నవ్విపోదురు..
జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బోరుబావుల్లో నీరు రావడం లేదు. వేసిన అరకొర పంటలు నిలువునా ఎండిపోయాయి. ఇప్పటికే లక్ష హెక్టార్లలో వేరుశనగను తొలగించేశారు. చాలా ప్రాంతాల్లో తాగునీటికీ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రాసం, నీరు లేక మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వాటి బాధ చూడలేక రైతులు సంతల్లో అయినకాడికి అమ్మేస్తున్నారు. జిల్లాలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నా.. పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం ‘అంతా బాగుంద’ని చెప్పుకొంటున్నారు. పశు గ్రాసానికైతే ఎలాంటి సమస్యా లేదంటున్నారు. మార్కెట్‌యార్డుల్లో మూగజీవాల క్రయవిక్రయాలు గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయాయట. గ్రాసం ఉండడమే ఇందుకు కారణమన్నది వారి వాదన. దీనిపై రైతులు మండిపడుతున్నారు. గ్రామాల్లోకి వచ్చి చూస్తే పరిస్థితి అర్థమవుతుందని అంటున్నారు.
అనంతపురం అగ్రికల్చర్ :
జిల్లాలో 38 లక్షల గొర్రెలు, ఏడు లక్షల మేకలు, 13.48 లక్షల పశువులు ఉన్నట్లు పశుగణన సర్వేలో తేలింది. రెండేళ్ల క్రితం పశువులు 16 లక్షలకు పైగా ఉండేవి. క్రమేణా వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత రెండు, మూడేళ్లలో కరువు పరిస్థితుల వల్ల లక్షల సంఖ్యలో పశువులను కబేళాలకు తరలించారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి చెప్పుకునే స్థాయిలో ఒక్క వర ్షం కూడా కురవలేదు. ఎక్కడా ఒక చెరువు పొంగి పొర్లింది లేదు. ప్రతి నెలా సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదైంది. జూన్‌లో 63.9 మిల్లీమీటర్ల(మి.మీ)కు గాను 44.9, జూలైలో 67.4 మి.మీకి గాను 35.7, ఆగస్టులో 88.7 మి.మీకి గాను 56.8, సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 42.6 మి.మీ కాగా.. ఇప్పటి వరకూ 5.2 మి.మీ మాత్రమే నమోదైంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇప్పటివరకు 45.7 మి.మీ వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో పశువులకు గ్రాసం కొరత తీవ్రమైంది. గొర్రెల కాపరులు కర్ణాటక, కర్నూలు ప్రాంతాలకు వలస పోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పశువులను అమ్ముకోవడం లేదని, కేవలం మేత సమకూర్చలేకే అయినకాడికి అమ్మేస్తున్నామని రైతులు చెబుతున్నారు. బోరుబావుల కింద గ్రాసం సాగు చేద్దామనుకుంటే చుక్కనీరు రావడం లేదు. 500 నుంచి 800 అడుగుల లోతుకు బోర్లు వేయిస్తున్నా 80 శాతం వాటిలో చుక్కు నీరు రావడం లేదు. జిల్లాలోని 73 ప్రాంతాల్లో బోర్లకు అనుసంధానించిన ఫిజోమీటర్ల ద్వారా భూగర్భజల శాఖ తాజాగా వివరాలు సేకరించింది. వాటి ప్రకారం జిల్లా సగటు నీటి మట్టం 20.47 మీటర్లకు పడిపోయింది. 20 మీటర్లకు పైగా నమోదైతే ఆందోళన కలిగించే విషయమని భూగర్భజలశాఖ అధికారులు తెలిపారు.
1.53 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి కోసం ప్రతిపాదనలు
జిల్లాలో పరిస్థితులను మూడు నెలల క్రితం అంచనా వేసిన పశు సంవర్ధక శాఖ అధికారులు డిసెంబర్ వరకూ 1.53 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి అవసరం ఏర్పడుతుందని గుర్తించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అయితే.. ఆ అధికారులే ప్రస్తుతం జిల్లాలో పశుగ్రాస కొరత లేదని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెబుతున్నారు. గ్రాసం సరఫరాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులైనా వాస్తవ పరిస్థితిని గమనించి గ్రాసం సరఫరాకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.