Extreme drought
-
ప్రమాదకరంగా పైపైకి.. శరవేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు
వాతావరణ మార్పులు, తద్వారా నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని నానాటికీ ప్రమాదపుటంచులకు నెడుతున్నాయి. వీటి దుష్పరిణామాలను 2022 పొడవునా ప్రపంచమంతా చవిచూసింది. ఆస్ట్రేలియా మొదలుకుని అమెరికా దాకా పలు దేశాల్లో ఒకవైపు కార్చిచ్చులు, మరోవైపు కనీవినీ ఎరగని వరదలు, ఇంకోవైపు తీవ్ర కరువు పరిస్థితులు, భరించలేని వేడి గాలుల వంటివి జనానికి చుక్కలు చూపాయి. ఆర్కిటిక్ బ్లాస్ట్ దెబ్బకు ఇంగ్లండ్‌తో పాటు పలు యూరప్ దేశాలు గత 40 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగనంతటి చలి, మంచు వణికించాయి. ఆ వెంటనే అమెరికాపై విరుచుకుపడ్డ బాంబ్ సైక్లోన్ ‘శతాబ్ది మంచు తుపాను’గా మారి దేశమంతటినీ అతలాకుతలం చేసి వదిలింది. 2023లో కూడా ఇలాంటి కల్లోలాలు, ఉత్పాతాలు తప్పవని పర్యావరణ నిపుణులు ఇప్పటినుంచే హెచ్చరిస్తుండటం మరింత కలవరపెడుతోంది. వీటికి తోడు మరో పెను సమస్య చడీచప్పుడూ లేకుండా ప్రపంచంపైకి వచ్చిపడుతోంది. అదే... సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల! ప్రపంచవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్యదరా ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఇదిప్పుడు పర్యావరణవేత్తలందరినీ కలవరపెడుతోంది! 20 ఏళ్లలో 8 సెంటీమీటర్లు! సముద్ర మట్టాల్లో పెరుగుదల తాలూకు దుష్పరిణామాలు మధ్యదరా తీర ప్రాంతాల్లో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ఇటలీలోని అమ్లాఫీ తీరం వద్ద సముద్ర మట్టం స్పెయిన్‌లోని కోస్టా డెల్‌సోల్‌తో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ‘‘మధ్యదరా పరిధిలో కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అడ్రియాటిక్, ఎజియన్, లెవంటైన్ సముద్రాల తీర ప్రాంతాల్లో నీటి మట్టం 20 ఏళ్లలో ఏకంగా 8 సెంటీమీటర్లకు పైగా పెరిగింది. పైగా ఈ పెరుగుదల రేటు ఇటీవలి కాలంలో బాగా వేగం పుంజుకుంటుండటం మరింత ప్రమాదకర పరిణామం’’ అని వారు వెల్లడించారు! తమ అధ్యయనంలో భాగంగా అలలు, ఆటుపోట్ల గణాంకాలతో పాటు మంచు కరిగే రేటుకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలు తదితరాలను లోతుగా విశ్లేషించారు. 1989 తర్వాత నుంచీ మధ్యదరా సముద్ర మట్టం శరవేగంగా పెరుగుతోందని తేల్చారు. పరిశోధన ఫలితాలు అడ్వాన్సింగ్ అర్త్ స్పేస్ సైన్సెస్ జర్నల్ తాజాగా ప్రచురితమయ్యాయి. అతి సున్నిత ప్రాంతం నిజానికి మధ్యదరా ప్రాంతం వాతావరణ మార్పులపరంగా ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. వరదలు, క్రమక్షయం వంటివాటి దెబ్బకు ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఏకంగా 86 శాతం దాకా లుప్తమయ్యే ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2022 మొదట్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ప్రమాదకరణ పరిణామాలనే కళ్లకు కట్టింది. మధ్యదరాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా సముద్రమట్టాలు గతంలో భావించిన దానికంటే చాలా వేగంగా పెరుగుతున్నాయన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. గ్రీన్లాండ్ బేసిన్లో పరుచుకున్న అపారమైన మంచు నిల్వలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహాతీత వేగంతో కరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. దానివల్ల అపారమైన పరిమాణంలో నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోందని వివరించింది. అంతేకాదు, గ్రీన్లాండ్ మంచు ఇదే వేగంతో కరగడం కొనసాగితే 2100 కల్లా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ప్రస్తుతం ఊహిస్తున్న దానికంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా పెరిగిపోతాయని కూడా హెచ్చరించింది. పెను ప్రమాదమే...! సముద్ర మట్టాలు పెరిగితే సంభవించే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు... ► తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి ► చిన్న చిన్న ద్వీప దేశాలు ఆనవాళ్లు కూడా మిగలకుండా సముద్రంలో కలిసిపోతాయి ► షికాగో మొదలుకుని ముంబై దాకా ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో అలరారుతున్న అతి పెద్ద నగరాలు నీట మునుగుతాయి ► వందలాది కోట్ల మంది నిర్వాసితులవుతారు. ► ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఆర్థిక, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది ► సముద్రపు తాకిడి నుంచి ప్రధాన భూభాగాలకు రక్షణ కవచంగా ఉండే చిత్తడి నేలలతో కూడిన మడ అడవులు అంతరిస్తాయి ► వాటిలో నివసించే పలు జీవ జాతులు అంతరించిపోయే ప్రమాదముంది ► నేల క్రమక్షయానికి లోనవుతుంది. సాగు భూమి పరిమాణమూ తగ్గుతుంది ► భారీ వర్షాలు, అతి భారీ తుఫాన్ల వంటివి పరిపాటిగా మారతాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
రెండేళ్లుగా కరువున్నా నీటికొరత లేదు!
తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి ప్రాంతం రెండున్నరేళ్ల క్రితం తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నది. ఆ జిల్లా ఉదయంపులి గ్రామంలో సేంద్రియ రైతు కె.జయచంద్రన్కు చెందిన 200 ఎకరాల సర్టిఫైడ్ సేంద్రియ (బయోడైనమిక్) వ్యవసాయ క్షేత్రంలో అప్పట్లో తీవ్ర నీటికొరత ఏర్పడింది. ఆ దశలో గుంటూరుకు చెందిన తన మిత్రుడు, సేంద్రియ రైతు ప్రకాశ్‌రెడ్డి సలహా మేరకు.. జయచంద్రన్ తన ఉద్యాన తోటల మధ్యలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. అప్పుడు కందకాలు తవ్వటం వల్ల గత రెండు సంవత్సరాలుగా పెద్దగా వర్షాలు లేకపోయినా.. తోటల సాగుకు ఎటువంటి నీటి కొరతా లేకుండా సజావుగా దిగుబడులను అందుకోగలుగుతున్నానని జయచంద్రన్ ‘సాగుబడి’తో చెప్పారు. 200 వ్యవసాయ క్షేత్రంలో 5–6 ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించుకున్న జయచంద్రన్.. వేర్వేరు క్లస్టర్లలో ఉసిరి, మామిడి, కొబ్బరి, సపోట, బొప్పాయి, నిమ్మ, అరటి, మునగ తోటలను బయోడైనమిక్ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటితోపాటు 5 నుంచి 25 సంవత్సరాల్లో కోతకు వచ్చే అనేక జాతుల కలప చెట్లను వేలాదిగా పెంచుతున్నారు. వీటికి బిందు సేద్యం ద్వారా నీరందిస్తున్నారు. క్లస్టర్ల మధ్యలో మట్టి కట్టల వెంట 9 అడుగుల వెడల్పు, 6–7 అడుగుల లోతున కందకాలు తవ్వించారు. కందకాలలో ప్రతి వంద మీటర్లకు ఒక చోట చెక్ వాల్స్ నిర్మించారు. స్వల్ప ఖర్చుతో నిర్మించిన కందకాల ద్వారా వాన నీరంతా భూమిలోకి ఇంకడం వల్ల 27 బోర్లు, 6 పెద్ద వ్యవసాయ బావుల్లో నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. గత రెండేళ్లుగా నీటి కొరత సమస్యే లేదని జయచంద్రన్(96772 20020) తెలిపారు. సాక్షి, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా ‘చేను కిందే చెరువు’ పేరిట ఐదేళ్ల క్రితం నుంచి నిర్వహిస్తున్న ప్రచారోద్యమ స్ఫూర్తితోనే తన మిత్రుడు జయచంద్రన్కు కందకాల గురించి సూచించానని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
వట్టిపోతున్న ‘పాల’మూరు
♦ జిల్లాలో తగ్గుతున్న పాల ఉత్పత్తి ♦ గ్రాసం లేక కబేళాలకు తరలుతున్న పశుసంపద సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి పశుసంపదను కాపాడుకోవడం శక్తికి మించిన భారంగా పరిణమించింది. వ్యవసాయానికి చేదోడు, వాదోడుగా ఉండే పశువులతో పాటు కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చే పాడి గేదెలకు కనీసం గ్రాసం సమకూర్చలేక రైతాంగం తల్లడిల్లుతోంది. పశువులతో వ్యవసాయ పరంగా తమకున్న అనుబంధాన్ని ఒకవైపు వదులుకోలేక మరోవైపు కరువు పరిస్థితులు ముంచుకొస్తుండడంతో పశువులకు తాగడానికి నీరు, తినడానికి గడ్డి పెట్టడం తమ వల్ల కాక అనేక మంది రైతులు పశువులను తెగనమ్మడానికి సంతకు తరలిస్తున్నారు. కాలం ప్రతికూలించి నప్పుడు, పంటలు సరిగ్గా పండని సమయం లో సైతం జిల్లాలోని అనేక మంది రైతులను పాడి సంపద ఆదుకొనేది. కానీ ఈ ఏడాది రైతుల ఇళ్లలో పాడిగేదెలు వట్టిపోయి ప్యాకెట్ పాలు దర్శనమిచ్చే దుర్భర పరిస్థితి. కబేళాలకు తరలింపు.. జిల్లాలో పలు ప్రాంతాల్లో పాల దిగుబడి గణనీయంగా పడిపోవడంతో రైతాంగం కంట నీరు ఒలుకుతోంది. పశువులకు సరైన మేత, నీరు లేకపోవడంతో అవి బక్కచిక్కడమే గాక రోజూ ఏదో ఒక ఊరు నుంచి పదుల సంఖ్యలో పశువులు కబేళాలకు సిద్ధమవుతున్నాయి. కరువుతో అల్లాడుతున్న జిల్లాలో పశు సంపదను ఆదుకొనే దిక్కే లేకుండా పోయిం ది. గతేడాది చివరి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం పశుసంపద అభివృద్ధి కోసం పైసా విదల్చకపోవడంతో జిల్లాలో పశువుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మేకలు, గొర్రెలకు కూడా గ్రాసం లభించక కనీసం గుక్కెడు నీరు లభించని దుస్థితి నెలకొనడంతో మేకలు, గొర్రెలను బతికించుకొనేందుకు వందల కిలోమీటర్ల దూరం ఆంధ్రా ప్రాంతాలకు వలస తీసుకెళ్తున్నారు. పాన్‌గల్, కొల్లాపూర్, వీపనగండ్ల, పెద్దకొత్తపల్లి, కోడేరు వంటి ప్రాంతాల్లో ఉన్న జీవాలను సమీపంలోని రాయలసీమ జిల్లాలకు మక్తల్, నారాయణపేట, ఆత్మకూర్, మాగనూరు వంటి ప్రాంతాల్లో జీవాలను కర్ణాటక ప్రాంతానికి వాహనాల్లో తరలిస్తున్నారు. పశు సంపదను కాపాడడానికి వాటికి గ్రాసం, నీరు అందించేందుకు అనేక ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం నుంచి మాత్రం ఇందుకు నిధులు విడుదల కాని పరిస్థితి నెలకొంది. ప్రతిపాదనలు బుట్టదాఖలేనా? జిల్లాలో పశు సంపదను కాపాడడానికి దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్ అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపినా కేటాయింపులు మాత్రం ఇప్పటికీ అతీగతీ లేని దుస్థితి నెలకొంది. రోజుకు 7 లక్షల లీటర్ల పాల ఉత్పత్తినిచ్చే 5 లక్షల పాడి ఆవులు, గేదెలకు సరైన గ్రాసం అందక అల్లాడుతున్నాయి. జిల్లాలో పశుగ్రాసం కోసం అధికారులు ప్రభుత్వానికి 70 శాతం సబ్సిడీతో పశుగ్రాసం విత్తనాల పంపిణీ కోసం 1.38 కోట్లు 50 శాతం సబ్సిడీ దాణా కోసం 5.83 కోట్లు లవణ మిశ్రమం పంపిణీకి మరో రూ.82 లక్షలు అవసరమని నివేదికలు పంపించినా ప్రభుత్వం నుంచి మాత్రం నిధుల ఊసే లేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఉచిత పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులు నివేదికల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే పంపించారు. జిల్లాలో పశుసంపద అత్యధికంగా ఉన్నా ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు మాత్రం ఇందుకనుగుణంగా లేకపోవడంతో ఆ శాఖకు వచ్చిన బడ్జెట్ పట్టుమని 6, 7 నెలలకు సైతం సరిపోని దుస్థితి నెలకొంది. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి నెలలు గడిచిన కరువు సహాయక నిధుల ఊసే లేకపోవడంతో పశువులకు గోస తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పాలమూరుగా దేశస్థాయి ప్రసిద్ధి గాంచిన ఈ జిల్లాలో ‘పాల’ ఉత్పత్తి మరింత పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతోపాటు ఆర్థిక ఆలంబన ఇస్తున్న పశు సంపదను కాపాడి తమకు జీవం పోయాలని రైతులు కోరుతున్నారు. -
అన్నదాతకు ‘ఏడు’పే!
జిల్లాలో కరువు మండలాలు ఏడేనట లెక్క తేల్చిన విపత్తుల నిర్వహణ విభాగం త్వరలో అధికారిక ప్రకటన రంగారెడ్డి జిల్లా: అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అతలాకుతలమైన రైతాంగాన్ని విపత్తుల నిర్వహణ విభాగం నట్టేట ముంచింది. కరువు ప్రభావంతో పెట్టుబడులు సైతం దక్కని పరిస్థితి నెలకొనగా.. కనీసం కరువు మండలాల వల్ల పెట్టుబడి రాయితీయైనా దక్కుతుందనుకున్న కర్షకులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో కేవలం ఏడు మండలాలే కరువుకు అర్హత పొందినట్లు విపత్తుల నిర్వహణ విభాగం తేల్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో శేరిలింగంపల్లి, బాలానగర్, ఉప్పల్, శామీర్‌పేట, దోమ, మంచాల, కందుకూరు మండలాలున్నాయి. గ్రామీణ మండలాలు నాలుగే.. జిల్లాలో 37 మండలాలకుగాను 33 గ్రామీణ మండలాలున్నాయి. మరో నాలుగు మండలాలు పట్టణ మండలాలు. జిల్లా యంత్రాంగం ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన కరువు మండలాల నివేదికలో ఏకంగా 37 మండలాలను పేర్కొంది. పంటల సాగు, దిగుబడి, వర్షపాతం వివరాలను జోడించి ఈమేరకు నివేదికలు పంపింది. అయితే విపత్తుల నిర్వహణ విభాగం మాత్రం జిల్లాలో ఏడింటిని మాత్రమే కరువు మండలాలుగా నిర్ధారించింది. ఇలా గుర్తించిన ఏడు కరువు మండలాల్లో కేవలం నాలుగు మండలాలు మాత్రమే గ్రామీణ ప్రాంతాలు. శేరిలింగంపల్లి, ఉప్పల్, బాలానగర్ మండలాల్లో సాగు విస్తీర్ణం పెద్దగా లేదు. అక్కడక్కడా పశుగ్రాసం తప్ప ఇతర పంటల సాగు కనిపించదు. అలాంటి మండలాలను కరువు మండలాలుగా గుర్తించడం విశేషం. మరోవైపు శామీర్‌పేట మండలం ఎక్కువగా పట్టణ ప్రాంతమే. అయితే గ్రామీణ మండలాల్లో కేవలం నాలుగు మాత్రమే కరువు పీడిత ప్రాంతాలుగా ఆ విభాగం నిర్ధారించడంతో జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులకు భారీ నష్టం వాటిల్లనుంది. -
శ్రీశైలానికి తొలి తడి!
ఒక్కరోజే 2.2 టీఎంసీల నీటి చేరిక సుంకేసుల డ్యాంకు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తివేత జూరాలకు సైతం 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో హైదరాబాద్/జూరాల/శాంతినగర్: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాదిలో చుక్క నీటికీ నోచుకోని శ్రీశైలం ప్రాజెక్టుకు తొలిసారి తడి తగిలింది. శ్రీశైలం పరీవాహకంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మంగళవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి 2.2 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 26.65 టీఎంసీల నుంచి 28.85 టీఎంసీలకు పెరిగినట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా ఏ స్థాయిలో నీటి నిల్వ పెరిగిందో బుధవారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు. వీరు చెబుతున్న మేరకు.. కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా పరీవాహకంలో నీటి ప్రవాహాలు గణనీయంగా ఉన్నాయి. దీనికితోడు ఎగువన ఉన్న సుంకేశుల నుంచి భారీ ప్రవాహాలు దిగువకు వస్తుండటంతో శ్రీశైలంలోకి నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర నదిపై సుంకేసుల డ్యాంకు ఎగువన ఉన్న కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు ఒక్కసారిగా డ్యాంకు వరద పోటెత్తింది. ఉదయం ఆరు గంటల వరకు చుక్కనీరు ఇన్‌ఫ్లో లేకపోగా అకస్మాత్తుగా ఏడుగంటల నుంచి వేల క్యూసెక్కుల వరదనీరు రాసాగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో బ్యారేజికి 92 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన డ్యాం, కేసీ కెనాల్ అధికారులు 20 గేట్లు రెండు మీటర్లమేర పైకి ఎత్తి దిగువ తుంగభద్రనదిలోకి 1.60 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. దీంతో వట్టిపోయి కళావిహీనంగా ఉన్న తుంగభద్రమ్మ శ్రీశైలంవైపు పరవళ్లు తొక్కింది. ఉదయం ఓ సమయానికి శ్రీశైలంలోకి 1.60 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగగాా, అది మధ్యాహ్నం 12 గంటల సమయానికి 90 వేలకు తగ్గింది. సాయంత్రం 6 గంటల సమయానికి 40 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ప్రవాహాలతో ప్రాజెక్టులోకి మొత్తంగా 2.2 టీఎంసీల నీరు చేరింది. నాగార్జునసాగర్ కింద తాగునీటి అవసరాలకోసం ఇటీవలే శ్రీశైలం నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసి, ఇరు రాష్ట్రాలు పంచుకున్న నేపథ్యంలో శ్రీశైలంలో నీటి మట్టాలు పడిపోయాయి. భవిష్యత్ తాగు అవసరాలకు నీటి విడుదలపై ఏం చేయాలని ఇరు రాష్ట్రాలు సందిగ్ధంలో పడిన సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులో 2 టీఎంసీల నిల్వలు పెరగడం ఉపశమనం కలిగించే అంశమని అధికారులు చెబుతున్నారు. మరో ఒకట్రెండు రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగితే మరింత నీరు వచ్చి చేరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సుంకేసుల నుంచి కేసీ కెనాల్‌కు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాలకు ప్రవాహం ఇక జూరాల ప్రాజెక్టుకు ప్రవాహాలు కొనసాగుతున్నాయి. మంగళవారం సైతం ప్రాజెక్టులోకి 7,704 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 11.941 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.55 టీఎంసీల నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 11.33 టీఎంసీల నీరు ఉంది. పై నుంచి రిజర్వాయర్‌కు 7,704 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా తాగునీటి అవసరాలకు 100 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
కొండపై నీటి పొదుపు
ముందస్తు జాగ్రత్తల్లో టీటీడీ మఠాలు,హోటళ్లకు సరఫరాలో కోత కాటేజీల్లోనూ కొళాయిల బంద్ పుష్కరిణికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తాగునీటి జలాశయాలు ఎండి పోవడంతో టీటీడీ నీటి పొదుపు చర్యలు ముమ్మరం చేసింది. ఆలయం, నిత్యాన్న ప్రసాద కేంద్రం మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో నీటి సరఫరాలో భారీగా కోత విధించింది. వార్షిక, నవ రాత్రి బ్రహ్మోత్సవా లకు నీటి ఎద్దడి లేకుండా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. తిరుమల:తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే సుమారు 70 వేల మంది భక్తులతో పాటు ఆలయ అవసరాల కోసం రోజూ 32 లక్షల గ్యాలన్ల నీరు అవసరం. ఏటా కురవాల్సిన 1,369.4 మిల్లీ మీటర్ల వర్షపాతంలో కనీసం 800 మి.మీ కూడా పడలేదు. తాగునీటిని సరఫరా చేసే గోగర్భం(2,840 లక్షల గ్యాలన్లు), ఆకాశ గంగ(670 లక్షల గ్యాలన్లు), కుమారధార(3224.83 లక్షల గ్యాలన్లు), పసుపుధార(886.70 లక్షల గ్యాలన్ల) ఎండిపోయాయి. ఒక్క పాపవినాశనం(5240 లక్షల గ్యాలన్లు)లో 20 శాతం మాత్రమే నీటి నిల్వ ఉంది. గంగ, బోర్ల నీటితో నెట్టుకొస్తున్న టీటీడీ తిరుమల అవసరాల కోసం రోజూ 5 నుంచి 7 ఎంఎల్డీ తెలుగుగంగ నీటిని సరఫరా చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం రోజూ 10 ఎంఎల్డీ (22.5 లక్షల గ్యాలన్లు) తెలుగుగంగ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా ప్రస్తుతం అందులో సగం మాత్ర మే అందుతోంది. దీంతోపాటు కల్యాణీ డ్యాంలో వేసిన బోర్ల ద్వారా మరికొంత నీటిని సేకరిస్తున్నా రు. వీటితో భక్తులు, ఆలయం, అన్నదానం కోసం సరఫరా చేస్తున్నారు. నిత్యం వాడే నీటిలో సుమారు 40 శాతం కోత విధించారు. నీటిని చాలా పొదుపుగా వాడుతున్నారు. మఠాలు, హోటళ్లకు భారీగా కోత తిరుమలలోని 30 మఠాలు, 20 దాకా పెద్ద హోటళ్లు, మరో 50 హోటళ్లకు సరఫరా చేసే నీటిని బట్టి టీటీడీ అద్దె వసూలు చేస్తోంది. తాజా పరిస్థితులతో భారీగా నీ టి కోత విధించారు. దీంతో ప్రత్యామ్నాయంగా తిరుప తి నుంచి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్‌లో కూడా పది రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. కాటేజీల్లో ని నీటి కొళాయిల(నల్లాలు) సరఫరాలోనూ కోత విధిం చారు. ఆరుబయట కొన్ని తాగునీటి కొళాయిల్ని మూసివేశారు. కాటేజీల్లో మరుగుదొడ్డి, స్నానాల గది, వాష్బేసిన్లో మూడు కొళాయిలు ఉంటాయి. రెండు కొళాయి లు మూసివేసి కేవలం ఓ కొళాయి ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆరుబయట రోడ్లకు ఇరువైపులా ఉం డే మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కొన్ని మూసివేశారు. మరికొన్నింటిలో నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ట్యాంకర్లతోనే శ్రీవారి పుష్కరిణికి మంచినీరు సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు వార్షిక, అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం పుష్కరిణికి మరమ్మతులు పూర్తి చేశారు. తిరుమలలోని మంచి నీటి డ్యామ్‌లు ఎండిపోవడంతో తిరుపతి నుంచి ట్యాంకర్లతో నీటిని పుష్కరిణికి సరఫరా చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు నీటి ఇబ్బందులు లేకుండా పొదుపు చర్యల్ని టీటీడీ పెంచింది.