
న్యూఢిల్లీ: పెట్రో ధర మండుతోంది. వరుసగా ఎనిమిదోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రోల్ ఏకంగా లీటరుకు 62 పైసలు, డీజిల్ లీటరుకు 64 పైసలు పెరిగింది. 2017లో రోజువారీ పెట్రోల్ ధరల కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఒకే రోజులో పెరిగిన అధిక మొత్తం ఇదే. పెరిగిన ధరల ప్రకారం డిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 75.78 కాగా, డీజిల్ ధర 74.03గా ఉంది. ఎనిమిది రోజుల్లో లీటరు పెట్రోలుపై రూ. 4.52, డీజిల్‌పై రూ. 4.64 పెరిగింది.
జీఎస్టీ పరిధిలోకి చేర్చండి: కాంగ్రెస్
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా ఎనిమిదో రోజు పెంచడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను 2004 ఆగస్టు నాటి ధరల స్థాయికి వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ముడి చమురు ధరలు 2004 ధరల స్థాయిలోనే ఉన్నాయని గుర్తుచేశారు. పెట్రోల్, డీజిల్‌ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని అన్నారు.