అన్నదాతకు ‘ఏడు’పే!
జిల్లాలో కరువు మండలాలు ఏడేనట
లెక్క తేల్చిన విపత్తుల నిర్వహణ విభాగం
త్వరలో అధికారిక ప్రకటన
రంగారెడ్డి జిల్లా: అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అతలాకుతలమైన రైతాంగాన్ని విపత్తుల నిర్వహణ విభాగం నట్టేట ముంచింది. కరువు ప్రభావంతో పెట్టుబడులు సైతం దక్కని పరిస్థితి నెలకొనగా.. కనీసం కరువు మండలాల వల్ల పెట్టుబడి రాయితీయైనా దక్కుతుందనుకున్న కర్షకులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో కేవలం ఏడు మండలాలే కరువుకు అర్హత పొందినట్లు విపత్తుల నిర్వహణ విభాగం తేల్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో శేరిలింగంపల్లి, బాలానగర్, ఉప్పల్, శామీర్‌పేట, దోమ, మంచాల, కందుకూరు మండలాలున్నాయి.
గ్రామీణ మండలాలు నాలుగే..
జిల్లాలో 37 మండలాలకుగాను 33 గ్రామీణ మండలాలున్నాయి. మరో నాలుగు మండలాలు పట్టణ మండలాలు. జిల్లా యంత్రాంగం ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన కరువు మండలాల నివేదికలో ఏకంగా 37 మండలాలను పేర్కొంది. పంటల సాగు, దిగుబడి, వర్షపాతం వివరాలను జోడించి ఈమేరకు నివేదికలు పంపింది. అయితే విపత్తుల నిర్వహణ విభాగం మాత్రం జిల్లాలో ఏడింటిని మాత్రమే కరువు మండలాలుగా నిర్ధారించింది. ఇలా గుర్తించిన ఏడు కరువు మండలాల్లో కేవలం నాలుగు మండలాలు మాత్రమే గ్రామీణ ప్రాంతాలు. శేరిలింగంపల్లి, ఉప్పల్, బాలానగర్ మండలాల్లో సాగు విస్తీర్ణం పెద్దగా లేదు. అక్కడక్కడా పశుగ్రాసం తప్ప ఇతర పంటల సాగు కనిపించదు. అలాంటి మండలాలను కరువు మండలాలుగా గుర్తించడం విశేషం. మరోవైపు శామీర్‌పేట మండలం ఎక్కువగా పట్టణ ప్రాంతమే. అయితే గ్రామీణ మండలాల్లో కేవలం నాలుగు మాత్రమే కరువు పీడిత ప్రాంతాలుగా ఆ విభాగం నిర్ధారించడంతో జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులకు భారీ నష్టం వాటిల్లనుంది.