గోదావరి ప్రాజెక్టులపై ప్రభుత్వ దృష్టి!
- ప్రాజెక్టుల వారీగా అధికారుల చర్యలు
- కంతనపల్లి, దేవాదులపై సమీక్షలు పూర్తి
- ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, వరద కాల్వలో పునరావాసంపై సమీక్షించిన ముఖ్య కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా నిర్మాణంలో ఉన్న పనులను పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా శరవేగంగా కసరత్తులు చేస్తోంది. ప్రాజెక్టు వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, సేకరించాల్సిన భూమి, అటవీ సమస్యలు, సహాయ పునరావాసం తదితరాలపై రోజూవారీ సమీక్షలు నిర్వహిస్తూ వేగం పెంచే కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు స్థాయిలో దేవాదుల, కంతనపల్లిపై అటవీ శాఖతో సమీక్షలు జరగ్గా, సోమవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఎల్లంపల్లి, వరద కాల్వ, మిడ్‌మానేరు, కాళేశ్వరం, మంథని ఎత్తిపోతల పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే మిడ్‌మానేరు ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన 1,300 ఎకరాల భూసేకరణను పూర్తి చేయాలని, 11 గ్రామాల్లో సహాయ పునరావాసం పూర్తికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని 2,400 ఎకరాలు, వరద కాల్వ పరిధిలోని మరో 2 వేల ఎకరాలు, మంథని, ఎల్లంపల్లి పరిధిలోని మరో 3,500లకు పైగా ఎకరాల భూసేకరణను వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని జోషి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి, ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించడంతో పాటు ప్రాజెక్టుల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేకంగా కమిటీ నిర్వహించారు.
దేవాదుల పరిధిలో నెలకొన్న అటవీ, భూసేకరణ సమస్యలను అధిగమించేందుకు 3 రోజుల కిందట అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు వచ్చే ఖరీఫ్ నాటికి 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరందించే చర్యలకు ఆదేశాలిచ్చారు. ఇక కంతనపల్లిలో ముంపు తగ్గింపు కోసం అవసరమైతే బ్యారేజీలో నీటి నిల్వను తగ్గించేందుకు ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగింది. అయితే ఎత్తు ఏ మేరకు తగ్గించాలన్న దానిపై ఇప్పుడు అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
భూసేకరణకు కలెక్టర్ల నియామకం
భూసేకరణ కోసం డిప్యూటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రాణహిత-చేవెళ్ల సిద్ధిపేట డివిజన్‌కు కుసుమకుమారి, నిజామాబాద్ జిల్లాకు పద్మశ్రీ, ఎస్సారెస్పీ-2కు బీఎస్ లత, దేవాదులకు బి.విద్యాసాగర్, కంతనపల్లికి ఆర్.గోపాల్‌ను నియమించింది.