‘ప్రాణహిత-చేవెళ్ల’ రెండు ముక్కలు | Telangana govt to declare of Two pieces of pranahita-chevella | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత-చేవెళ్ల’ రెండు ముక్కలు

Published Fri, Jul 17 2015 1:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

అధికారక నివాసంలో గోదావరి జలాలపై సీఎం కేసీఆర్ సమీక్ష. చిత్రంలో హరీశ్ రావు తదితరులు - Sakshi

అధికారక నివాసంలో గోదావరి జలాలపై సీఎం కేసీఆర్ సమీక్ష. చిత్రంలో హరీశ్ రావు తదితరులు

* గోదావరి ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం
* తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి  ఆదిలాబాద్‌కు నీరివ్వాలి
* కాళేశ్వరం దిగువన మరో బ్యారేజీ చేపట్టి ఐదు జిల్లాలకు నీరందించాలి
* దీన్ని నిజాం సాగర్, శ్రీరాంసాగర్‌లతో అనుసంధానించాలి
* గోదావరి బేసిన్‌లోని 50 నియోజకవర్గాల్లో 50 లక్షల ఎకరాలకు నీళ్లు
* కేటాయించిన 400 టీఎంసీలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి
* సమైక్య రాష్ట్రంలో రూపొందించిన ప్రాజెక్టుల డిజైన్లు తెలంగాణ అవసరాలకు తగినట్టుగా లేవు
* తుమ్మిడిహెట్టి నుంచి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వరకూ ప్రతి ప్రాజెక్టు రీ డిజైన్ చేయాలి
* ప్రాణహితను విడదీస్తే వ్యయం రూ. 45 వేల కోట్లకు చేరే అవకాశం

 
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రెండు ముక్కలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని యథాతథంగా నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లివ్వాలని, కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద మరో బ్యారేజీ నిర్మించి మిగతా జిల్లాలకు నీరందించాలని నిర్ణయించింది. గోదావరి నదీ జలాల వినియోగానికి నిర్మించాల్సిన ప్రాజెక్టులు, అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు గురువారం తన అధికారిక నివాసంలో ఆరు గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి హరీశ్‌రావుతో పాటు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, వ్యాప్కోస్ జీఎం శంభూ ఆజాద్ పాల్గొన్నారు.
 
 సమీక్ష అనంతరం సీఎం తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల పేరు మీద కాలయాపన చేశారు. ప్రస్తుత డిజైన్ పనికొచ్చేది కాదు. దాన్ని రెండు భాగాలు చేయాలి. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీరివ్వాలి. కాళేశ్వరం దిగువన మరో బ్యారేజీ కట్టి నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌తో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని కరువు పీడిత జనగామ, భువనగిరి డివిజన్లకు నీరు ఇవ్వాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. కాళేశ్వరం దిగువన కట్టే బ్యారేజీని నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానించాలని కూడా సూచించారు. గోదావరిపై ఎక్కడెక్కడ లిఫ్టులు నిర్మించాలి, ఎక్కడ ఎన్ని టీఎంసీలు వాడాలి, ఏ ప్రాంతానికి ఏ మార్గం ద్వారా నీటిని తీసుకెళ్లాలి అన్న అంశాలపై గూగుల్ ఎర్త్, మ్యాపులు, నివేదికల ద్వారా సమీక్షించారు.
 
 50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా..
 గోదావరిలో ప్రాణహిత, దేవాదుల, కంతనపల్లి, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కేటాయించిన 400 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేలా, నిర్ణీత వాటాను సమర్థంగా వాడుకునేలా ప్రాజెక్టులకు రూపకల్పన జరగాలని సీఎం సూచించారు. గోదావరి బేసిన్‌లోని 50 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలకు సగటున లక్ష చొప్పున 50 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని పేర్కొన్నారు.
 
 ఎస్సారెస్పీ, నిజాంసాగర్, కడెం ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతోందని, మిగతా 40 లక్షల ఎకరాలకు నీటిని అందించేలా కార్యాచరణ ఉండాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. సమైక్య రాష్ట్రంలో రూపొందించిన ప్రాజెక్టుల డిజైన్ లు తెలంగాణ అవసరాలు తీర్చే విధంగా లేవన్నారు. అందుకే ప్రాణహిత ప్రవేశించే తుమ్మిడిహెట్టి నుంచి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వరకూ ప్రతి ప్రాజెక్టునూ రీడిజైన్ చేయాలని, ఆ బాధ్యతను విశేష అనుభవమున్న వ్యాప్కోస్ సంస్థకు అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
 
 దేవాదులకు ఉపయోగపడేలా..

 దేవాదుల ప్రాజెక్టు ద్వారా 170 రోజులు నీటిని లిఫ్టు చేయాల్సి ఉన్నా.. 90 రోజులు కూడా లిఫ్టు చేయలేకపోతున్నారని సీఎం పేర్కొన్నారు. ఈ దృష్ట్యా కంతనపల్లి ప్రాజెక్టును దేవాదులకు ఉపయోగపడేలా డిజైన్ చేయాలని, ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రాంతం వద్ద కాకుండా కొంత ముందుకు కడితే దేవాదులకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసే క్రమంలో ఎక్కువగా రిజర్వాయర్లు ఉండాలని, గ్రావిటీ, లిఫ్ట్ పద్ధతిలో నీటి పారకం ఉండాలని చెప్పారు. అవసరమైన చోట ఎస్సారెస్పీ క్యారీయింగ్ సామర్థ్యం పెంచాలని, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలని ఆదేశించారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, పొలాలకు నీరందించడమే లక్ష్యంగా డిజైన్లు రూపొందించాలని సూచించారు.
 
 రెండంటే భారం తడిసి మోపెడు!

 ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రెండు భాగాలు చేసి నిర్మాణానికి పూనుకుంటే ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం వద్ద బ్యారేజీల నిర్మాణం చేపడితే ఈ రెండింటికే రూ.3,700 కోట్ల మేర ఖర్చు కానుండగా, కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టే కాల్వలు, లిఫ్ట్‌ల భారం మరింత ఉంటుందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు విద్యుత్ అవసరాలు సైతం మరో 400 మెగావాట్ల మేర పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. 160 టీఎంసీల గోదావరి నీటితో 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.38,500 కోట్లతో చేపట్టిన ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టులో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం చేయడంతో... ఇప్పుడు అందరి దృష్టి వ్యయ భారంపైనే పడింది. తొలి డిజైన్‌లో భాగంగా నిర్మిస్తున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్లకే పరిమితం చేసి, నిల్వ సామర్థ్యాన్ని తగ్గించినా వ్యయంలో పెద్దగా మార్పుండదని నిపుణులు చెబుతున్నారు. తొలి అంచనా మేరకు తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి 1,900 కోట్లు అంచనా వేయగా, ఇప్పుడూ అంతే స్థాయిలో ఖర్చయ్యే అవకాశముందని చెబుతున్నారు.
 
తుమ్మిడిహెట్టి నుంచి ముందుగా నిర్ణయించిన 56 వేల ఎకరాలకే కాకుండా లక్ష ఎకరాలకు మించి నీరివ్వాలన్నది ధ్యేయమని ప్రభుత్వం అంటోంది. అంటే ఇక్కడా అదనపు కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. దానికి భారీగానే వ్యయమయ్యే అవకాశముంది. ఇక కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి 120 రోజుల పాటు నీటిని మళ్లించేందుకు అయ్యే అదనపు విద్యుత్ అవసరాలకు తోడు 90 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్లంపల్లి వరకు కాల్వల నిర్మాణం వ్యయంతో కూడుకున్నదేనని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఓపెన్ కాస్ట్ మైన్, గిరిజన, అటవీ ప్రాంతాలు కాళేశ్వరం, ఎల్లంపల్లి మధ్యలో ఉన్నట్లయితే అలైన్‌మెంట్‌ను మార్చాల్సి ఉంటుంది. అదే జరిగితే కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి దూరం మరో 30 కి.మీ. వరకు పెరిగే అవకాశం ఉంటుందన్నది వారి వాదన. మొత్తంగా ప్రాజెక్టు వ్యయం ఇప్పటి అంచనా దాటి రూ.45 వేల కోట్లకు చేరవచ్చని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement