AP Govt Presents Rs 2. 56 Lakh Crore Budget for 2022-23 Telugu - Sakshi
Sakshi News home page

AP Budget: మరో ముందడుగు.. రూ.2,56,256.56 కోట్లతో వార్షిక బడ్జెట్‌

Published Sat, Mar 12 2022 2:33 AM | Last Updated on Sat, Mar 12 2022 9:06 AM

Andhra Pradesh Govt Presents Rs 2. 56 Lakh Crore Budget for 2022-23 - Sakshi

ఏ కుటుంబానికైనా ఆరోగ్యం, విద్య అత్యంత ముఖ్యం. పిల్లలను బాగా చదివించుకోవడానికి సహకారం అందడం.. ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు బారిన పడితే ఆదుకునే వారుండటం.. సింహ భాగం ప్రజలు ఆశించేది ఇంతే. దీనికి జీవనోపాధి కల్పన కూడా తోడయితే మహానందమే. ఇంకా సామాజిక భద్రత కూడా లభిస్తే.. రైతన్న ముఖంలో చెరగని చిరునవ్వు కనిపిస్తే.. శరవేగంగా అభివృద్ధికి రూట్‌ మ్యాప్‌ సిద్ధమై అమలైతే.. ఏ విషయంలోనూ మన అక్కచెల్లెమ్మలు తక్కువ కాదంటూ వారికి అన్నింటా పెద్ద పీట వేస్తే.. అన్ని రంగాలు అభివృద్ధి వైపు దౌడు తీసేలా నిధుల కేటాయింపు జరిగితే.. ఎక్కడైనా ఇవన్నీ సాకారం అయ్యేలా అడుగులు పడుతున్నాయంటే అక్కడ జనరంజక పాలన సాగుతున్నట్టే.. పేదరికాన్ని జయించడానికి బాణం ఎక్కు పెట్టినట్టే.. సరిగ్గా రాష్ట్రంలో ఇప్పుడదే జరుగుతోంది. ఇవాళ్టి బడ్జెట్‌లో మన కళ్లెదుట సాక్షాత్కరించింది.  

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అన్ని రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. అభివృద్ధి, సంక్షేమం సమతుల్యతతో అన్ని వర్గాలకు అండగా నిలిచే విధంగా రూపొందించిన 2022–23 ఆర్థిక ఏడాదికి మొత్తం 2,56,256.56 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టారు. పేదరికాన్ని జయించడమే చాలా సమస్యల పరిష్కారానికి సరైన మార్గం అని, ఆ దిశగా బడ్జెట్‌ రూపకల్పన, నిధుల కేటాయింపు జరిగేలా సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే లక్ష్య సాధనకు ఇంజన్‌లా పనిచేస్తున్న ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, సామాజిక భద్రత అంశాలకు బడ్జెట్‌ సమ ప్రాధాన్యత ఇచ్చింది.

మంచి ఆరోగ్యం ఉంటే అన్నీ సాధించడం సులభం అని జగన్‌ ప్రభుత్వం గట్టిగా నమ్మింది. ఇందు కోసం ప్రజారోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన విద్య అందించి మానవ సామర్థ్యాల అభివృద్ధిని సాకారం చేయాలనే లక్ష్యంతో విద్యా రంగానికి కేటాయింపులు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ప్రజలకు సముచిత పని కల్పించడం ద్వారా జీవనోపాధి అందించడం, ఆర్థికాభి వృద్ధిలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం, ఫలితంగా ప్రగతికి బాటలు వేయడానికి బడ్జెట్‌ రూపకల్పనలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సమాజంలో అసమానతలు తగ్గించి ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించడాన్ని ప్రభుత్వం అత్యున్నత లక్ష్యంగా నిర్ధారించుకున్న విషయాన్ని బడ్జెట్‌ తీరు స్పష్టం చేస్తోంది. వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు వెనక ఉన్న మూలాధార సూత్రాన్ని బడ్జెట్‌ ప్రతిబింబించింది. 

మహిళా సాధికారత దిశగా..
మహిళా సాధికారత లక్ష్యంగా ప్రత్యేకంగా జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ను రెండోసారి వరుసగా అసెంబ్లీకి సమర్పించారు. మహిళల కోసమే ప్రత్యేకంగా వ్యయం చేసేందుకు రూ.55,015.20 కోట్లు, పిల్లలు, చిన్నారుల  కోసం ప్రత్యేకంగా రూ.16,903.17 కోట్లు కేటాయించారు.
వైఎస్సార్‌ చేయూత కింద మహిళల కోసం రూ.4,235.95 కోట్లు, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్‌ ఆసరా కోసం రూ.6,400 కోట్లు కేటాయించారు. 
ఎన్నికల మేనిఫెస్టోలోని నవరత్నాలకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు, కాపులు, ఈబీసీల సంక్షేమానికి భారీ కేటాయింపులు చేస్తూనే మరో పక్క వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీటి మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు.
స్థానిక అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సంక్షేమం పెంచడానికి, సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను పెంచడానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధి కింద ప్రతి ఎమ్మెల్యే పరిధిలో రెండు కోట్ల రూపాయల నిధి చొప్పున రూ.350 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
నవరత్నాల పథకాల అమలుకు తగినన్ని నిధులు కేటాయిస్తూ ఐదు కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే స్థాయిలో బడ్జెట్‌ కేటాయింపులు చేశారు. బడ్జెట్‌లో ఎక్కడా దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకతను ప్రదర్శించారు. ఏ ఏ రంగాలకు ఏ ఏ వర్గాలకు ఏ ఏ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టంగా బడ్జెట్‌లో వివరించారు. 

ఆ రంగాలకు పెద్దపీట
విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు భారీగా పెంచారు. వైద్య, ఆరోగ్య రంగంలో నాడు–నేడు కింద మౌలిక సదుపాయాల కల్పనకు బడ్టెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఏ వర్గాన్నీ విస్మరిం చకుండా అన్ని వర్గాలకు కేటాయింపులు చేశారు. ఇచ్చిన మాట మేరకు ఆటో డ్రైవర్లకు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్య కారులు, దర్జీలు, చేనేత కార్మికులు, బ్రాహ్మణులు, లాయర్లు, చిరు వ్యాపారులకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ అనుబంధ రంగాలకు, ఆ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కలిపి వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్‌లో రూ.43,052 కోట్లు కేటాయించారు. రైతుల సంక్షేమానికి పలు కేటాయింపులు చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా కోసం రూ.3,900 కోట్లు, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కోసం రూ.1,802.04 కోట్లు కేటాయించారు. రైతులకు సున్నా వడ్డీ పంట రుణాల కోసం రూ.500 కోట్లు కేటాయించారు.
విద్యా రంగానికి రూ.30,077.20 కోట్లు కేటాయించారు. ఈ రంగంలో నాడు–నేడు కోసం రూ.3,500 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి రూ.15,384.26 కోట్లు కేటాయించారు. ఇందులో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌కు రూ.2,600 కోట్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కోసం రూ.2,848.00 కోట్లు కేటాయించారు. 

సంక్షేమ పెన్షన్లకు భారీగా..
అన్ని రకాల సంక్షేమ పెన్షన్లకు భారీ కేటాయింపులు దక్కాయి. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద బడ్జెట్‌లో రూ.18,000 కోట్లు కేటాయించారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,482.37 కోట్లు కేటాయించారు. పేదల గృహాల నిర్మాణాల కోసం రూ.4,791.69 కోట్లు, వివిధ రంగాల్లో సంక్షేమానికి రూ.45,955.07 కోట్లు కేటాయించారు. 
జగనన్న అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు, ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.18,518 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.6,145 కోట్లు, బీసీ ఉప ప్రణాళికకు రూ.29,143 కోట్లు, మైనారిటీ ఉప ప్రణాళికకు రూ.3,662 కోట్లు, కాపుల సంక్షేమానికి రూ.3,532 కోట్లు, ఈబీసీల సంక్షేమానికి రూ.6,669 కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. గ్రామీణాభివృద్ధికి రూ.17,109.06 కోట్లు కేటాయించారు. 

రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు
రూ.2,56,256.56 కోట్ల బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూల ధన వ్యయం రూ.30,679.57 కోట్లు, మరో రూ.16,270.18 కోట్లు క్యాపిటల్‌ డిస్‌బర్స్‌మెంట్‌ (మూల ధన పంపిణీ) ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ.17,036.15 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724.11 కోట్లు ఉంటుందని అంచనా. రెవెన్యూ రాబడి రూ.1,91,225.11 కోట్లు ఉంటుందని, ఇందులో కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.33,050.00 కోట్లు, పన్ను ఆదాయం రూ.91,049.61 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.11,092.50 కోట్లు, గ్రాంట్లు రూపంలో రూ.56,033.00 కోట్లు ఉంటుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుండటంతో పాటు అప్పులు తగ్గు తుండటంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం తగ్గుతూ వస్తోంది. 2020–21 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35.53% ఉండగా, 2021–22లో సవరించిన అంచనాల్లో అది 32.51 శాతానికి తగ్గింది. అలాగే 2022–23 ఆర్థిక ఏడాదిలో 32.79% ఉంటుందని అంచనా. 

బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
అసెంబ్లీ ప్రారంభానికి ముందు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో 2022–23 బడ్జెట్‌కు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్‌ ప్రతులను సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సమీర్‌శర్మ, ఫైనాన్స్‌ స్పెషల్‌ సీఎస్‌ రావత్, జీఏడీ (సర్వీసెస్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ఎం) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శులు సత్యనారాయణ, గుల్జార్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement