హాట్‌స్పాట్లు @ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ | Without Permission Private Hospitals Doing Treatment For Coronavirus | Sakshi
Sakshi News home page

హాట్‌స్పాట్లు @ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌

Published Sun, Aug 16 2020 4:24 AM | Last Updated on Sun, Aug 16 2020 1:28 PM

Without Permission Private Hospitals Doing Treatment For Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌కు చెందిన ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి కరోనా చికిత్స చేసేందుకు అనుమతి లేదు. అయినా అక్కడకు వచ్చే కరోనా అనుమానితులకు సీటీ స్కానింగ్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స కూడా అందిస్తున్నారు. కనీస ప్రొటోకాల్స్‌ కూడా పాటించడం లేదు. కరోనా బాధితుడి గదిలోనే అతని కుటుంబ సభ్యులు రాత్రిళ్లు ఉండేలా అనుమతినిస్తున్నారు. అంతేకాదు సాధారణ విధులు నిర్వహించే వైద్య సిబ్బందికీ కరోనా డ్యూటీలు వేస్తున్నారు.

ఇక ఆ డాక్టర్‌ పేరు శ్రీనివాస్‌ (పేరు మార్చాం). ఖమ్మంకు చెందిన ఆయనో సీనియర్‌ వైద్యుడు. అతనికి కరోనా చికిత్స చేసే అనుమతి లేదు. కానీ తన వద్దకు వచ్చే వారెవరికైనా అవసరం లేకున్నా కరోనా వచ్చిన వారికి ఇచ్చే మందులు వాడాలని చెబుతున్నాడు. కరోనా రానివారు 5 రోజులు, వచ్చినవారు 10 రోజులు ఈ మందులు వాడాలని చెబుతున్నాడు. పైగా వాటిని తనకు తెలిసిన వారికి మెసేజ్‌ల రూపంలో పెడుతున్నాడు.

ఈ తరహా ఘటనలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు ప్రతిరోజూ వస్తున్నాయి. వీటిపై ఇప్పటికే ఆయా జిల్లాల్లో విచారణ జరిపిస్తున్నారు. అనేక ప్రైవేట్‌ ఆసుపత్రులు, డాక్టర్లు కనీస ప్రొటోకాల్‌ పాటించడం లేదని బాధితులు సర్కారుకు విన్నవిస్తున్నారు. ఐసీఎంఆర్‌ ఇచ్చిన నిబంధనలను చాలా ఆసుపత్రులు, వైద్యులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలూ వస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులకు కరోనా చికిత్స చేసే అనుమతి కూడా లేదు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లూ లేవు.

జిల్లాల్లో సాధారణ ప్రైవేట్‌ ప్రాక్టీషనర్‌ మొదలు సీనియర్‌ వైద్యుల వరకు అనుమతి లేకున్నా, ప్రొటోకాల్‌ పాటించకుండా కరోనా వైద్యం చేస్తున్నారు. దీంతో అనేక ప్రైవేట్‌ ఆసుపత్రులు కరోనా హాట్‌స్పాట్లుగా మారుతున్నాయి. అక్కడకు వెళ్లే సాధారణ రోగుల్లో కొందరు కరోనా బాధితులుగా మారుతున్నారు. దీంతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ చర్యలు తీసుకోవడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. కరోనా రోగులకు సేవలు అందించే నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందిని సాధారణ రోగులకు సేవలు అందించడానికి వినియోగిస్తున్నారు. దీంతో ఆ సిబ్బందితో పాటు, ఇతర రోగులకు వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  

ప్రత్యేక కౌంటర్లు ఏవి? 
ఆసుపత్రులను ఎలా నిర్వహించాలన్న దానిపై ఐసీఎంఆర్‌ గతంలో మార్గదర్శకాలు జారీచేసింది. జ్వరం సహా కరోనా లక్షణాలున్న వారి కోసం ప్రత్యేక ద్వారాలు, కౌంటర్లు పెట్టి వారిని పరీక్షించాలని సూచించింది. అందుకోసం ప్రత్యేక సిబ్బంది ఉండాలని పేర్కొంది. ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలని చెప్పింది. కరోనా చికిత్స చేయాల్సి వస్తే పీపీఈ కిట్లు ధరించాలని సూచించింది. కరోనా పాజిటివ్‌ వ్యక్తులను ఐసోలేట్‌ చేయడం, కరోనా బయో వేస్ట్‌ను ఇతర వేస్టేజ్‌తో కలపకుండా డిస్పోజ్‌ చేయడం వంటి అనేక అంశాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే ప్రతి ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. కానీ చాలా ప్రైవేట్‌ ఆసుపత్రులు ఈ ప్రొటోకాల్స్‌ను పాటించడం లేదు.

అలాగే చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని బాధితులు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి, బోధనాసుపత్రి వరకు అన్నింటిలో ఫీవర్‌ ఓపీ కౌంటర్లు ప్రత్యేకంగా నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినా అమలుకావడం లేదు. కరోనా లక్షణాలున్నవారు, లేనివారు ఒకేచోట రిసెప్షన్‌లో ఉంచడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఇక కొందరు వైద్యులైతే కరోనాపై అప్‌డేట్‌ కాకుండా చాంతాడంత ప్రిస్క్రిప్షన్‌ రాస్తున్నారు. వాటిని వాడాలని బాధితులకు చెబుతున్నారు. అత్యవసర మందులను కూడా సాధారణ లక్షణాలు లేని కరోనా రోగులతో మింగిస్తున్నారు. దీంతో ఒక్కోసారి బాధితులు తీవ్రమైన రోగులుగా మారుతున్నారు. చివరకు పరిస్థితి సీరియస్‌గా ఉందంటూ వారిని ఆసుపత్రి నుంచి బయటకు పంపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement