సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వేరియంట్లతో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) శాస్త్రవేతలు మారుమూల గ్రామాల్లో అధ్యయనం మొదలుపెట్టారు. గ్రామీణులపై అది ఏవిధంగా ప్రభావం చూపుతోందనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి అలవాట్లు, జీవనశైలి గురించి పరిశీలనలు జరుపుతున్నారు. ‘ఏ వంట నూనె వాడుతున్నారు. బోరు నీరు తాగుతున్నారా. భోజనంలో చిరుధాన్యాలు, పండ్లు ఏమైనా తీసుకుంటున్నారా. రోజులో ఎన్నిగంటలు వ్యవసాయ పని చేస్తున్నారు. వారంపాటు చేను పనికి వెళ్లకపోతే ఆరోగ్యం ఎలా ఉంటోంది.. ఇలాంటి ప్రశ్నలను ప్రజలకు సంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్‌ఐఎన్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్) ప్రతినిధులతో కలసి సంగారెడ్డి జిల్లాలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహిస్తోంది. ఈ ప్రశ్నావళిలో 40కిపైగా ప్రశ్నలు, ఉపప్రశ్నలున్నాయి.
ఒక్క కేసూ నమోదుకాని గ్రామాల్లో..
ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదుకాని గ్రామాలు, అత్యధికంగా కోవిడ్ వచ్చిన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఐసీఎంఆర్ ఈ సర్వే చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని అమీరాబాద్ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని కరస్‌గుత్తి పీహెచ్‌సీ పరిధిలో ఉండే ఈ మారుమూల గ్రామంలో ఐసీఎంఆర్ బృందం సర్వే చేసిందని స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గణపతిరావు తెలిపారు. మరోవైపు అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదైన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాక్స్‌నగర్ పీహెచ్‌సీ పరిధిలో కూడా ఈ సర్వే చేసింది.
వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచీ వివరాల సేకరణ..
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి జీవనశైలి ఎలా ఉందనే కోణంలోనూ శాస్త్రవేత్తలు వివరాలు రాబట్టారు. వ్యాక్సిన్ వేసుకోనివారు, కేవలం ఒక్క డోసు మాత్రమే వేసుకున్న వారు, రెండోడోసు వేసుకున్నవారు, బూస్టర్ డోసు కూడా వేసుకున్నవారు.. ఇలా వివిధ పారామీటర్లలో ప్రజలను ఎంపిక చేసుకుని వివరాలు సేకరించారు.
రక్త నమూనాలూ సేకరణ
సర్వే సందర్భంగా ఐసీఎంఆర్ బృందం సంబంధిత వ్యక్తుల నుంచి 3 ఎం.ఎల్. చొప్పున రక్తనమూనాలను తీసుకుంటోంది. ఒక్కో గ్రామంలో సుమారు 20 నుంచి 40 మందిని సర్వే చేసి వివరాలను రాబడుతోంది. సర్వేలో భాగంగా స్త్రీలు, పురుషుల నుంచి వివరాలు రాబడుతోంది.
ఇదీ ఉద్దేశం..
కోవిడ్–19 సంక్రమణ, వ్యాప్తిని నివారించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఐసీఎంఆర్ అధికారులు చెబుతున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా ఈ వైరస్ నియంత్రణ, రానున్న రోజుల్లో మార్గదర్శకాల జారీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సర్వే చేస్తున్నవారికి ఉద్దేశాన్ని వివరిస్తూ కరపత్రాలను కూడా అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment