కరువు కాటు.. కాడెద్దులూ భారమే!
వ్యవసాయం చేసే కుటుంబాల్లో ఎదిగిన కొడుకు తల్లిదండ్రులకు ఎంత అండో.. కాడెద్దులు కూడా అంతే... పశువుల వయస్సు పెరిగి వ్యవసాయానికి పనికిరాక పోయినా అమ్మడానికి రైతులు ఒప్పుకోరు... రైతులకు, పశువులకు అంత అనుబంధం ఉంటుంది... అలాంటి వారికి ఇప్పుడు పెద్ద కష్టమొచ్చింది. ఇలాంటి సమయంలో సాగు సంగతి దేవుడెరుగు. కనీసం పశువుల కడుపు నిండే పరిస్థితి కూడా లేదు... దీంతో మూగ జీవాల బాధ చూడలేక మరో గత్యంతరం లేక కళేబరాలకు అమ్ముకుంటున్నారు.
చిన్నమండెం: జిల్లాలోని పలు మండలాల నుంచి నెల రోజులుగా వందల సంఖ్యలో పశువులను కళేబరాలకు తరలిస్తున్నారు. ఏ సంతలో చూసినా ఇదే దృశ్యం కనిపిస్తోంది. పశువులకు మేత కూడా లేకపోవడంతో సంత జరిగే ప్రాంతాలలో దిగాలుగా పశువులను అమ్మేదుకు వచ్చిన అన్నదాతలే కనిపిస్తున్నారు. ప్రతి నిత్యం రాయచోటి-బెంగ ళూరు ప్రధాన రహదారిలో, కడప-చిత్తూరు జాతీయ రహదారిలో పశువులతో వెళ్తున్న లారీలు కనిపిస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చినుకు కూడా రాలకపోవడంతో చెరువుల్లో నీరు లేక పంటలు సాగు చేసే అవకాశం లేకుండా పోయింది.
కనీసం పశువులకు కావాల్సిన మేత కూడా దొరకక పోవడంతో వాటిని బతికించుకునే అవకాశాలు లేవని, అందుకే అమ్ముకుంటున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కనీసం పాలు ఇచ్చే పాడి పశువులకైనా ప్రభుత్వం పశుగ్రాసం పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. గతంలో వరిగడ్డి కట్ట ఒక్కొక్కటి రూ.5-6లకు దొరుకుతుంటే, ప్రస్తుతం అది రెండింతలు అయ్యింది. దీంతో పాటు ట్రాక్టర్ వేరుశనగ కట్టె కొనాలంటే రూ.15 వేలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మేత భారం మోయలేక అమ్ముకుంటున్నారు. దీంతో పాడి పశువులు, సేద్యం చేసే పశువులు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయి. పశువుల మాంసానికి పలు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉండటం అందుకు ఒక కారణంగా తెలుస్తోంది. అయితే పశువులను అక్రమంగా తరలించటం చట్ట వ్యతిరేకమని చట్టాలు చెబుతున్నాయి.
కాడెద్దులను మేపాలంటే భారంగా ఉంది: బుడ్డా వెంకట్రమణ, చాకిబండ కస్పా, రైతు కరువు వచ్చేసింది. పశువుల మేత దొరకడం లేదు. పంటలు సాగు అవ్వలేదు. కాడెద్దులు మేపాలంటే భారంగా ఉంది. గతంలో అడవులకు పశువులను తీసుకెళ్లి మేపే వాళ్లం. పంట పొలాల చుట్టూ పశువులకు కావాల్సిన మేత ఉండేది. కానీ ఇప్పుడు లేదు. మేత కొనాల్సిన పరిస్థితి వచ్చింది. నెలకు పశువుల మేతకు సుమారు 4-5వేల రూపాయలు అవుతోంది. దీంతో చుట్టు పక్కల చాలా ఊర్లలో పశువులను అమ్ముకున్నారు. నెల రోజుల వరకు వర్షాలు పడకుంటే మేము కూడా పశువులను అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం అయినా ఆదుకుని, పశుగ్రాసం పంపిణీ చేయిస్తే బాగుంటుంది.