రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియ మరింత సులభం చేస్తూ పన్ను చెల్లింపు దారులకు, వ్యాపారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నూతన ఆవిష్కరణలు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ ట్యాక్స్ విజన్, మిషన్ వ్యాల్యూస్, 'జీఎస్టీ మిత్ర' లోగోను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు.
జీఎస్టీ నెట్ వర్క్, మొబైల్ నంబర్ నమోదుతో పన్నుదారులకు ఓటీపీ ఆధారంగా మరింత సులువుగా సేవలు అందించడంతో పాటు పన్ను చెల్లింపులు, ఆర్థిక సంవత్సరాల నివేదికలు సహా ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయని పలువురు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ నిర్వహణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ వల్లే పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవల కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించి వాణిజ్య శాఖలో వినూత్న ఆవిష్కరణలు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. నిజాయితీగా పన్నులు కట్టే వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాలకు సంబంధించిన భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాము అవలంభిస్తున్న విధానాలతో గతేడాది నెలతో పోలిస్తే 31 శాతం గణనీయమైన వృద్ధితో పురోగతి సాధించామన్నారు.
వృద్ధి రేటులో తమిళనాడు(20%), కేరళ(20%), తెలంగాణ(18%), కర్ణాటక(17%), ఒడిశా(3%) కన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందని మంత్రి వివరించారు. అంతేగాక నవంబర్, 2023 వరకు రూ.21,180.57 కోట్ల జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు చేసి 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. జీఎస్టీ వసూళ్లలో గతేడాది కన్నా 17.14 శాతం గణనీయమైన వృద్ధి సాధించామన్నారు.
జీఎస్టీ ఎగవేతలను అరికట్టడంతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 12 జీఎస్టీ సేవాకేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేకించి విజయవాడ నంబర్ 1 డివిజన్ లో మొదటి జీఎస్టీ సేవా కేంద్రం ప్రారంభించడం మైలురాయిగా భావిస్తున్నామన్నారు. కొందరు ఇన్‌పుట్ టాక్స్ ఎగవేతలకు దొడ్డిదారులను ఎంచుకుంటున్నారని తద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని మంత్రి అన్నారు.
జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని మంత్రి అన్నారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామన్నారు. భారత దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాలలో మాత్రమే ఉందని తెలిపారు. ట్యాక్స్ కట్టే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో ట్యాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు. ట్యాక్స్ కట్టే వారి వల్లే దేశం నడుస్తుందని అన్నారు. గతంలో మాదిరి పన్నులు ఎగ్గొట్టే వారిని పట్టుకోవడం కన్నా.. పన్ను వసూళ్లను సరళతరం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
విజన్ స్టేట్ మెంట్ ఉండటం ప్రతి వ్యవస్థకు అవసరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఆర్థిక శాఖకు సంబంధించి స్టేట్ ట్యాక్సెస్ కు ఒక విజన్ ఇచ్చిన రోజును తన జీవితంలో మరిచిపోలేనని మంత్రి చెప్పారు. పలువురు ఉన్నతాధికారులను కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసి, వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పలు అంశాలను అధ్యయనం చేశామన్నారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీలు, పదుల సంఖ్యలో సమీక్షలు చేయడం ద్వారా ఇబ్బందులను పరిష్కరించి, సవాళ్లను అధిగమించామని చెప్పారు. తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులకు 'శిక్షణ' ఆవశ్యకతను గుర్తించానన్నారు. గత కొన్నేళ్లలో నిర్వర్తించిన బాధ్యతలు సంతృప్తికరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత, సరళతర విధానాలను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా వెబ్ సైట్ ను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. టాక్స్ పేయర్, వాణిజ్య పన్నుల శాఖ సమన్వయంతోనే పారదర్శకత సాధ్యమైందన్నారు. ఇతర దేశాల్లో మాదిరి పన్ను చెల్లింపుల వ్యవహారంలో మన రాష్ట్రంలో వేధింపులకు తావు లేదన్నారు.
పన్ను చెల్లింపుదారులే లేకపోతే వాణిజ్య పన్నుల శాఖ లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ తెలిపారు. వాణిజ్య పన్నులు, వసూళ్ల సరళతరం కోసం ఎన్నో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. పన్నుల వసూళ్లలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ ముందుందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో పాత విధానాలకు స్వస్తి పలికి..సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికామన్నారు. పన్ను చెల్లించే వారికి ఏ ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న రెండు మూడేళ్లలో మరిన్ని కీలక మార్పులతో ముందుకు వెళ్తామన్నారు.
వాణిజ్య పన్నులు, జీఎస్టీలో సాంకేతిక పరిజ్ఞానం అమలులో ఏపీ ముందడుగు వేసిందని జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి అన్నారు. గొప్ప ఆవిష్కరణలు, సంస్కరణలకు వేదికగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు.
అర్ధశాస్త్రంలో పన్ను వసూలు గురించి కౌటిల్యుడు చెప్పిన 5 ప్రధాన అంశాలను ప్రామాణికంగా తీసుకున్నామని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్ పేర్కొన్నారు. జీఎస్టీలో రూ.8 వేల కోట్ల నుంచి రూ.23 వేల కోట్ల వరకూ ఎదిగామని తెలిపారు.
బోగస్ రిజిస్ట్రేషన్లు అరికట్టేలా వాణిజ్య శాఖలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని అవి సత్ఫలితాలిస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల విషయంలో పారదర్శక విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ సంస్కరణల వల్ల జీఎస్టీలో ఏపీ మెరుగైన ప్రతిభను కనబరుస్తుందన్నారు.
రాష్ట్ర పన్నుల శాఖ స్థితిని, గతిని, దశను, దిశను ఉన్నత స్థాయికి పెంచి దేశస్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను పలువురు అధికారులు కొనియాడారు. రాష్ట్ర పన్నుల శాఖలో సంస్కరణలు తేవాలని, ఈ శాఖను సేవా విభాగంగా చేయాలని, పారదర్శకతను పెంచాలని, టెక్నాలజీని అందిపుచ్చుకొని మెరుగైన సేవలను అందిస్తూ ఆర్థిక వృద్ధిని సాధించాలని చెప్పి ఆచరణలో చూపించిన వ్యక్తి, అరుదైన ఆర్థిక నిపుణులు బుగ్గన రాజేంద్రనాథ్ అని పలువురు అధికారులు అభివర్ణించారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్, జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జర్, స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, గుంటూరు సెంట్రల్ టాక్సెస్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి, వాణిజ్యవేత్తలు, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు, ఆడిటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment