న్యూఢిల్లీ: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) వంటి ఒక కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారులను ఆషామాషీగా పిలవడం (సమన్స్ జారీ), వారిని అరెస్ట్ చేయడం వంటి విధానాలను విడనాడాలని క్షేత్రస్థాయి కార్యాలయాలను జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఆదేశించింది. జీఎస్‌టీ చట్టం కింద యాంత్రిక పద్ధతిలో అరెస్టు చేసే విధానాలకు పాల్పడవద్దని స్పష్టం చేసింది. ప్రత్యక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) పర్యవేక్షణలో పనిచేసే ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఈ మేరకు ఫీల్డ్ ఆఫీసర్లకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వీటికి సంబంధించి కొన్ని కీలకాంశాలను చూస్తే..
►ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛ అరెస్టు వల్ల దెబ్బతింటుంది. అటువంటి చర్య విశ్వసనీయమైన అంశాల ఆధారంగా ఉండాలి. అరెస్టును మామూలుగా, యాంత్రికంగా చేయకూడదు.
►జీఎస్‌టీ ఎగవేత ఆరోపణలకు సంబంధించి నేరస్థుడిని అరెస్టు చేయాలనుకుంటే, సంబంధిత అధికారుల కోసం మార్గదర్శకాల చెక్‌లిస్ట్‌ను కూడా ఫీల్డ్ ఆఫీసర్లు పరిగణనలోకి తీసుకోవాలి. నేరస్థుడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా లేదా సాక్షులను బెదిరించే అవకాశం ఉందా, నేరానికి ఆ వ్యక్తి సూత్రధారా? వంటి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు సరిచేసుకోవాలి.
►చట్టపరమైన అవసరాలను నెరవేర్చడమే కాకుండా, ఒక వ్యక్తిని అరెస్టు చేయాలని నిర్ణయించే ముందు సంబంధిత అంశాలు తప్పనిసరిగా సరైన దర్యాప్తుతో నిర్ధారించుకోవాలి. సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సాక్షులను బెదిరించడం లేదా ప్రభావితం చేయడం వంటి అవకాశాలను నిరోధించడానికి, ఆ అవసరం ఏర్పడినప్పుడే అరెస్టులు జరగాలి.
►ఏదైనా కంపెనీ లేదా పీఎస్‌యూ (ప్రభుత్వ రంగ సంస్థ) సీఎండీ, ఎండీ, సీఈఓ, సీఎఫ్‌ఓ వంటి సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారులకు సాధారణంగా మొదటి సందర్భంలోనే సమన్లుజారీ చేయకూడదు. ఆదాయాన్ని కోల్పోవడానికి దారితీసిన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారి ప్రమేయంపై జరిగిన దర్యాప్తులో వారి ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే వారిని పిలిపించాలి.
►మెటీరియల్ ఎవిడెన్స్, సంబంధిత పత్రాల కోసం ఫీల్డ్ ఆఫీసర్లు కంపెనీల ఉన్నతాధికారులను ‘ఏదో ఆషామాషీగా’ పిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, జీఎస్‌టీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే జీఎస్‌టీఆర్–3బీ, జీఎస్‌టీఆర్–వంటి చట్టబద్ధమైన రికార్డుల కోసం సైతం కంపెనీ అధికారులకు సమన్లు పంపుతున్నట్లు సమాచారం. జీఎస్‌టీ పోర్టల్‌లో డిజిటల్‌గా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన పత్రాల కోసం సమన్ల జారీ చేయడం ఎంతమాత్రం తగదు.
సుప్రీంకోర్టు రూలింగ్‌కు అనుగుణంగా...
అరెస్టుకు సంబంధించిన జీఎస్‌టీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇటీవలి
ఇచ్చిన ఒక తీర్పును పరిగణనలోకి రూపొందాయి. ‘‘చట్టబద్ధమైన రీతిలోనే, దీనిని అనుగుణంగా నడుచుకోలేదని స్పష్టమైన ఆధారాలతోనే ఒక అరెస్ట్ జరగాల్సి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు తన రూలింగ్‌లో పేర్కొంది. అరెస్టు చేసే అధికారం– దానిని అమలు చేయడానికి గల సమర్థనకు మధ్య తేడాను గుర్తించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆకర్షణీయం
వివిధ సందర్భాల్లో సాధారణ విషయాల కోసం కంపెనీల సీనియర్ అధికారులకు సమన్లు జారీ అవుతున్నాయి. కంపెనీ పన్ను విభాగంతో పరిష్కారమయ్యే అంశాలకు సైతం సీనియర్ అధికారులకు సమన్లు తగవు. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ మార్గదర్శకాలు హర్షణీయం.
– అభిషేక్ జైన్, కేపీఎంజీ
వేధింపులకు అడ్డుకట్ట
తాజా మార్గదర్శకాలు కింది స్థాయి జీఎస్‌టీ అధికారుల విపతీరమైన విధింపులను అరికట్టడానికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాం. రజత్ మోహన్,ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్
Comments
Please login to add a commentAdd a comment