సుస్థిరాభివృద్ధికి నాలుగు స్తంభాలు | Minister Buggana Said Budget Was being Introduced to achieve Sustainable Development | Sakshi
Sakshi News home page

సుస్థిరాభివృద్ధికి నాలుగు స్తంభాలు

Published Sat, Mar 12 2022 3:47 AM | Last Updated on Sat, Mar 12 2022 11:57 PM

Minister Buggana Said Budget Was being Introduced to achieve Sustainable Development - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ సుస్థిరాభివృద్ధిని సాధించే దిశగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. మానవ సామర్థ్యం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధికి మద్దతు, సామాజిక భద్రత లక్ష్యాలను నవరత్నాలతో ఏకీకరణ చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకుంటున్నట్లు తెలిపారు. సుస్థిరాభివృద్ధికి ఈ నాలుగు స్తంభాలు కీలకం అని చెప్పారు. శుక్రవారం ఆయన వార్షిక బడ్జెట్‌ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్‌డీజీ ఇండియా 2020–21 నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు–పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి – సముద్ర జలజీవుల పరిరక్షణ వంటి అంశాల్లో రాష్ట్రం 5వ స్థానంలో ఉందన్నారు.

నాడు–నేడు, జగనన్న అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ వైద్య శాలలు, వైద్య కళాశాలలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో మానవ సామర్థ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. వైఎస్సార్‌ జలయజ్ఞం, వైఎస్సార్‌ జలకళ, రహదారుల అభివృద్ధి, కొత్త ఓడరేవులు, నౌకాశ్రయాలు, వ్యవసాయం–పాడి పరిశ్రమలో మౌలిక సదుపాయాల కల్పన, జగనన్న కాలనీలు, వైఎస్సార్‌ హౌసింగ్‌ వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

మంత్రి బుగ్గనకు బడ్జెట్‌ పత్రాలతో కూడిన బ్యాగ్‌ను అందజేస్తున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు 

జీవనోపాధి విషయానికి వస్తే వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ జలకళ, ధరల స్థిరీకరణ నిధి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, పాల శీతలీకరణ కేంద్రాలు, ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీ వంటి పథకాలతో రాష్ట్రంలో 62 శాతం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం సమగ్ర దృష్టితో అభివృద్ధి చేస్తోందన్నారు. సామాజిక భద్రతలో భాగంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 61.74 లక్షల మందికి  ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్‌ చొప్పున వృద్ధాప్య ఫించన్‌ అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌ వంటి సంక్షోభాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఇందుకు సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు చెప్పారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే..  

వ్యవసాయానికి పెద్ద పీట 
వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ యోజన కింద ఇప్పటి వరకు రూ.20,117.59 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ కింద నేరుగా రైతుల ఖాతాలో జమ చేశాం. ఈ పథకం కోసం 2022–23 ఏడాదికి రూ.3,900 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం.  
వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద గత ప్రభుత్వ బకాయిలను కూడా కలిపి ఇప్పటి వరకు రూ.3,702.02 కోట్లు రైతుల ఖాతాలో వేశాం. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.1,802 కోట్లు కేటాయిస్తున్నాం.  
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద గత ప్రభుత్వ బకాయిలతో కలిపి ఇప్పటికే రూ.1,185 కోట్లు ఇవ్వగా, బడ్జెట్‌లో వచ్చే ఏడాది కోసం రూ.500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలకు రూ.50 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి కేంద్ర కేటాయింపులకు అదనంగా రూ.500 కోట్లు, వైఎస్సార్‌ వ్యవసాయ పరీక్షా కేంద్రాలకు రూ.50 కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.5,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్ద పీట వేయడంతో పాటు పశు సంవర్థక, మత్స్య అభివృద్ధికి రూ.1,568.83 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.  

వైద్య రంగానికి గత ఏడాది కంటే 11.23 శాతం అధికం  
నీతి ఆయోగ్‌ వైద్య సూచిక 2021 నివేదిక ప్రకారం రెండేళ్ల క్రితం నాల్గవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది. రూ.1,000 కంటే ఎక్కువ ఖర్చు అయ్యే చికిత్సలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం.  
ఇప్పటికే 1.4 కోట్ల వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డులు జారీ చేశాం. దీంతో 2019–20లో ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చే కుటుంబాల శాతం 74.6 నుంచి 2021–22 నాటికి 91.27 శాతానికి చేరుకుందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4వ విడత నివేదికలో పేర్కొంది. 
వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద రూ.489.61 కోట్లు, ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌ బాధితులకు రూ.732.16 కోట్లు చికిత్స వ్యయాన్ని ప్రభుత్వం భరించింది. 2022–23లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.300 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 
104లను మండలానికి ఒకటి చొప్పున 292 నుంచి 656కు పెంచాం. 560 వైఎస్సార్‌ పట్టణ క్లినిక్‌లను మంజూరు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం సీతమ్మపేట, పార్వతీపురం, ఆర్‌సీవరం, బుట్టాయిగూడెం, దోర్నాలలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు పాడేరులో గిరిజన వైద్య కళాశాల మంజూరు చేశాం.  
2022–23 సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,384.26 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇది గత బడ్జెట్‌ ప్రతిపాదన కంటే 11.23 శాతం అధికం.  
చిన్నారుల సంక్షేమమే లక్ష్యం 
గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు పోషకాహార నాణ్యత పెంపునకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ.. సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలపై కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల కంటే రూ.1,560 కోట్లు అదనంగా వ్యయం చేశాం.  
కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతను ప్రభుత్వం స్వీకరించింది. ఒక్కో చిన్నారికి రూ.10 లక్షల చొప్పున 298 మందికి పరిహారం ఇచ్చాం. వైఎస్సార్‌ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా కౌమార దశలో ఉన్న బాలికలకు నెలకు 10 బ్రాండెడ్‌ శానిటరీ నా‹ప్‌కిన్‌లను ఉచితంగా అందిస్తున్నాం.
 
మహిళా పక్షపాతం 
కేవలం రెండేళ్లలో లింగ సమానత్వ సూచీలోరాష్ట్ర ప్రభుత్వం 12 ర్యాంకులు మెరుగు పరుచుకొని 5వ స్థానానికి చేరుకుంది. వైఎస్సార్‌ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.12,757.97 కోట్లు స్వయం సహాయక సంఘాలకు విడుదల చేశాం. ఈ పథకానికి 2022–23లో రూ.6,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 
స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు రూ.1,789 కోట్లు చెల్లించగా, బడ్జెట్‌లో రూ.800 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. చేయూత పథకానికి రూ.4,235.95 కోట్లతో పాటు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ.4,322.86 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.  

సంక్షేమ ప్రభుత్వం 
పేదల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఎన్నికలకు ముందు కొంత మందికి పెన్షన్‌ పెంచిన వారికి ఇప్పుడు మాట్లాడటానికి అర్హత లేదు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వడానికి వైఎస్సార్‌ పింఛన్‌ పథకం కోసం 2022–23 సంవత్సరానికి రూ.18,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 
వైఎస్సార్‌ బీమా పథకం కోసం రూ.372.12 కోట్లు, వైఎస్సార్‌ వాహన మిత్ర కోసం రూ.260 కోట్లు, వైఎస్సార్‌ నేతన్న నేస్తం కోసం రూ.200 కోట్లు, తోపుడు బండ్ల వారి కోసం జగనన్న తోడుకు రూ.25 కోట్లు, రజకులు–కుట్టుపని–నాయిబ్రాహ్మణులకు జగనన్న చేదోడు కోసం రూ.300 కోట్లు, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కోసం రూ.590 కోట్లు, వైఎస్సార్‌ లా నేస్తం కు రూ.15 కోట్లు, వైఎస్సార్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.  
అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి, షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక కోసం రూ.18,518 కోట్లు, షెడ్యూల్డ్‌ తెగల ఉప ప్రణాళిక కోసం రూ.6,145 కోట్లు, వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక కోసం 29,143 కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం రూ.3,661 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,537 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement