సాక్షి, అమరావతి : అప్పర్ భద్రకు నీటి కేటాయింపులపై కర్ణాటక చెప్పిన మాయ లెక్కలను నమ్మి, ఆ ప్రాజెక్టుకు అనుమతులిచ్చారని, వాటిని పునఃసమీక్షించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్ శక్తి శాఖలను రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరింది. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాలు తీసుకోకుండానే సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం అధికారులు అనుమతులిచ్చారని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తుంగభద్ర ఆయకట్టుతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఇటీవల లేఖ రాశారు.
చుక్క నీరూ కేటాయించకుండానే..
కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 నీటి కేటాయింపులు చేయకున్నా, కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకపోయినా, అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నట్లుగా కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కర్ణాటక ప్రభుత్వం నమ్మించింది. అప్పర్ భద్రకు నీటిని కేటాయించాలన్న కర్ణాటక ప్రతిపాదనలను 1976లోనే కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చింది. తుంగభద్రలో ఆ మేరకు నీటి లభ్యత లేదని స్పష్టం చేసింది. కానీ.. తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25 టీఎంసీలు, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర చానల్స్ ఆధునికకీరణ వల్ల 6.25, కృష్ణా డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటా నీరు 2, కృష్ణా బేసిన్‌లో అదనపు మిగులు జలాలు 6 టీఎంసీలు వెరసి 31 టీఎంసీల లభ్యత ఉందని కర్ణాటక పేర్కొంది.
ఇందులో ప్రవాహ, ఆవిరి నష్టాలుపోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని తెలిపింది. అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తామని, భద్ర నుంచి 29.90 టీఎంసీలను తరలించి.. దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందిస్తామని పేర్కొంది. కానీ, అప్పర్ తుంగ, భద్ర, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని, కృష్ణా బేసిన్‌లో అదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ–2 స్పష్టం చేసింది. అయినా, కర్ణాటక చెప్పిన తప్పుడు లెక్కలనే నమ్మిన సీడబ్ల్యూసీ దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల అభిప్రాయం తీసుకోకుండానే గతేడాది డిసెంబర్ 24న అప్పర్ భద్రకు హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇచ్చేసింది.
ఈ అనుమతులను చూపిస్తూ కర్ణాటక సర్కారు అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్ల (2018–19 ధరల ప్రకారం)తో పెట్టుబడి అనుమతి ఇవ్వాలని గత మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదన పెట్టింది. దీనికి కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదించింది. ఈ అనుమతుల ఆధారంగా.. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి.. 90 శాతం నిధులు (రూ.14,512.94 కోట్లు) ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై కేంద్రానికి ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేకపోవడాన్ని ఎత్తిచూపింది.
మూడు రాష్ట్రాలకూ నష్టమే
తుంగభద్ర డ్యామ్‌కు 230 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. కానీ 1976–77 నుంచి 2007–08 వరకూ ఏనాడూ 186.012 టీఎంసీలకు మించి ప్రవాహాలు రాలేదు. దాంతో దామాషా పద్ధతిలో కర్ణాటక, ఏపీ, తెలంగాణలకు తుంగభద్ర బోర్డు నీటి కేటాయింపులు చేస్తోంది. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు వచ్చే ప్రవాహాలు మరింత తగ్గుతాయి. ఇది తుంగభద్ర డ్యామ్‌తోపాటూ కేసీ కెనాల్, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే హగరి (వేదవతి)పై కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఏపీలోని బీటీపీ (భైరవానితిప్ప ప్రాజెక్టు) మధ్యలో ఎలాంటి ప్రాజెక్టు నిర్మించకూడదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టంగా చెప్పింది. కానీ.. ఇప్పుడు అప్పర్ భద్రలో అంతర్భాగంగా ఆ రెండు జలాశయాల మధ్య వేదవతిపై మరో జలాశయం నిర్మిస్తే బీటీపీ ఆయకట్టు ఎడారిగా మారుతుంది. ఈ అంశాలన్నింటినీ విపులీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అప్పర్ భద్రకు ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment