* 25 ప్రాజెక్టు పనుల వేగవంతంపై సర్కారు కసరత్తు
* వాటి ఆయకట్టు లక్ష్యం 31లక్షల ఎకరాలు.. చేరుకుంది 7లక్షల ఎకరాలే
* ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యల పరిష్కారంపై దృష్టి
* నేడు ప్రాజెక్టులపై ప్రభుత్వం ‘మారథాన్’ సమీక్ష
* ఎస్కలేషన్ జీవో, భూసేకరణ గైడ్‌లైన్స్‌పై అధికారులకు అవగాహన
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు లక్ష్యాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సాగునీటి ప్రాజెక్టులకు ఏటా నిధుల వరద పారుతున్నా... అనుకున్న స్థాయిలో ఆయకట్టుకు నీరు అందడం లేదు.
దీంతో తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యమిచ్చి.. వాటిల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంపై కసరత్తు చేస్తోంది. భూసేకరణ, పరిహారం, ఎస్కలేషన్ చెల్లింపులపై ఓ స్పష్టత వచ్చినందున పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా గురువారం మంత్రి హరీశ్‌రావు నీటి పారుదల శాఖ అధికారులతో ప్రాజెక్టుల వారీగా ‘మారథాన్’ సమీక్ష నిర్వహించనున్నారు.
భారీ వ్యయంతో..
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటివరకు భారీగా నిధులు ఖర్చు చేశారు. 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కోసం 2004 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.32 వేల వరకు ఖర్చు చేశారు. వీటిలో 29.19 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్న 13 భారీ ప్రాజెక్టులకు రూ.30 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. కానీ ఇంతవరకు అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు కేవలం 6.51 లక్షల ఎకరాలే. మరో 23 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాల్సి ఉంది.
ఇక 1.62 లక్షల ఆయకట్టు లక్ష్యంగా ఉన్న 12 మధ్యతరహా ప్రాజెక్టులకు ఇప్పటికే రూ.1,528 కోట్లు ఖర్చు చేసినా 35వేల ఎకరాలకే నీరివ్వగలిగారు. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీటిని ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి, ఖమ్మం జిల్లాకు చెందిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు 80 శాతానికిపైగా పూర్తయ్యాయి.
ఏఎమ్మార్పీ, దేవాదుల వంటి ప్రాజెక్టుల నుంచి ఇప్పటికే పాక్షికంగా నీటిని కూడా విడుదల చేశారు. అలాగే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల నుంచి వచ్చే ఖరీఫ్ సీజన్‌లో నీటిని ఇవ్వడానికి అవకాశముంది. అయితే ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ సమస్యలు, పరిహారంలో జాప్యం, ఎస్కలేషన్ చార్జీలను పెంచాలన్న కాంట్రాక్టర్ల డిమాండ్‌పై తేల్చడంలో జాప్యం ఆయకట్టు లక్ష్యాన్ని నీరుగార్చాయి.
నేడు సమీక్ష
ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంపై ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈ, ఈఈ, డీఈలతో మంత్రి హరీశ్‌రావు గురువారం సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. వరంగల్‌లోని దేవాదుల, మహబూబ్‌నగర్‌లోని భీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో రైల్వే క్రాసింగ్, జాతీయ రహదారుల(ఎన్‌హెచ్)కు సంబంధించిన సమస్యలున్నాయి.
వీటిని పూర్తి చేసుకోగలిగితే వచ్చే జూలై నాటికి సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 21 రైల్వే, 6 ఎన్‌హెచ్ క్రాసింగ్‌లకు సంబంధించిన సమస్యలున్నాయని అధికారులు తేల్చారు. వీటితో పాటు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ, పరిహారం సమస్యలున్నాయి. వీటన్నింటిపై గురువారం నాటి సమావేశంలో విడివిడిగా సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు.
పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి
Published Thu, Oct 15 2015 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM
Advertisement