. మరోవైపు అసోసియేషన్‌కు సంబంధించిన ఒక కీలక పత్రంపై కూడా తిహారా సంతకం చేసినట్లు ఉండగా, అది అతను జైల్లో ఉన్న తేదీతో విడుదల కావడంతో డీడీసీఏ సభ్యులకు షాక్ తగిలింది. లాక్డౌన్ కారణంగా ఇప్పటి వరకు తిహారాకు బెయిల్ తీసుకునే అవకాశం లభించలేదు. -
తొలి ముద్ర తెలంగాణదే
న్యూఢిల్లీ : జీఎస్టీ బిల్లుకు ఇంకా ఏడు రాష్ట్రాలు ఆమోదముద్ర వేయాల్సి ఉందని కేంద్రం ప్రకటించింది. సోమవారం నాటికి జీఎస్టీకి 24 రాష్ట్రాలు ఆమోదముద్ర వేశాయి. బీజేపీ యేతర పాలిత కేరళ, కర్నాటక, తమిళనాడు, జమ్ము-కశ్మీర్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, మేఘాలయ రాష్ట్రాలు జీఎస్టీకి ఇంకా ఆమోదం తెలపలేదు. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు ఆమోదముద్ర వేయగా, అందులో తెలంగాణ అన్ని రాష్ట్రాలకన్నా మొదటగా ఆమోదం తెలిపింది. తెలంగాణ (9 ఏప్రిల్, 2017), బీహార్ (24 ఏప్రిల్), రాజస్థాన్ (26 ఏప్రిల్), జార్ఘండ్ (27 ఏప్రిల్), చత్తీస్ గఢ్ (28 ఏప్రిల్), ఉత్తరాఖంఢ్ (మే 2), మధ్యప్రదేశ్ (మే 3), హర్యానా (మే 4), గోవా, గుజరాత్ (మే 9), అస్సోం (మే 11), అరుణాచల్ ప్రదేశ్ (మే 12), ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ (మే 16), పాండిచ్చేరి (మే 17), ఒడిసా (మే 19), మహారాష్ట్ర (మే 22), త్రిపుర, సిక్కిం, మిజోరం (మే 25), నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్ (మే 27), ఢిల్లీ (మే 31), మణిపూర్ (జూన్ 5) జీఎస్టీకి ఆమోదముద్ర వేశాయి. -
నేడు హోటళ్లు బంద్
-
ఈ నెల 30న హోటళ్లు బంద్
తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ వెల్లడి హైదరాబాద్: జీఎస్టీ చట్టంతో హోటల్ రంగం మరింత కుదేలయ్యే పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న పన్ను.. నాన్ ఎసీ రెస్టారెంట్లకు 12 శాతం, ఎసీ రెస్టారెంట్లకు 18 శాతంగా నిర్ణయించడంతో హోటళ్లపై తీవ్ర ప్రభావం పడుతుం దన్నారు. ఇందుకు నిరసనగా ఆల్ ఇండియా హోటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు సౌత్ ఇండియా హోటల్స్ అసోసియేషన్‌లోని హోటళ్లు, తినుబండారాల వ్యాపారులు ఈ నెల 30న బంద్ పాటించాలన్నారు. 29వ తేదీ నుంచి 31 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని సూచించారు. జూన్ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ గౌరవ చైర్మన్ నాగరాజు, బేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బర్కత్ విలానీ, సెక్రటరీ జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ.. జీఎస్టీ చట్టం ద్వారా హోటళ్ల వారిని కొందరు అధికారులు వేధించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అశోక్ రెడ్డి, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీ బిల్లు.. ఇక చట్టం!
-
జీఎస్టీ బిల్లు.. ఇక చట్టం!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల బిల్లు (జీఎస్టీ బిల్లు) చట్టరూపం దాల్చింది. గత పదమూడేళ్లుగా ఆమోదానికి నోచుకోక చట్ట సభల్లోనే ఆగిపోయిన ఈ బిల్లును ఎట్టకేలకు పార్లమెంటు ఉభయ సభలతో పాటు ఇప్పటికే 16 రాష్ట్రాలు కూడా ఆమోదించడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీనిపై సంతకం చేశారు. దాంతో బిల్లు చట్టరూపం దాల్చినట్లయింది. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో.. కనీసం సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లే, 16 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. ఆగస్టు నెలలోనే లోక్‌సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లును ఆమోదించాయి.