పులిచింతలపై నిలదీద్దాం | ap govt Illegal projects on Telangana govt complete | Sakshi
Sakshi News home page

పులిచింతలపై నిలదీద్దాం

Published Mon, Apr 3 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

పులిచింతలపై నిలదీద్దాం

పులిచింతలపై నిలదీద్దాం

పరిహారంపై ఏపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధమైన తెలంగాణ
ఇప్పటికే అక్రమ ప్రాజెక్టులపై గరంగరం
పురుషోత్తపట్నం, శివభాష్యం సాగర్‌పై బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదులు
మున్నేరు బ్యారేజీపైనా అభ్యంతరం
తాజాగా పులిచింతలను తెరపైకి తెస్తున్న తెలంగాణ


సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం, బోర్డుల వద్ద అడ్డుపుల్లలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పటికే ఏపీ గోదావరిపై చేపట్టిన పురుషోత్తపట్నం, కృష్ణా నదిపై చేపట్టిన శివభాష్యం సాగర్, మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై అభ్యంతరాలు తెలిపిన తెలంగాణ... తాజాగా పులిచింతల పరిహారం అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైంది. ఏటా పులిచింతల పరిహారంపై ప్రశ్నిస్తున్నా స్పందన లేకపోవడంతో దీనిపై ఏపీని గట్టిగా నిలదీయాలన్న పట్టుదలతో ఉంది.

వరుసగా అస్త్రాలు..
తెలంగాణ చేపడుతున్న అనేక ప్రాజెక్టుల విషయంలో ఏపీ జోక్యం పెరిగింది. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాల మేరకు నీటి వినియోగం చేస్తున్నామని చెబుతున్నా... ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జల సంఘం, బోర్డుల వద్ద ఫిర్యాదులు చేస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ.. పోలవరం ఎడమకాల్వపై ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నంపై గోదావరి బోర్డుకు ఫిర్యా దు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కర్నూలు జిల్లాలో చేపడుతున్న శివభాష్యం సాగర్‌పైనా ఇటీవలే కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసిం ది. కృష్ణా జిల్లాలో చేపట్టిన మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై కూడా అభ్యంతరాలు లేవనెత్తింది.

 ఈ బ్యారేజీ నిర్మాణంతో తెలంగాణ ప్రాంతం లో ముంపు ఉంటుందని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఇప్పుడు పులిచింతలపై దృష్టి సారించింది. అసంపూర్ణ పునరావాసంతో ఏటా పులిచింతల కింద తెలంగాణ గ్రామాలు ముంపు బారిన పడుతున్నా ఏపీ స్పందన సరిగా లేదని తెలంగాణ గుర్రుగా ఉంది. పులిచింతలలో 45.7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ నీటితో నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు ముంపునకు గురవుతు న్నాయి. ఈ గ్రామాల పునరావాసానికి పరిహా రం కింద రూ.381 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేశారు.

 ఈ నిధుల విడుదలలో జాప్యం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేగింది. ఓ దశలో గవర్నర్‌ జోక్యం చేసుకోవడంతో పరిహార చెల్లింపులకు ఓకే చెప్పిన ఏపీ.. రూ.53 కోట్లు ఒకమారు, రూ.75 కోట్లు ఇంకోమారు విడుదల చేసింది. ఇవిపోను ఇంకా భూసేకరణకు రూ.20 కోట్లు, దేవాలయాల పునర్నిర్మాణానికి రూ.15 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.25 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.50 కోట్లు, ఇతర వసతులకు మొత్తంగా రూ.115 కోట్లు రావాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని గతేడాది అక్టోబర్‌లో ఏపీకి విన్నవించింది.

రూ.49 కోట్లు మాత్రమే ఇచ్చిన ఏపీ
రాష్ట్రం విన్నవించిన ఆరు నెలలకు స్పందించిన ఏపీ.. పులిచింతల జలాశయంలో ముంపునకు గురైన నాలుగు ఎత్తిపోతల పథకాలను మరోచోటుకు తరలించడానికి రూ.49 కోట్ల పరిహారాన్ని గత నెల చివరి వారంలో విడుదల చేసింది. మిగతా రూ.66 కోట్లపై పేచీ పెడుతోంది. భూనిర్వాసితులు, సహాయ పునరావాస ప్యాకేజీ కింద పరిహారం ఇప్పటికే చెల్లించామని, తెలంగాణకు బకాయిలేమీ లేమని చెబుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం.. ఏపీకి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందించకుంటే బోర్డులోనే తేల్చుకోవాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement