సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదల కారణంగా నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా.. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కింద ఈ ఏడాది డిసెంబర్ 20 నుంచే యాసంగి ఆయకట్టుకు సాగు నీరివ్వాలని నీటి పారుదల శాఖ యోచిస్తోంది. పూర్తి స్థాయి నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని నిర్ణీత ఆయకట్టుకు ఆరు నుంచి ఏడు తడుల ద్వారా నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నాగార్జునసాగర్ కింద కనిష్టంగా 6 లక్షల ఎకరాలకు, శ్రీరాం సాగర్ కింద లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండీ) వరకు అలీసాగర్, గుత్ఫా ఎత్తిపోతలను కలుపుకొని 5 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బుధవారం జరిగే రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాం డింగ్ కమిటీ (శివమ్) భేటీలో నిర్ణయం తీసుకోనుంది.
50 టీఎంసీలతో..
నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 312 టీఎంసీలకు గానూ 305.56 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ప్రస్తుతం 19 వేల క్యూసెక్కుల మేర వరద కొనసాగుతోంది. ఇం దులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన 175 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. దీనికి తోడు ఎగువ శ్రీశైలంలోనూ కనీస నీటిమట్టం 834 అడుగులకు ఎగువన 138 టీఎంసీల లభ్యత ఉంది. మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 313 టీఎంసీల లభ్యత ఉండగా ఇందులో కనిష్టంగా తెలంగాణకు 140 టీఎంసీల మేర దక్కే అవకాశముంది.
ఇందులో కల్వకుర్తి కింది అవసరాలకు 35 టీఎంసీలు పక్కనపెట్టినా మిగతా నీరు సాగర్ కింద తాగు, సాగు అవసరాలకు లభ్యతగా ఉంటుంది. ఇందులో 50 టీఎంసీల నీటిని వినియోగించినా సాగర్ కింద ఉన్న 6.40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశముంది. గతేడాది రబీలో 27.39 టీఎంసీల నీటితో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 4.15 లక్షల ఎకరాలకు నీరందించారు. నీటి విడుదలను డిసెంబర్ 26 నుంచి ఏప్రిల్‌వరకు కొనసాగించారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 20 నుంచే సాగర్ ఎడమ కాల్వ కింద నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 29 వరకు ఆరు లేక ఏడు తడుల్లో నీరిచ్చేలా ప్రణాళిక వేశారు.
ఎస్సారెస్పీ కింద పుష్కలంగా నీరు..
ఇక ఎస్సారెస్పీలో 90.31 టీఎంసీలకు గానూ 89.76 టీఎంసీల లభ్యత ఉంది. ఎస్సారెస్పీ కింద ఉన్న 9.68 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీలో నిల్వ ఉన్న నీటితో పాటు ఎల్‌ఎండీ కింద కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో ఎల్‌ఎండీ వరకు ఉన్న ఎస్సారెస్పీ ఆయకట్టు 4 లక్షల ఎకరాలు, అలీసాగర్, గుత్ఫాల కింది మరో లక్ష ఎకరాలకు ఎస్సారెస్పీలోని 50 టీఎంసీలతో సాగుకు నీరందించడనుండగా, ఎల్‌ఎండీ కింద ఉన్న ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న నీటిని వినియోగించే అవకాశముంది.
ఎస్సారెస్పీ–2 కింద ఉన్న 3.40 లక్షల ఎకరాలకు సైతం కాళేశ్వరం ద్వారానే నీరివ్వనున్నారు. ఎస్సారెస్పీ కింద యాసంగిలో 17.10 టీఎంసీల నీటిని గతేడాది ఫిబ్రవరి నుంచి 9 తడుల ద్వారా నీరివ్వగా, ఈ ఏడాది వచ్చే నెల 20 నుంచే నీటిని విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంజనీర్లకు ఆదేశాలిచ్చారు. ప్రాజెక్టు ఇంజనీర్లు నిర్ణయించిన విధానాన్ని బుధవారం జరిగే శివమ్ కమిటీ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment