ఆయకట్టు ఆగమాగం | Condition released by the rivers of water! | Sakshi
Sakshi News home page

ఆయకట్టు ఆగమాగం

Published Wed, Oct 14 2015 1:41 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

ఆయకట్టు ఆగమాగం - Sakshi

ఆయకట్టు ఆగమాగం

♦ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింది రైతుల పరిస్థితి దుర్భరం
♦ కనీసం వారం నీళ్లిచ్చినా లక్ష ఎకరాల పంట చేతికొచ్చే అవకాశం
♦ అడ్డంకిగా మారుతున్న ఆధునికీకరణ పనులు
♦ ఏఎమ్మార్పీ ద్వారా చెరువులకు నీటి విడుదల!
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఆయకట్టు ఎడమ కాల్వ కింది రైతాంగం దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పూర్తయిన ఖరీఫ్ సీజన్‌లో ఎడమకాల్వ ద్వారా ఒక్కరోజు కూడా నీరు రాని పరిస్థితుల్లో నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆయకట్టులో ప్రధాన పంట అయిన వరిసాగు ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ సాగులో కనీసం సగం మేర కూడా వరిసాగు కాలేదు. ఈసారి అంచనాకు మించి పత్తిసాగు చేపట్టినా తెగుళ్లు రావడంతో దిగుబడి పూర్తిస్థాయిలో తగ్గిపోనుంది. ఎకరాలకు నాలుగు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితులు లేక పెట్టుబడులు కూడా వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఎగువన వర్షాలు లేక, వరద రాక సాగర్ జలాశయం నీరు లేక వెలవెలబోతుండగా, రైతాంగం వేరే ప్రాంతాలకు వలస వెళుతోంది.   

 వారం రోజులు ఇచ్చినా చాలు..
 సాగర్ ఎడమకాల్వ పారుదల, ఎత్తిపోతల పథకాల ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అందులో ఒక్క నల్లగొండ జిల్లా నుంచే 3.7 లక్షల ఎకరాలు సాగు కావాలి. కానీ, వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 1.5 లక్షల ఎకరాల్లో కూడా వరిసాగు కాలేదు. పారుదల కింద పోను దాదాపు లక్ష ఎకరాల్లో రైతులు బోర్ల మీద ఆధారపడి వరిసాగు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో సాగర్ నీరు రాక, వర్షాలు లేక పొట్టకొచ్చిన పంట ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో భూగర్భజలాలు కూడా తగ్గిపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ దశలో కనీసం వారం రోజులైనా సాగర్ నుంచి నీరు ఎడమకాల్వకు విడుదల చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.  సాగర్ నీటిని విడుదల చేసేందుకు ఆధునీకరణ పనులు అడ్డంకిగా మారుతున్నాయి. మరోవైపు ఏఎమ్మార్పీ ద్వారా సాగర్ నుంచి నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగర్ నీటిని ఇవ్వడం వల్ల కేవలం ఆయకట్టేతర ప్రాంతాల చెరువులే నిండనున్నాయి. కానీ, ఆయకట్టులో ఇప్పటికే సాగు చేపట్టిన పంటలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతు సంఘాలంటున్నాయి.

 ప్రస్తుతం ఆయకట్టు ప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులు, కూలీలు నాన్ ఆయకట్టు ప్రాంతంలో పత్తి తీయడానికి వెళ్తున్నారు. జనవరి మాసం వరకే రైతు, రైతు కూలీలకు పని దొరికే అవకాశం నెలకొంది, లేకుంటే దుర్భిక్షం నెలకొనే అవకాశం ఉంది. గత సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఒక్క నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే 12 మంది పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక, ఆయకట్టులో వరి సాగు చేయనందునా పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ట్రక్కు గడ్డి దొరకడం కనాకష్టంగా మారిపోయింది. సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో కాలువ నీళ్లు రాక భూములు బీళ్లుగా మారాయి.

సాధారణ సాగుకు కనీసం 50 శాతం కూడా సాగు కాలేదు. నియోజకవర్గంలో పాలేరు వాగు, మూసీ, తుంగపాడు బంధం, చిత్రపరక వాగులతోపాటు బోర్లు, బావుల కింద వరి సాగు చేశారు.ఆయకట్టు పరిధిలో కూడా రైతు కూలీలు వలసలు వెళ్తున్నారు. గ్రామాలలో పూర్తి స్థాయిలో వ్యవసాయ పనులు దొరక్కపోవడం వల్ల ఇతర గ్రామాలకు పత్తి ఏరడానికి వెళ్తున్నారు. దాంతో పాటు బత్తాయి తోటలలో బత్తాయిలు తెంచడానికి ఉదయం వెళ్లి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. రైతులు పనుల్లేక ఖాళీగా ఉన్నారు.
 
 కరువు తీవ్రంగా ఉంది

 ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగర్ నీళ్లు రాకపోవడంతో కరువు ప్రభావం తీవ్రంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బియ్యం కొనుగోలు చేయాల్సి వస్తుంది. గేదెలకు గడ్డి కూడా కొనుగోలు చేయాల్సి వచ్చింది. సాగర్ నీళ్లు రాకపోవడంతో ఉన్న మూడు ఎకరాలు భూమి బీడుగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
 - కట్టెకోల లక్ష్మయ్య, రైతు, చిలుకూరు
 
 అప్పులు దొరకని పరిస్థితి  
 ఆయకట్టులో సాగు చేపట్టిన రైతులకు పెట్టుబడులకు అప్పులు దొరకని పరిస్థితి  ఏర్పడింది. ఖరీఫ్ పంటకు సాగర్ నీరు రాకపోవడం, బ్యాంకులు అప్పులు ఇవ్వక రైతుల పరిస్థితి దారుణంగా మారింది. చెరువులు, బావులు, బోర్ల ఆధారంగా సాగుచేసిన వరిపొలాలకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్‌గా  కూడా అప్పులు ఇచ్చే నాధుడు కనపడటం  లేదు. సాగుచేసిన పొలాలకు నీరందక ఎండిపోతుండడంతో దిక్కుతోచడం లేదు.
 - ఎం.వెంకటేశ్వర్లు, రైతు, అమరవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement