
28 ప్రాజెక్టులకు ‘క్యాడ్‌వామ్’ నిధులు
- కేంద్ర జలవనరులశాఖ నిర్ణయం
- మూడు నెలల్లో డీపీఆర్‌లు సమర్పించాలని ఆదేశం
- ‘పీఎంకేఎస్‌వై’ కింద ఇప్పటికే 11 ప్రాజెక్టులకు రూ. 943 కోట్లు ఇచ్చేందుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కింద వాస్తవ ఆయకట్టు, నీరందుతున్న ఆయకట్టుకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఉద్దేశించిన కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ పథకం (క్యాడ్‌వామ్) కింద పలు రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై)లో చేర్చిన 11 సాగునీటి ప్రాజెక్టులకు రూ. 943 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించిన కేంద్ర జల వనరులశాఖ... కొత్తగా రాష్ట్రం నుంచి మరో 28 ప్రాజెక్టుల పరిధిలో నీరందని ఆయ కట్టుకు నిధులిచ్చేందుకు రెండ్రోజుల కిందట సానుకూలత తెలిపింది.
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లో చాలా చోట్ల కాల్వలు పూడుకుపోవడం, ఫీల్డ్ చానల్స్ దెబ్బతినడం, కాల్వలకు లైనింగ్ వ్యవస్థలేని కారణంగా నీటి వృథా అవుతుండటంతో చివరి ఆయకట్టు వరకు నీరందడం లేదు. నీటి లభ్యత, ప్రాజెక్టు వ్యయం సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టును నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రతి ప్రాజెక్టు పరిధిలో నీరందని ఆయకట్టు 25 శాతం మేర ఉంటోంది. ప్రస్తుతం భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద నిర్ణీత ఆయకట్టు 24.68 లక్షల ఎకరాలుండగా, నీరందుతున్న ఆయకట్టు 18.91 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
అంటే నీరందని ఆయకట్టు 5.77 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 28 ప్రాజె క్టులకు క్యాడ్‌వామ్ పథకం కింద 60 శాతం నిధులు ఇవ్వనుంది. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు, నీరందని ఆయకట్టుకుగల కారణాలు, అవసరమయ్యే నిధుల వివ రాలను మూడు నెలల్లోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
‘క్యాడ్‌వామ్’ కింద రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాజెక్టులివే...
జూరాల, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు–1, అలీసాగర్, గుత్ప, డిండి, నిజాంసాగర్, ఆర్డీఎస్, కడెం, మూసీ, గుండ్లవాగు, ఆసిఫ్‌నహర్, కోటిపల్లి వాగు, నల్లవాగు, ఘన్‌పూర్ ఆనకట్ట, పోచారం, కౌలాస్ నాలా, సాత్నాల, స్వర్ణ, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, అప్పర్ మానేరు, శనిగరం, బొగ్గులవాగు, ముల్లూరువాగు, పాకాల చెరువు, పెద్దవాగు ప్రాజెక్టులు.