శ్రీశైలానికి తొలి తడి!
ఒక్కరోజే 2.2 టీఎంసీల నీటి చేరిక
సుంకేసుల డ్యాంకు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తివేత
జూరాలకు సైతం 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
హైదరాబాద్/జూరాల/శాంతినగర్: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాదిలో చుక్క నీటికీ నోచుకోని శ్రీశైలం ప్రాజెక్టుకు తొలిసారి తడి తగిలింది. శ్రీశైలం పరీవాహకంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మంగళవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి 2.2 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 26.65 టీఎంసీల నుంచి 28.85 టీఎంసీలకు పెరిగినట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా ఏ స్థాయిలో నీటి నిల్వ పెరిగిందో బుధవారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు. వీరు చెబుతున్న మేరకు.. కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా పరీవాహకంలో నీటి ప్రవాహాలు గణనీయంగా ఉన్నాయి. దీనికితోడు ఎగువన ఉన్న సుంకేశుల నుంచి భారీ ప్రవాహాలు దిగువకు వస్తుండటంతో శ్రీశైలంలోకి నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర నదిపై సుంకేసుల డ్యాంకు ఎగువన ఉన్న కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు ఒక్కసారిగా డ్యాంకు వరద పోటెత్తింది. ఉదయం ఆరు గంటల వరకు చుక్కనీరు ఇన్‌ఫ్లో లేకపోగా అకస్మాత్తుగా ఏడుగంటల నుంచి వేల క్యూసెక్కుల వరదనీరు రాసాగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో బ్యారేజికి 92 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది.
దీంతో అప్రమత్తమైన డ్యాం, కేసీ కెనాల్ అధికారులు 20 గేట్లు రెండు మీటర్లమేర పైకి ఎత్తి దిగువ తుంగభద్రనదిలోకి 1.60 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. దీంతో వట్టిపోయి కళావిహీనంగా ఉన్న తుంగభద్రమ్మ శ్రీశైలంవైపు పరవళ్లు తొక్కింది. ఉదయం ఓ సమయానికి శ్రీశైలంలోకి 1.60 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగగాా, అది మధ్యాహ్నం 12 గంటల సమయానికి 90 వేలకు తగ్గింది. సాయంత్రం 6 గంటల సమయానికి 40 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ప్రవాహాలతో ప్రాజెక్టులోకి మొత్తంగా 2.2 టీఎంసీల నీరు చేరింది. నాగార్జునసాగర్ కింద తాగునీటి అవసరాలకోసం ఇటీవలే శ్రీశైలం నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసి, ఇరు రాష్ట్రాలు పంచుకున్న నేపథ్యంలో శ్రీశైలంలో నీటి మట్టాలు పడిపోయాయి. భవిష్యత్ తాగు అవసరాలకు నీటి విడుదలపై ఏం చేయాలని ఇరు రాష్ట్రాలు సందిగ్ధంలో పడిన సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులో 2 టీఎంసీల నిల్వలు పెరగడం ఉపశమనం కలిగించే అంశమని అధికారులు చెబుతున్నారు. మరో ఒకట్రెండు రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగితే మరింత నీరు వచ్చి చేరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సుంకేసుల నుంచి కేసీ కెనాల్‌కు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జూరాలకు ప్రవాహం
ఇక జూరాల ప్రాజెక్టుకు ప్రవాహాలు కొనసాగుతున్నాయి. మంగళవారం సైతం ప్రాజెక్టులోకి 7,704 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 11.941 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.55 టీఎంసీల నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 11.33 టీఎంసీల నీరు ఉంది. పై నుంచి రిజర్వాయర్‌కు 7,704 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా తాగునీటి అవసరాలకు 100 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.