సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో 60–సీ నిబంధన కింద 268 పనుల నుంచి పాత కాంట్రాక్టర్లను తొలగించటం.. వాటి అంచనా వ్యయం పెంచాక రూ.1,600 కోట్ల విలువైన పనులను సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. ఒకే సంస్థకు అన్ని పనులు ఎలా అప్పగించారని హంద్రీ–నీవా, గాలేరు–నగరి అధికారులను ప్రశ్నించింది. గురువారం హంద్రీ–నీవా పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి.. శుక్రవారం, శనివారం విజయవాడలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో చేపట్టిన ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని పోలవరం అతిథి గృహంలో సమావేశమైంది.
పోలవరం కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాల పనులను పర్యవేక్షించే ఎస్‌ఈలు, ఈఈలు, హంద్రీ–నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాల సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు ఈ సమావేశానికి హాజరయ్యారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అధిక శాతం పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి 60–సీ నిబంధన కింద తప్పించి.. వాటి అంచనా వ్యయాన్ని పెంచేసి ముగ్గురు కాంట్రాక్టర్లకే అప్పగించడాన్ని నిపుణుల కమిటీ గుర్తించింది. హంద్రీ–నీవాలో పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఎనిమిది ప్యాకేజీల కాంట్రాక్టర్లను 60–సీ నిబంధన కింద తొలగించి.. కొత్త కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని గుర్తించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగించారని నిలదీసింది. పోలవరం కుడి కాలువ పనుల్లోనూ ఇదే రీతిలో వ్యవహరించడాన్ని తప్పుబట్టింది. శుక్రవారం, శనివారం విజయవాడలో నిర్వహించే సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరుకావాలని ప్రాజెక్టుల అధికారులను కమిటీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment