బడ్జెట్‌లో హోరుగల్లు
సాగునీటి రంగానికి ప్రాధాన్యం
* రూ.558 కోట్ల కేటాయింపు
* అత్యధికంగా దేవాదులకు రూ.214.10 కోట్లు
* జూరాల-పాకాలకు దక్కని స్థానం
* కాళోజీ కళా కేంద్రానికి నిధులు
సాక్షి, హన్మకొండ : రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. నీటి పారుదల రంగానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.558.1 కోట్లు కేటాయించారు. వీటిలో అత్యధికంగా దేవాదులకు రూ.214.10 కోట్లు.. అత్యల్పంగా బొగ్గులవాగు, గుండ్లవాగు ప్రాజెక్టులకు చెరో రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. గత కొన్ని బడ్జెట్లలో నిరాదరణకు గురైన ఘన్‌పూర్ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో రూ.8.20 కోట్ల నిధులు కేటాయించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన జూరాల-పాకాల ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగలేదు. గతంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలోనే మేడారం ప్రస్తావన వచ్చేది. ఈసారి అందుకు భిన్నంగా జాతర లేకపోయినా.. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొమురం భీమ్ అమరత్వం పొందిన ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌లో నిర్మించనున్న కొమురం భీం స్మారక కేం ద్రం తరహాలో ఆసియాలో అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. అయితే నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. జోడేఘాట్ స్మారక కేంద్రానికి రూ.25 కోట్లు కేటాయించారు.
ఇదే స్థాయిలో మేడారం జాతరకు నిధులు వచ్చే అవకాశం ఉంది. వీటితో గతంలో సిద్ధం చేసిన ప్రతిపాదనల ప్రకారం మేడారంలో గిరిజన మ్యూజియం ఏర్పాటుతోపాటు శాశ్వత ప్రతి పాదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వీలుంది. మైదాన ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ఐటీడీఏ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం మహబూబాబాద్‌లో మరో ఐటీడీఏను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ హామీ అమల్లోకి వస్తే జిల్లాలో మరో ఐటీడీఏ నెలకొల్పే అవకాశం ఉంది.
వైద్య సేవల కేంద్రంగా..
తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు అభివృద్ధికి వరంగల్ నగరం ప్రధాన కేంద్రం కానుంది. వరంగల్‌లోని కాళోజీ హెల్త్ వర్సిటీకి సంబంధించి తెలంగాణలో వైద్య సేవల పరంగా చేపట్టాల్సిన మార్పులపై ప్రతిపాదనలు రూపొందిస్తోందని ‘ఈటెల’ స్వయం గా వెల్లడించారు. అరుుతే.. హెల్త్‌వర్సిటీ నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించారు. వీటితో కేఎంసీలో శిథిలావస్థలో ఉన్న పాత భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మిం చే ఆస్కారం ఉంది. కంటి, ఛాతీ, మానసిక, ఈఎన్‌టీ ఆస్పత్రుల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ. 40 కోట్లు కేటాయించారు. నగరంలో కంటి, ఛాతీ, ఈఎన్‌టీ ఆస్పత్రులకు ఇందులో వాటా ఉండనుంది.
టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు
వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి సభాముఖంగా ప్రకటించారు. తెలంగాణ జిల్లాల్లో వరంగల్‌లో పత్తి ఎక్కువగా పండుతుంది. టెక్స్‌టైల్ పార్కు నెలకొల్పితే పత్తి అనుబంధ పరిశ్రమల స్థాపనకు ఊతం లభిస్తుంది. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదాను కల్పిస్తామని ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. తెలంగాణ లో కోళ్ల పరిశ్రమ వరంగల్‌లోనే ఎక్కువ ఉన్నందున జిల్లాకు ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంది.
కాళోజీ కళాకేంద్రానికి బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. హైదరాబాద్‌లో తెలంగాణ కళాభవన్, కాళోజీ కళా కేంద్రానికి కలిపి ఈ బడ్జెట్‌లో రూ.15 కోట్లు కేటాయించారు. కాగా, ‘ప్రాచీన చరిత్రలో తెలంగాణను చెరువుల దేశంగా పేర్కొన్నారు. క్రీస్తుశకం 12 శతాబ్ధంలోనే గొలుసుకట్టు చెరువుల ద్వారా వాటర్‌షెడ్ పథకానికి రూపకల్పన చేశారు. కాకతీయులు. ఆ చెరువుల పునరుద్ధరణకు మా ప్రభుత్వం ప్రాధన్యత ఇస్తుంది.’ అంటూ ఈటెల రాజేం దర్ బడ్జెట్ ప్రసంగంలో వరంగల్ నేపథ్యాన్ని ప్రస్తావించారు.