ఆగస్టు దాకా అంతేనా..!
రాష్ట్రంలో ఎండిన ప్రాజెక్టులు.. 528 టీఎంసీల నీటి లోటు
- ప్రస్తుతం లభ్యత జలాలు 152.8 టీఎంసీలు..ఇందులో గరిష్టంగా వాడుకోదగ్గ నీరు 5 టీఎంసీలే
- జూన్ నుంచే మెరుగైన వర్షాలు కురిసినా ఆగస్టు వరకు సాగునీటిపై చెప్పలేని పరిస్థితి
- మంచి వర్షాలు రాకుంటే 20 లక్షల ఎకరాలపై ప్రభావం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ పంటల సాగు కష్టతరమే కానుంది. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ ఎండిపోయి ఖాళీ కావడం ఖరీఫ్ సాగుకు గుదిబండగా మారనుంది. జూన్ నుంచే మంచి వర్షాలు కురిసినా ప్రాజెక్టుల్లో నీరు చేరేందుకు ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనన్న సంకేతాలు రైతాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లోని ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడం, అక్కడి నుంచి దిగువకు నీరొచ్చే అవకాశాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం సాగును మరింత క్లిష్టతరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి సుమారు 15 లక్షల ఎకరాలపై నేరుగా, మరో 5 లక్షల ఎకరాలపై పరోక్షంగా ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రభుత్వం పంటల సాగుపై ఎలాంటి ప్రణాళికను సిధ్దం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.
పదేళ్ల తర్వాత అంతటి లోటు..
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. 2002-03లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులన్నీ ఎండిపోగా మళ్లీ ఇప్పుడు అంతటి లోటు ఏర్పడిందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 152.81టీఎంసీల మేర మాత్రమే నిల్వలు న్నాయి. ఈ సమయానికి ఉండాల్సినదానికన్నా 528 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటిలోనూ వాడుకోదగినవి కేవలం 5 టీఎంసీలే. జూన్‌లో సకాలంలో వర్షాలు కురిసినా ముందుగా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రాజెక్టులు నిండాల్సి ఉంటుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి చేరే నీటిలో సుమారు 90 నుంచి 100 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన కూడా ప్రాజెక్టుల్లో కొంతమేర నీరు చేరినా వెంటనే ఖరీఫ్‌కు నీరిచ్చే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఖరీఫ్ ఆయకట్టుపై స్పష్టత ఇవ్వలేమని నీటి పారుదల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
20 లక్షల ఎకరాలపై ప్రభావం..
సాగునీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితిల్లో ఆ ప్రభావం మొత్తంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టుపై పడే అవకాశం ఉంది. సాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండ జిల్లా పరిధిలో 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండగా, జూరాల కింద లక్ష ఎకరాలు, ఎస్సారెస్పీ, నిజాంసాగర్ కింద మరో లక్ష ఎకరాలకు సకాలంలో నీరివ్వడం కష్టంగా మారుతుంది. దీనికి తోడు ఈ ఏడు పాక్షికంగా పూర్తయిన భీమా, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, కల్వకుర్తి, దేవాదుల కింద కొత్తగా ఈ ఖరీఫ్‌లో 6.5 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించారు. ఒకవేళ సరైన వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి నీరు చేరకుంటే గడ్డు పరిస్థితులు తప్పవు. మరో పక్క ప్రాజెక్టుల ద్వారా చెరువులు నిండని పక్షంలో మరో 5 లక్షల ఎకరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.