సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పశు సంపద ఏడేళ్ల కాలంలో 60 లక్షల మేర పెరిగినట్టు తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2021 నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2012లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,66,96,109 పశువులు, గొర్రెలు, ఇతర మూగజీవాలు ఉండగా, 2019 నాటికి వాటి సంఖ్య 3,26,40,639కి చేరింది. ఆ తర్వాతి రెండేళ్లు కలిపితే ఈ సంఖ్య మూడున్నర కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో అత్యధికంగా గొర్రెలు 1.90 కోట్ల వరకు ఉన్నాయని ఈ నివేదికలో పేర్కొన్నారు.
2012లో 1.28 కోట్లుగా ఉన్న గొర్రెలు, 2019 నాటికి 1.90 కోట్లకు చేరాయి. ఆ తర్వాత మేకలు 49 లక్షల వరకు ఉన్నాయి. 2012లో వీటి సంఖ్య 45 లక్షలు కాగా, ఏడేళ్లలో మరో నాలుగు లక్షలు పెరిగి 49 లక్షలకు చేరాయి. ఇక పశువుల విషయానికి వస్తే పాలిచ్చే పశువులు 42 లక్షలు, ఎద్దులు, దున్నపోతులు కలిసి 42 లక్షలకు పైగా ఉన్నాయి. పందులు 2012లో 1.77 లక్షలు ఉండగా, 2019 నాటికి వాటి సంఖ్య 2.37 లక్షలకు చేరింది. కోళ్ల విషయానికి వస్తే ఏడున్నర లక్షల వరకు ఉత్పత్తి తగ్గింది. 2012లో 8.07 కోట్లకు పైగా కోళ్లు ఉత్పత్తి కాగా, 2019లో 7.99 కోట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయని నివేదిక తెలిపింది.
రూ.6,21,746 కోట్ల డిపాజిట్లు
రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, రుణాల వివరాలను కూడా ఈ నివేదిక వెల్లడించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని పబ్లిక్, ప్రైవేట్ రంగాల బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో కలిపి రూ.6,21,746 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొంది. రూ.5,61,844 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపింది. ప్రతి బ్యాంకులో సగటున ఆరుగురు పనిచేస్తున్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment