
ఖరీఫ్‌కు 8 లక్షల ఎకరాలు
పాలమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కింద వచ్చే ఖరీఫ్ కల్లా 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని అధికారులను నీటిపారు దల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
- ‘పాలమూరు’ ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావు ఆదేశం
- యాసంగిలో ఆరుతడి పంటలకే నీరు
- సాగునీటి పథకాలపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కింద వచ్చే ఖరీఫ్ కల్లా 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని అధికారులను నీటిపారు దల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కింద సాగునీటి పథకాల పురోగతిని మంగళవారం ఆయన జలసాధలో సమీక్షించారు. ప్రాజెక్టు లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం ప్రభుత్వ లక్ష్యం ప్రకారం భూసేకరణ జరపాలని ఆదేశించారు. కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సమ న్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువు లోగా పూర్తి చేయాలని కోరారు.
యాసంగిలో ఆరుతడి పంటలకు మాత్రమే సాగు నీరు ఇవ్వాలన్నారు. వరి పంటల విషయంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఎప్పటి కప్పుడు వాట్సప్ గ్రూప్ ద్వారా తనకు సమాచారం అందిం చాలన్నారు. పాల మూరు జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని... నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని హరీశ్ గుర్తుచేశారు.
ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానల్స్‌ను తనిఖీ చేసి కాలువల్లోని అడ్డంకులు తొలగించాలని, భూసేకరణ పనుల పురోగతిని ప్రతి వారం సమీక్షించాలన్నారు. నాలుగు ప్రాజెక్టుల పథకాల కోసం ఇంకా 4 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తయితే 7 లక్షల 93 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని మంత్రి తెలిపారు. సమావేశంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు , ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషీ, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, విజయప్రకాశ్, ‘కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్, చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.