సాక్షి, హైదరాబాద్: మనుషుల కంఠస్వరం నుంచి వెలువడే శబ్దాన్ని (వాయిస్) బట్టి కరోనా సోకిందా? లేదా వారు ఈ వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారా అనేది చెప్పేస్తామంటున్నారు బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు. శబ్దాధారిత పరీక్షలతో కరోనా వైరస్‌ను నిర్ధారించవచ్చని వారంటున్నారు. శ్వాస, దగ్గు, కంఠస్వరాల ద్వారా ‘కరోనా స్ప్రెడర్స్’ను చాలా వేగంగా గుర్తించొచ్చునని, ఇందుకయ్యే ఖర్చూ అతి స్వల్పమేనని చెబుతున్నారు. ఇప్పటికే పరిమితంగా నిర్వహించిన అధ్యయనంలో ఇతర శ్వాసకోశ వ్యాధిగ్రస్తులతో పోలిస్తే కరోనా పేషెంట్ దగ్గు భిన్నంగా ఉందని ప్రాథమికంగా గుర్తించినట్టు వెల్లడించారు. బ్రాంకటీస్ లేదా శ్వాసకోశాల ఇన్ఫెక్షన్ వంటి శ్వాసకోస సంబంధ వ్యాధులున్న వారి దగ్గుతో పోలిస్తే కరోనా పేషెంట్ల దగ్గు భిన్నంగా ఉన్నట్టు చెబుతున్నారు.
మార్చి చివరి నుంచే..
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దశలోనే మార్చి నెలాఖరు నుంచి ఐఐఎస్‌సీ పరిశోధన బృందం స్మార్ట్‌ఫోన్ ద్వారా కరోనా బారిన పడినవారు, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్న వారి నుంచి కంఠస్వరం, దగ్గు శబ్దాల శ్యాంపిళ్ల డేటాను సేకరించడం మొదలుపెట్టింది. ఐఐఎస్‌సీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇతర విభాగాలకు చెందిన పరిశోధకుల బృందం.. ఆరోగ్యంతో ఉన్న వారి దగ్గు, శ్వాసకోశ సమస్యలున్న వారి దగ్గు శబ్దాల్లో తేడా, రకాలున్నట్టు గుర్తించింది.
పరిశోధనకు ఐసీఎంఆర్ ఓకే..
అమెరికా నుంచి వెలువడిన పరిశోధన పత్రం.. ఈ పరిశోధన బృందంలో ఆసక్తిని రేకెత్తించింది. కరోనా పేషెంట్ల దగ్గు ఇతర రోగుల దగ్గుకంటే భిన్నంగా ఉన్నట్టు ఆ పత్రం పేర్కొంది. కంఠస్వర శబ్దం, దగ్గు ఆధారిత డేటా ఆధారంగా కరోనా నిర్ధారణలో 95% కచ్చితత్వం సాధించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఐఐఎస్‌సీ సేకరించిన నమూనాలు తక్కువగా ఉండటంతో ఆస్పత్రుల్లోని పేషెంట్ల నుంచి నమూనాలు సేకరించాలని భావించినా అది సాధ్యంకాలేదు. దీంతో భారీగా డేటా సేకరణకు ఐసీఎంఆర్‌ను ఐఐఎస్‌సీ అనుమతి కోరగా అందుకు ఆమోదం తెలిపింది. దీంతో శ్వాససంబంధ అంశాలు, దగ్గు, కంఠస్వరాలు ఆధారంగా కరోనా నిర్ధారణకు సంబంధించి ‘కోస్వర’పేరిట ఐఐఎస్‌సీ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.
నిర్ధారణ ఇలా..
వెబ్, మొబైల్ అప్లికేషన్ రూపంలో కరోనా నిర్ధారణ సాధనాన్ని (డయాగ్నసిస్ టూల్) ఐఐఎస్‌సీ పరిశోధకులు విడుదల చేయనున్నారు. తమ కంఠస్వరాలను (శబ్దాలు) రికార్డ్ చేయాల్సిందిగా ఈ అప్లికేషన్ కోరుతుంది. ఇలా భారీగా శ్వాసకోశ సమస్యలు, ఇతరుల నుంచి వాయిస్ శాంపిల్స్ ద్వారా డేటాను రికార్డ్ చేశాక ఆయా వ్యక్తుల నుంచి వెలువడే శబ్దాల ఆధారంగా స్కోర్‌ను వెల్లడిస్తారు. ఈ స్కోర్ ఆధారంగా కరోనా సోకిందా లేదా ఆయా వ్యక్తుల నుంచి వైరస్ వ్యాప్తికి అవకాశముందా అనేది తేలుస్తారు.
దేశంలో కరోనా ఏ మేరకు?
దేశంలో కరోనా ఏ మేరకు వ్యాపించింది? వైరస్ తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి? కమ్యూనిటీ స్ప్రెడ్, ట్రాన్స్‌మిషన్ ఏ మేరకుంది? అనే అంశాలపై స్పష్టమైన అంచనా సాధించే కసరత్తు మొదలుకానుంది. సమాజంలో ఎంత మందికి ఈ వైరస్ సోకింది అనే విషయాన్ని తేల్చేందుకు రక్తనమూనాల పరీక్షల (సెరో సర్వే) అధ్యయనానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సర్వే కోసం పుణే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అభివృద్ధి చేసిన యాంటీబాడీ టెస్టింగ్ కిట్లను ఉపయోగించనున్నారు. కరోనా పాజిటివ్ కేసుల గుర్తింపునకు శ్వాబ్ టెస్ట్‌లను నిర్వహిస్తుండగా మధుమేహం, ఇతర రోగాలను అక్కడికక్కడే బ్లడ్ శాంపిళ్లను స్ట్రిప్‌ల ద్వారా గుర్తించేలా ఈ సర్వేలో పరీక్షలు నిర్వహించనున్నారు.
70% కేసులు ఆ 10 నగరాల్లోనే..
దేశంలోని ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, ఇండోర్, థానే, జైపూర్, సూరత్ హాట్‌స్పాట్ నగరాల్లో చేపట్టనున్న సెరోసర్వేను ఈ వారంలోనే ప్రారంభించ నున్నారు. ఇప్పటివరకు దేశంలోని మొత్తం కేసుల లోడ్‌లో 70 శాతం ఈ నగరాల నుంచే ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ సర్వే ద్వారా దేశంలోని ఎంత శాతం జనాభా ఈ వైరస్ బారిన పడింది, మరణాలను తగ్గించేందుకు ఏ చర్యలు తీసుకోవాలన్నది స్పష్టమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment