సాక్షి, ఖమ్మం: రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.
రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు చెందాలని తమ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను తీసుకువచ్చిందన్నారు. గత దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామని చెప్పారు. సంపదను సృష్టించి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్థికంగా ఎదగడానికి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించామన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబోతున్న మీ సేవ సెంటర్ల నిర్వహణ కూడా మహిళలకు అప్ప చెప్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన కొరకై తమ ప్రభుత్వం మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు.
ఆసుపత్రి ప్రారంభం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైద్రాబాద్ ప్రజాభవన్ నుంచి ఉదయం 7గంటలకు రోడ్డు మార్గాన ఖమ్మంకు చేరుకున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా అధికార యంత్రాగం, పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ఆర్‌సీఎం చర్చ్ ఎదురుగా స్థంబాద్రి హస్పిటల్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి మూడవ అంతస్తులో క్యాత్ ల్యాబ్‌ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఆక్కడి నుంచి చింతకాని మండలం గాంధినగర్ కు చేరుకొని రూ.175లక్షలతో గాంధినగర్ నుంచి బొప్పారం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఆ తరువాత మధిర మండలం వంగవీడు గ్రామానికి చేరుకొని రూ. 30 కోట్లతో బోనకల్లు- అల్లపాడు- వంగవీడు గ్రామాల వరకు బిటి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. చిలుకూరు గ్రామాంలోని శివాలయం వద్ద రూ.70 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు, రూ.285 లక్షలతో చిలుకూరు నుంచి దొడ్డదేవరపాడు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మధిర మండలం మర్లపాడు గ్రామానికి చేరుకొని. రూ.275 లక్షలతో మర్లపాడు నుంచి పెనుగొలను-సిద్దినేని గూడెం వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్తాపన చేశారు. ఆ తరువాత మాటూరు గ్రామానికి చేరుకొని రూ.500 లక్షలతో మాటూరు నుంచి ముస్లీం కాలనీ బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆనంతరం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దారి పొడవున ఆయా గ్రామాల ప్రజలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment