The Lancet Planetary Health journal: ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం | The Lancet Planetary Health journal: PM2. 5 pollution takes 33,000 lives each year in Indian cities | Sakshi
Sakshi News home page

The Lancet Planetary Health journal: ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం

Published Fri, Jul 5 2024 5:17 AM | Last Updated on Fri, Jul 5 2024 5:17 AM

The Lancet Planetary Health journal: PM2. 5 pollution takes 33,000 lives each year in Indian cities

దేశంలోని పది పెద్ద నగరాల్లో 7.2 శాతం మరణాలకు ‘పీఎం 2.5’ ధూళి కణాలే కారణం  

‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌’ పత్రిక వెల్లడి 

న్యూఢిల్లీ: ఆయువు పోయాల్సిన వాయువు ప్రాణాలు తోడేస్తోంది. వాయువులో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి పీలిస్తే శరీరంలోకి చేరిపోయి, అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇండియాలోని పది అతిపెద్ద నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన పరిమితి కంటే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పీఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ పత్రిక స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలియజేసింది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్నాయని పేర్కొంది. అధ్యయనం వివరాలను పత్రికలో ప్రచురించారు. 2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ధూళి కణాలను ‘పీఎం 2.5 కణాలు’ అంటారు.  

→ భారతదేశంలోని పెద్ద నగరాల్లో నిత్యం వెలువడుతున్న పీఎం 2.5 ధూళి కణాలతో మరణాల ముప్పు నానాటికీ పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు.  

→ ఇండియాలో వాయు కాలుష్యంపై వారణాసిలోని బనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ క్రానిక్‌ డిసీజ్‌ కంట్రోల్‌తోపాటు పలువురు అంతర్జాతీయ పరిశోధకులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, సిమ్లా, వారణాసి నగరాల్లో 2008 నుంచి 2019 దాకా ఈ అధ్యయనం నిర్వహించారు.   

→ క్యూబిక్‌ మీటర్‌ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగుతున్నట్లు  గుర్తించారు. అంతేకాకుండా మరణాల మప్పు 2.7 శాతం పెరుగుతున్నట్లు తేల్చారు.  

→ ప్రపంచ ఆరోగ్య సంస్థ విధివిధానాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్‌ మీటర్‌ గాలిలో పీఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం లేదు. అంతకంటే మించితే ముప్పు తప్పదు.  

→ భారత వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో క్యూబిక్‌ మీటర్‌ గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉండే ప్రమాదం అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తేలింది.  

→ క్యూబిక్‌ మీటర్‌ గాలిలో పీఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు.   

→ స్థానికంగా వెలువడే ఉద్గారాలు, కాలుష్యంతో పీఎం 2.5 కణాల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే స్థానికంగా కాలుష్యాన్ని సమర్థవంతంగా కట్టడి చేస్తే మరణాల ముప్పు చాలావరకు తగ్గుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement