టూకీగా ప్రపంచ చరిత్ర 39 | Encapsulate the history of the world 39 | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర 39

Published Fri, Feb 20 2015 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

టూకీగా  ప్రపంచ చరిత్ర  39

టూకీగా ప్రపంచ చరిత్ర 39

నేరం
 

ఇప్పటికీ నివాసం తోళ్లతో కప్పిన గుడారమే; ఇప్పటికీ బతుకు తెరువు అడవి జంతువులను వేటాడడమే; కానీ, ఇదివరకటిలా వాళ్లకు వేట ఏకైక జీవన మార్గం కాదు. వేట ఎంత ప్రధానమో, మచ్చికయ్యే జంతువుల కోసం వలలు పన్నడం అంతే ప్రధానమైంది. ఆకలి వేటకు కేటాయించే రోజులు కొన్నైతే, పశుసంపద పెంచుకునేందుకు కేటాయించే రోజులు మరికొన్నిగా విడిపోయాయి. కాలక్రమేణా, వేటాడేందుకు కొందరు, ప్రాణంతో జంతువులను సేకరించేందుకు మరికొందరుగా విడిపోయారు. ఒడుపును బట్టి ఆయా పనులు కేటాయించడంలో, వాళ్ల స్పృహతో నిమిత్తం లేకుండా సమాజంలో వృత్తి విభజన ప్రవేశించింది. జీవన విధానంలో ఏర్పడిన మార్పును బట్టి మానవుని ఆలోచనా విధానంలో గూడా తేడా వచ్చింది. మునుపటిలా ‘కడుపు నిండితే చాల’నే దశ దాటిపోయింది; ఇప్పుడు అతని తాపత్రయమంతా ‘సమృద్ధి’ని సాధించుకోవడం. మంద ఎంత పెరిగితే సంపద అంత పెరిగినట్టు లెక్క.

సంపద మూలంగా ఏర్పడే సౌకర్యాలు ఒక ఎత్తై, దాంతోపాటు ప్రవేశించే చీకాకులు మరో ఎత్తు. ‘ఆస్తి’, ‘నేరం’ అనేవి ఒకే నాణెం మీది బొమ్మాబొరుసులు. పశువుల రూపంలో సంపద ఏర్పడగానే, ఏనాడూ ఎరుగని దొంగతనాలతో ‘నేరం’ సమాజంలోకి ప్రవేశించింది. ఋగ్వేదంలో కనీసం మండలానికి ఒక్కసారైనా దొంగల నుండి తమ గోవులను కాపాడమని దేవతలను అర్థించే స్తోత్రాలో, దొంగల బారి నుండి గోవులను విడిపించినందుకు చేసే అభినందనలో గమనిస్తే, ఈ నేరం చాలా ప్రాచీనమైందనీ, వేదకాలం నాటికి ఇది చాలా తీవ్రమైన సమస్యగా పరిణమించిందనీ స్పష్టమౌతుంది. దొంగిలించిన గోవులను నరికేస్తారని గూడా ప్రస్తావించడంతో (ఋగ్వేదం, 1వ మండలం, 61వ సూక్తం, 10వ బుక్కు), ‘నేరం’ ఒక్క దొంగతనంతోనే ఆగిపోలేదు; బావిలోకి తోసో, మోకులతో కట్టేసి నదిలో పడదోసో హత్యలకు ప్రయత్నించడం ఋగ్వేదంలోనే అనేక సందర్భాల్లో తారసపడుతుంది.

మరోవైపు, పశువుల మందలు పెరిగేకొద్దీ పచ్చిక కొరత తీవ్రమైన సమస్యగా ఎదురయింది. కొత్త బయళ్లు వెదుక్కుంటూ ఏ దిశగా వలస పోయినా అప్పటికే మరో గుంపు అక్కడ ఉండనే ఉంటుంది. ఆక్షేపాలు భీకరమైన పోరాటాలకు దారితీసేవి. తగాదాలకు కారణం అదొక్కటేగాదు; ఉప్పు దొరికే ‘జేడె’ నేలలు గూడా ప్రత్యర్థుల నుండి కాపాడుకోవలసిన ఖజానాలే. ఉప్పు కేవలం రుచి కోసం వాడే పదార్థం మాత్రమే కాదు; శరీరంలో లవణాల కొరత ఏర్పడితే కండరాలు పనిచేయవు కాబట్టి అది తప్పనిసరి గూడా. మాంసం మాత్రమే ఆహారంగా కలిగిన జీవులకు ఆ అవసరం అంతగా ఏర్పడదు గానీ, శాకాహారులైన పశువుల్లోనూ, భోజనంలో భాగంగా ఇప్పుడు శాకపదార్థాలను గణనీయంగా పెంచుకున్న మానవుల్లోనూ శరీరానికి చాలినంత లవణం సమకూర్చుకోవాలంటే బీడు భూములు అవసరం ఎంతైనా ఉంది.
 పాత రోజుల్లో నియాండర్‌తల్ మానవుని తరిమేసినంత తేలికైంది కాదు ఇప్పుడు జరిగే పోరాటం. ప్రత్యర్థి పక్షం సమఉజ్జీ కావడంతో ప్రాణ నష్టం బాగా పెరిగింది. గెలుపును సాధించే దిశగా దండును నడిపేందుకు ఒక ‘దండనాయకు’ని అవసరం గూడా ఏర్పడింది. దాడిని సమర్థవంతంగా నిర్వహించే నేర్పుగల మనిషికి ఆ హోదా స్థిరపడింది. వ్యక్తిగత ఆస్తులు ఏర్పడనంత దాకా అది కేవలం గౌరవ సూచకమైన హోదా మాత్రమే. కాకపోతే గుంపు మొత్తం అతనికి విధేయంగా నడుచుకునేది; అతని గౌరవార్థం విందులు జరిగేవి; గాయకులు అతని గొప్పలను ప్రత్యేకంగా కీర్తించేవారు.

తన జనానికి ప్రయోజనం చేకూర్చిన తృప్తి తప్ప నాయకులకు స్వప్రయోజనమనే ఆలోచనే ఉండేదిగాదు. గెలిచిన గుంపు ఓడినవాళ్ల సంపదను నిరాటంకంగా స్వాధీనం చేసుకునేది. ఆ సంపద ఉమ్మడి ఆస్తిలో భాగంగా కలిసిపోయేది. స్త్రీలు సంతానోత్పత్తి క్షేత్రాలు కాబట్టి, వంశం విస్తరించాలని ఆకాంక్షించే రోజుల్లో స్త్రీ జనాన్ని కుండల్లో కలుపుకోవడం ఆలోచించేపాటి సమస్యగాదు; పని చేసేవాడొకడూ, చేయించుకునేవాడు మరొకడూ ఉంటాడని తెలియని రోజుల్లో పట్టుబడిన పురుషులను ఏం చెయ్యాలన్నదే తేల్చుకోవలసిన సమస్య. ఆ సమస్యకు పరిష్కారమే ప్రాచీన సంప్రదాయంలో కనిపించే ‘నరమేధం’. నరికే ప్రక్రియను మేధం అంటారు. అగ్నిగుండం సమక్షంలో శత్రువును నరికివేయడం పవిత్రమైన యజ్ఞంగా వెనుకటి రోజుల్లో కొనసాగింది. అంతకు మించి వాళ్లకు గత్యంతరం లేదు కూడా. ఆ తరువాత చాలా కాలానికి, విశ్వామిత్ర మహర్షి చొరవతో నరమేధాలు ఆగినట్టు ఋగ్వేదభాష్యం ద్వారా తెలుస్తూ ఉంది.

రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement