ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వినోద్ తిహారా
న్యూఢిల్లీ: బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ప్రధాన కార్యదర్శి అనేది ప్రతిష్టాత్మక పదవి. అందులోనూ దేశ రాజధానికి చెందిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో ఆ హోదాకు ఉండే విలువే వేరు. అలాంటి వ్యక్తి, డీడీసీఏ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న వినోద్ తిహారా నెలరోజులుగా కనిపించకుండా పోయాడు. కొందరు సన్నిహితులు చెప్పిన సమాచారం మేరకు ఆయనకు కరోనా సోకినట్లు అసోసియేషన్ సహచరులు భావించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కూడా కుటుంబసభ్యులు ఖరారు చేయడంతో అంతా అలాగే అనుకున్నారు.
డీడీసీఏలో జరిగిన అవినీతి గురించి ఇటీవల విచారణ జరిగిన సమయంలో కూడా ఒక లాయర్ ఇదే విషయాన్ని చెప్పారు. అయితే అసలు సంగతి బయటపడటంతో అంతా అవాక్కయ్యారు. జీఎస్టీకి సంబంధించి ఒక కేసులో తిహారాను పోలీసులు అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఆయన మీరట్ జైల్లో ఉన్నారు. నేరం తీవ్రత స్పష్టత తెలియకపోయినా... జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించడంతోనే మార్చి 17న తిహారాను అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. మరోవైపు అసోసియేషన్‌కు సంబంధించిన ఒక కీలక పత్రంపై కూడా తిహారా సంతకం చేసినట్లు ఉండగా, అది అతను జైల్లో ఉన్న తేదీతో విడుదల కావడంతో డీడీసీఏ సభ్యులకు షాక్ తగిలింది. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటి వరకు తిహారాకు బెయిల్ తీసుకునే అవకాశం లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment