బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పొట్టేలు
సాక్షి, బంజారాహిల్స్: అవి అసలే పోటీ పొట్టేళ్లు.. ఒక్కోదాని బరువు 60 కేజీల పైనే.. ఒక్కోసారి అవి ఆరడుగుల మనిషిని కూడా లేపి అవతల పారేస్తాయ్. ఇలాంటి పొట్టేళ్లతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట్‌లో శుక్రవారం అక్రమంగా పోటీలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు పొట్టేళ్లను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ పొట్టేళ్లను అదుపుచేయడం మాత్రం పోలీసులకు తలనొప్పిగా మారింది. పొట్టేళ్లను పోలీస్ స్టేషన్‌లోనేమో పెట్టలేరు.. బండికి కట్టేసినా తెంచుకొని పోతాయి. ఈ నేపథ్యంలో అష్టకష్టాలు పడిన పోలీసులు ఎలాగోలా వీటిని స్టేషన్ వెనుక ఉన్న సిమెంటు బల్లలకు కట్టేసి ఒక్కో పొట్టేలు వద్ద ఒక్కో కానిస్టేబుల్‌ను కాపలా పెట్టారు. వీటిని వెటర్నరీ హాస్పిటల్‌లో అప్పగించేంత వరకు పోలీసులకు తలప్రాణం తోకలోకి వచ్చింది. అన్నట్లు ఇందులో ఒకదానిపేరు వీర్.. మరోదాని పేరు మాలిక్. 15 మంది నిర్వాహకులను అరెస్ట్ చేసి..వీరి వద్ద నుంచి 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment