- 6 లక్షల ఎకరాల సాగుకు నీరు
- 18 మెగావాట్ల విద్యుదుత్పత్తి
ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల
Published Thu, Aug 11 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాల్వల ద్వారా ఆయకట్టుకు గురువారం నీటి విడుదలను ప్రారంభించారు. ఇది వరకే చెరువులు నింపేందుకు ప్రాజెక్ట్ అన్ని కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కానీ గురువారం నుంచి ఉప కాల్వల ద్వారా కూడా నీటి విడుదల ప్రారంభించారు. వారబంధీ ప్రకారం ప్రాజెక్ట్ నుంచి 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని ఎస్‌ఈ సత్యనారాయణ తెలిపారు. 8 రోజులు కాల్వల ద్వారా నీటి విడుదల చేస్తూ వారం రోజులు నిలిపివేత ఉంటుందన్నారు.
ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకతీయ కాలువ ద్వారా 6,125 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 6,076 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 5,215 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు.
కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో స్థానిక జల విద్యుతుత్పత్తి కేంద్రంలో మూడు టర్బయిన్ల ద్వారా 18 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్‌కో అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు (90 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1076.60 అడుగుల(43.70 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని చెప్పారు.
Advertisement
Advertisement