వట్టిపోతున్న ‘పాల’మూరు
♦ జిల్లాలో తగ్గుతున్న పాల ఉత్పత్తి
♦ గ్రాసం లేక కబేళాలకు తరలుతున్న పశుసంపద
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి పశుసంపదను కాపాడుకోవడం శక్తికి మించిన భారంగా పరిణమించింది. వ్యవసాయానికి చేదోడు, వాదోడుగా ఉండే పశువులతో పాటు కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చే పాడి గేదెలకు కనీసం గ్రాసం సమకూర్చలేక రైతాంగం తల్లడిల్లుతోంది. పశువులతో వ్యవసాయ పరంగా తమకున్న అనుబంధాన్ని ఒకవైపు వదులుకోలేక మరోవైపు కరువు పరిస్థితులు ముంచుకొస్తుండడంతో పశువులకు తాగడానికి నీరు, తినడానికి గడ్డి పెట్టడం తమ వల్ల కాక అనేక మంది రైతులు పశువులను తెగనమ్మడానికి సంతకు తరలిస్తున్నారు. కాలం ప్రతికూలించి నప్పుడు, పంటలు సరిగ్గా పండని సమయం లో సైతం జిల్లాలోని అనేక మంది రైతులను పాడి సంపద ఆదుకొనేది. కానీ ఈ ఏడాది రైతుల ఇళ్లలో పాడిగేదెలు వట్టిపోయి ప్యాకెట్ పాలు దర్శనమిచ్చే దుర్భర పరిస్థితి.
కబేళాలకు తరలింపు..
జిల్లాలో పలు ప్రాంతాల్లో పాల దిగుబడి గణనీయంగా పడిపోవడంతో రైతాంగం కంట నీరు ఒలుకుతోంది. పశువులకు సరైన మేత, నీరు లేకపోవడంతో అవి బక్కచిక్కడమే గాక రోజూ ఏదో ఒక ఊరు నుంచి పదుల సంఖ్యలో పశువులు కబేళాలకు సిద్ధమవుతున్నాయి. కరువుతో అల్లాడుతున్న జిల్లాలో పశు సంపదను ఆదుకొనే దిక్కే లేకుండా పోయిం ది. గతేడాది చివరి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం పశుసంపద అభివృద్ధి కోసం పైసా విదల్చకపోవడంతో జిల్లాలో పశువుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మేకలు, గొర్రెలకు కూడా గ్రాసం లభించక కనీసం గుక్కెడు నీరు లభించని దుస్థితి నెలకొనడంతో మేకలు, గొర్రెలను బతికించుకొనేందుకు వందల కిలోమీటర్ల దూరం ఆంధ్రా ప్రాంతాలకు వలస తీసుకెళ్తున్నారు.
పాన్‌గల్, కొల్లాపూర్, వీపనగండ్ల, పెద్దకొత్తపల్లి, కోడేరు వంటి ప్రాంతాల్లో ఉన్న జీవాలను సమీపంలోని రాయలసీమ జిల్లాలకు మక్తల్, నారాయణపేట, ఆత్మకూర్, మాగనూరు వంటి ప్రాంతాల్లో జీవాలను కర్ణాటక ప్రాంతానికి వాహనాల్లో తరలిస్తున్నారు. పశు సంపదను కాపాడడానికి వాటికి గ్రాసం, నీరు అందించేందుకు అనేక ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం నుంచి మాత్రం ఇందుకు నిధులు విడుదల కాని పరిస్థితి నెలకొంది.
ప్రతిపాదనలు బుట్టదాఖలేనా?
జిల్లాలో పశు సంపదను కాపాడడానికి దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్ అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపినా కేటాయింపులు మాత్రం ఇప్పటికీ అతీగతీ లేని దుస్థితి నెలకొంది. రోజుకు 7 లక్షల లీటర్ల పాల ఉత్పత్తినిచ్చే 5 లక్షల పాడి ఆవులు, గేదెలకు సరైన గ్రాసం అందక అల్లాడుతున్నాయి. జిల్లాలో పశుగ్రాసం కోసం అధికారులు ప్రభుత్వానికి 70 శాతం సబ్సిడీతో పశుగ్రాసం విత్తనాల పంపిణీ కోసం 1.38 కోట్లు 50 శాతం సబ్సిడీ దాణా కోసం 5.83 కోట్లు లవణ మిశ్రమం పంపిణీకి మరో రూ.82 లక్షలు అవసరమని నివేదికలు పంపించినా ప్రభుత్వం నుంచి మాత్రం నిధుల ఊసే లేని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ఉచిత పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులు నివేదికల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే పంపించారు. జిల్లాలో పశుసంపద అత్యధికంగా ఉన్నా ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు మాత్రం ఇందుకనుగుణంగా లేకపోవడంతో ఆ శాఖకు వచ్చిన బడ్జెట్ పట్టుమని 6, 7 నెలలకు సైతం సరిపోని దుస్థితి నెలకొంది. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి నెలలు గడిచిన కరువు సహాయక నిధుల ఊసే లేకపోవడంతో పశువులకు గోస తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పాలమూరుగా దేశస్థాయి ప్రసిద్ధి గాంచిన ఈ జిల్లాలో ‘పాల’ ఉత్పత్తి మరింత పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతోపాటు ఆర్థిక ఆలంబన ఇస్తున్న పశు సంపదను కాపాడి తమకు జీవం పోయాలని రైతులు కోరుతున్నారు.