శ్వాసకోశ సమస్యలన్నీ సైనస్‌కు ఇబ్బందే... | The risks to the Asthma Sinus problems ... | Sakshi
Sakshi News home page

శ్వాసకోశ సమస్యలన్నీ సైనస్‌కు ఇబ్బందే...

Published Wed, Jan 27 2016 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

The risks to the Asthma Sinus problems ...

హోమియో కౌన్సెలింగ్
 
నా మిత్రుడికి 24 సంవత్సరాలు. తను గత ఆరు నెలలుగా తీవ్రమైన తలనొప్పి, ముక్కుదిబ్బడ, తుమ్ములు, ముక్కుకారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే సైనసైటిస్ అని నిర్థారించి, నివారణగా యాంటీబయాటిక్స్ ఇచ్చారు. వాటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. హోమియోలో దీనికి పరిష్కారం ఉంటే చెప్పగలరు.  - ఎస్.పవన్ కుమార్, తెనాలి.
 కపాలంలో గాలితో నిండి కవాటాలను సైనస్‌లని అంటారు. ఈ సైనస్‌లు మ్యూకస్ మెంబ్రేన్ అనే మెత్తటి పొరతో కప్పి ఉంటాయి. ఈ మెంబ్రేన్ పలుచటి ద్రవపదార్థాన్ని స్రవిస్తుంది. ఇవి స్రవించే మార్గంలో వివిధ కారణాల వల్ల అడ్డంకులు ఏర్పడి ఇన్ఫెక్షన్ రావచ్చు. దీనినే సైనసైటిస్ అంటారు. అన్ని రకాల శ్వాసకోశ సమస్యలు ఈ సైనస్‌పై ప్రభావం చూపుతాయి.
 
లక్షణాలు: సైనస్‌లు ఉన్న భాగం నొప్పి, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, తల బరువుగా ఉండటం, కొంచెం దూరం నడిస్తే ఆయాసం, జ్వరం, నిద్రలేమి, తలనొప్పి, తుమ్ములు, ఆకలి మందగించడం వంటివి.
 
కారణాలు: ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్లు, సైనస్‌లకు దగ్గరగా ఉండే ఎముకలు విరగడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, దంతాల ఇన్ఫెక్షన్స్, నాసల్ కేవిటీలో ద్రవాలు నిల్వ ఉండటం, చల్లని వాతావరణం, పౌష్టికాహారలోపం, డయాబెటిస్, తట్టు, అమ్మవారు, కోరింత దగ్గు, డీఎన్‌ఎస్. సైనసైటిస్‌లలో మాక్సిలరీ సైనసైటిస్, ఫ్రంటల్ సైనసైటిస్, ఇథిమాయిడల్ సైనసైటిస్, స్పీనాయిడల్ సైనసైటిస్ అని నాలుగు రకాలున్నాయి.

నిర్ధారణ: వ్యాధి లక్షణాలను బట్టి, సైనస్ ఎక్స్‌రే, సీబీపీ, ఈఎస్సార్‌ల ఆధారంగా.
 
నివారణ: వేడినీటి ఆవిరి పట్టడం, వ్యాయామం చేయడం, ఎలర్జీ కలిగించే వస్తువులకు,చల్లటి ఆహార పదార్థాలకు, చల్లటి వాతావరణానికి, ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండటం, శ్వాసకోశ వ్యాధులు దీర్ఘకాలంపాటు ఉండకుండా చూసుకోవడం, ధూమపానం అలవాటుంటే మానేయడం, దుమ్మూధూళికి దూరంగా ఉండటం.
 
హోమియో చికిత్స: హోమియోలో ఎటువంటి సమస్యలకయినా కాన్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా క్రమేపీ రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను తగ్గించి క్రమక్రమంగా వ్యాధి నివారణ జరుగుతుంది. మీ స్నేహితుడిని వెంటనే హోమియో వైద్యనిపుణుని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోమని చెప్పండి.
 
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
 
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
 
నాకు ఈ మధ్యకాలంలో కడుపులో నీరు వస్తుంది. కాళ్లు వాపుగా ఉంటున్నాయి. దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిస్తే మందులు ఇచ్చారు. అవి వేసుకున్నప్పుడు ఈ రెండు సమస్యలు తగ్గిపోయాయి. కానీ కొన్నిరోజుల తరువాత మళ్లీ ఈ సమస్యలు మొదలైనవి. మందులు వేసుకున్నప్పుడు తగ్గుతుంది. ఎందుకిలా? నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఇలా జరుగుతుందంటారా? జీవితాంతం ఈ మందులు వాడాలా? ఇంకేదైనా సమస్య ఉందా? ఏం చేయాలో సరైన సలహా ఇవ్వగలరు.  - రమణ, శ్రీకాకుళం
 మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే సాధారణంగా కిడ్నీ సమస్యల వల్ల వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. లివర్ మరియు గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు కాబట్టి ఇది లివర్ వల్ల వచ్చిన వ్యాధి అయి ఉంటుంది. మీరు ఏమైనా పరీక్షలు చేయించుకున్నారో లేదో చెప్పలేదు. ఒకసారి మీరు కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీరు పరీక్షలు చేయించుకోండి. వాటి రిపోర్టుల ఆధారంగా మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంట్రారాలజిస్టును కలిస్తే సరైన చికిత్స అందించగలుగుతారు.
 
నాకు చాలా రోజుల నుంచి ఛాతీలో మంటగా ఉంటోంది. చిన్న విషయమే కదా అని మెడికల్ షాపులో అడిగితే డైజిన్ జెల్ తాగమని ఇచ్చారు. ఇది తాగినప్పుడు మంట తగ్గుతుంది. కానీ తరువాత మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి?
 - తేజ, అమలాపురం

 మీరు తెలిపిన విషయాలను బట్టి చూస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫెగల్ రిప్లెక్స్ డిసీజ్ ఉన్నట్లనిపిస్తోంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యం ఇది. మీరు మీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలావరకు మీ సమస్య తగ్గిపోతుంది. మీరు కాఫీ, టీలను మానేయాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి. మద్యం మానివేయాలి. పొగ తాగకూడదు. బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి. భోజనం చేయగానే పడుకోకూడదు. ఈ మార్పులు తప్పనిసరిగా చేస్తే మీరు మీ సమస్యను అధిగమించగలరు. అయినా తగ్గకపోతే మీరు డాక్టర్ సలహా మేరకు ఒక్కసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకొని చికిత్స పొందగలరు.
 
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
 
న్యూరో కౌన్సెలింగ్
 
 మా అమ్మకు 53 ఏళ్లు. చాలాకాలంగా ఆమె భరించలేనంత తలనొప్పితో బాధపడుతున్నారు. అన్నిరకాల వైద్యాలు ప్రయత్నించిన తర్వాత ఇటీవల ఎమ్మారై స్కాన్ చేయిస్తే మెదడులో క్యాన్సర్ కణితులు ఉన్నట్లు తేలింది. ఇది మాకు షాక్‌లా ఉంది. సర్జరీ, రేడియేషన్‌తో కణితులను తొలగించవచ్చని ఆయన అంటున్నారు. కానీ మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వగలరు.  - రవళి, గుడివాడ
మెదడులో క్యాన్సర్ కణితులు ఉన్నట్లు హఠాత్తుగా తెలుసుకోవడం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. ఒకప్పుడు మెదడులో కణితులకు చికిత్స కష్టమేమోగానీ, ఇప్పుడున్న చికిత్స పద్ధతులతో అంతగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. సాధారణ కణితులను సర్జరీ చేసి తొలగిస్తే సరిపోతుంది. కానీ క్యాన్సర్ కణితుల విషయంలో వాటిని తొలగించడంతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటివి అవసరమవుతాయి. మెదడులో వచ్చే కణితుల్లో నాలుగు గ్రేడులు ఉంటాయి. ఇతర క్యాన్సర్ల మొదటి దశతో మొదలై క్రమేపీ ముదిరి నాలుగో దశకు చేరతాయి. కాబట్టి ఇలాంటి క్యాన్సర్లను ముందుగానే గుర్తిస్తే వాటిని దాదాపుగా నయం చేసే వీలుంటుంది. కానీ మెదడులో వచ్చే క్యాన్సర్ కణితుల విషయంలో క్రమేపీ ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడం ఉండదు. మొదలవుతూనే అవి మూడు లేదా నాలుగో దశలతో ఉండవచ్చు. కణితి మొదటి రెండు గ్రేడులలో ఉంటే చికిత్సతో రోగి జీవితకాలాన్ని పదేళ్లకు పెంచవచ్చు. కానీ నాలుగో దశలో కణితులు ఉంటే మాత్రం రోగి ఎక్కువకాలం జీవించడం కష్టం. కణితి చాలా చిన్నగా ఉండి, ఎమ్మారై స్కానింగ్‌లో అది మొదటి రెండు గ్రేడ్‌లలో ఉందని తేలితే వెంటనే సర్జరీ చేసి తొలగించాల్సిన అవసరం లేదు.

అది పెరిగి 2 నుంచి 3 సెం.మీ. సైజుకు చేరితే అప్పుడు సర్జరీ అవసరమవుతుంది. అలాగే మెదడులోని నుదురు, చెవుల భాగంలో వచ్చే కణితులను సర్జరీతో తొలగిస్తే చాలావరకు సాధారణ జీవితం గడపవచ్చు. కానీ మెదడు మధ్యభాగంలో వచ్చే కణితులను పూర్తిగా తొలగించడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనకు మాటలు వచ్చేలా చేసే కేంద్రం, శరీర కదలికలను నియంత్రించే కేంద్రం వంటి వాటిని గుర్తించి, వాటిని ముట్టుకోకుండా మిగతా భాగంలో ఉన్న కణితిని తొలగించాలి. మిగిలిపోయిన భాగాలను రేడియోథెరపీ, కీమోథెరపీల ద్వారా నయం చేయవచ్చు. ఒకవేళ కణితి మెదడు మధ్యభాగంలో వస్తే మెదడు కణజాలాన్నీ, కణితినీ వేరు చేసి చూడటం కష్టమవుతుంది. పొరబాటున కణితితో పాటు మెదడు భాగాన్ని కూడా తొలగిస్తే చాలా నష్టం. కాబట్టి ఈ తేడాను గుర్తించేందుకు నిపుణులు మైక్రోస్కోపిక్, నావిగేషన్ వంటి పరిజ్ఞానాలను వినియోగిస్తారు. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా అన్ని సౌకర్యాలతో పాటు నిపుణులైన న్యూరోసర్జన్లు ఉన్న దగ్గర్లోని కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స తీసుకోండి.
 
డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం
సీనియర్ న్యూరో సర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement