అరకొర విదిలింపు
ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఈ సారీ మొండిచేయే
తాండవకు రూ.3.05 కోట్లు
రైవాడకు రూ.6.10 లక్షలు
కోనాంకు రూ.5.60 లక్షలు
సాగునీటి ప్రాజెక్టులపై రాష్ర్ట ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఈ బడ్జెట్ కేటాయింపులు అద్దం పడుతున్నాయి. ఆధునికీకరణ కాదు..కనీసం హెడ్‌వర్క్స్ మెయింటినెన్స్‌కు కూడా ఈ నిధులు ఏమూలకూ సరిపోవని సాగునీటి రంగాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం: జిల్లా సాగునీటి ప్రాజెక్టులు నాలుగేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఏటా రివైజ్డ్ ఎస్టిమేట్స్‌తో ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపడం.. బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు జరపడం అనవాయితీగా మారిపోయింది. ఏటా మాదిరి గానే ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లాకు విదిల్చిన నిధులు చూసి రైతులు బిత్తరపోతున్నారు.
తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు సంబంధించి మిగిలిన 28 కిలోమీటర్ల పనుల కోసం రూ.9 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2015-16 బడ్జెట్‌లో రూ.1.50 కోట్లు కేటాయించారు. మళ్లీ ఈఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2016-17 బడ్జెట్‌లోరూ.3.05కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు పెంచినప్పటికీ ఆధునికీకరణ పనులకు ఏమూలకు సరిపోవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కేవలం డ్యామ్, హెడ్‌వర్క్స్ మెయింటినెన్స్‌కు మాత్రమే ఈ నిధులు సరిపోతాయని చెబుతున్నారు. మరో పక్క ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరికైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కేవలం రూ.2 కోట్లు విదిల్చారు. రూ.7,200 కోట్ల అంచనా వ్యయం కాగల ఈ ప్రాజెక్టు ఇంకా బతికే ఉందన్నట్టు బడ్జెట్‌లో రూ.2 కోట్లు విదిల్చడం విడ్డూరంగా ఉందని నిపుణులంటున్నారు. ఈ నిధులు కనీసం సర్వే కూడా సరిపోవని చెబుతున్నారు. రైవాడ రిజర్వాయర్ ఆధునికీకరణ కోసం రూ. 60 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2015-16 బడ్జెట్‌లో రూ.52.50 లక్షలు కేటాయించారు. ఈ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూ.67 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే 2016-17 బడ్జెట్‌లో కేవలం రూ.6.10 లక్షలు విదిల్చారు. గతేడాదే అరకొరనిధులు కేటాయించగా ఈ ఏడాది కనీసం పాతిక కోట్లయినా కేటాయిస్తారని ఆశించినా కంటితుడుపుగా కేవలం రూ. 6లక్షలకు సరిపెట్టడం ఎంతవరకు సమంజసమని రైవాడ ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు.
పెద్దేరు జలాశయం ఆధునికీకరణ కోసం ఐదేళ్లుగా మిగిలి ఉన్న 25 శాతం పనుల కోసం ప్రభుత్వం రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపగా. 2015-16లో కేవలం రూ.11 లక్షలు కేటాయించారు. దీంతో ఈ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ మళ్లీ రూ.8.50 కోట్లకు పంపగా 5 లక్షలు మాత్రమే కేటాయించారు. గతేడాది కేటాయించి నిధులు డ్యామ్ నిర్వహణకు కూడా సరిపోలేదు. ఈ ఏడాది మరీ ఘోరంగా రూ.5 లక్షలు ఇచ్చారు. కోనాం రిజర్వాయర్ ఆధునికీకరణలో భాగంగా మిగిలి ఉన్న మూడు కిలో మీటర్ల పనులు పూర్తి చేసేందుకు రూ.2 కోట్లు ఇస్తే సరిపోతాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షలు విదిల్చిన సర్కార్ ఈ ఏడాది మరీ ఘోరంగా రూ.5.60 లక్షలు కేటాయిం చింది. ఈ నిధులు డామ్ నిర్వహణకు కూడా సరిపోవు.
సర్వేకు కూడా సరిపోవు
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు కేటాయించడ మే నిదర్శనం. ఈ ప్రాజెక్టు సర్వేకు కూడా ఈ నిధులు సరిపోవు. మిగిలిన ప్రాజెక్టులకు జరిపిన కేటాయింపులు మరీ తక్కువగా ఉన్నాయి. ఇవి ఆయా ప్రాజెక్టుల మెయింటినెన్స్‌కు కూడా సరిపోవు -ఎస్.సత్యనారాయణ,
రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ శాఖ