సాగుకు నీళ్లివ్వాల్సిందే | KCR Review Meet Over SRSP At Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 8 2019 1:49 AM | Last Updated on Fri, Feb 8 2019 10:43 AM

KCR Review Meet Over SRSP At Pragathi Bhavan - Sakshi

గురువారం ప్రగతి భవన్‌లో ఎస్సారెస్పీపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో ఈటల

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే వర్షాకాలంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా అన్ని పనులను వేసవికాలంలోగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. జూన్‌ నాటికి.. కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్‌ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఈ వర్షాకాలంలో నీటిని ఎత్తిపోయడం ప్రారంభమవు తుందని.. ఆ నీటిని మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు డ్యాములకు తరలిస్తామని చెప్పారు. ఈ రెండు డ్యాములకు 50టీఎంసీల సామర్థ్యం ఉంది. ఆ నీటితో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా అన్ని చెరువులు నింపాలని సీఎం ఆదేశించారు. ‘ప్రాజెక్టుల ద్వారా నీళ్లొస్తున్నాయి. పనులు చేయడానికి నిధులిస్తున్నాం. అయినా పంట పొలాలకు నీరందించకుంటే పాపం చేసిన వారమవుతాం’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్, అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డీఎస్‌ రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గ్యాదరి కిశోర్, వి సతీష్‌కుమార్, దాసరి మనోహర్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బాల్క సుమన్, సుంకె రవిశంకర్, సంజయ్‌ కుమార్, కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, నీటి పారుదల ఈఎన్‌సీలు మురళీధర్, అనిల్‌కుమార్, నాగేందర్, సీఈలు శంకర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

నిధుల విడుదలకు ఆదేశం
ఎస్సారెస్పీ పరిధిలోని మొత్తం ఆయకట్టుకు నీరందించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కూలంకశంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఏయే సమస్యలున్నాయో గుర్తించి అప్పటికప్పుడే వాటిని పరిష్కరించారు. భూసేకరణకు, ఇతర పనులకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ‘గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. ఈ నీటిని ఎత్తిపోయడానికి భారీ వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. ఈ ఏడాది వర్షాకాలం నుంచే మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోసి మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు డ్యాములకు తరలిస్తాం. అలా తరలించిన నీటిని ఎస్సారెస్పీ కాల్వల ద్వారా అన్ని చెరువులను మళ్లించాలి. చెరువులను నింపడమే మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. దీనికోసం ఎస్సారెస్పీ కాల్వలన్నింటినీ మరమ్మత్తు చేయాలి. కావాల్సిన చోట వెంటనే తూములను నిర్మించాలి. భూసేకరణ పూర్తి చేయాలి. రెండో దశలో నిర్మించిన కాల్వలకు లైనింగ్‌ పూర్తి చేయాలి. అవసరమైతే కాల్వల నీటి ప్రవాహ ఉధృతి సామర్థ్యాన్ని (క్యారీయింగ్‌ కెపాసిటీ) పెంచుకోవాలి. పనులను నిర్ణయించేందుకు వెంటనే 50 మంది ఇంజనీర్లను నియమించండి. యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి అంచనాలు రూపొందించండి. కావాల్సిన నిధులు వెంట వెంటనే మంజూరు చేస్తాం. అన్ని పనులు పూర్తి చేసి ఈ వర్షాకాలానికి ఎట్టి పరిస్థితుల్లో ఎస్సారెప్పీ పరిధిలోని 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రాంతం నుంచి మొదలుకుని చివరి ఆయకట్టు కలిగిన డోర్నకల్, తుంగతుర్తి, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల వరకు అన్ని దిక్కులకు నీరందాలని అధికారులను ఆదేశించారు.

ఎస్సారెస్పీపై సమీక్షలో సీఎం చెప్పిన మరికొన్ని కీలకాంశాలు:

  • కాకతీయ కాలువ, వరద కాలువ మధ్య ఉన్న 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలి. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేయాలి. వెంటనే ఈ పనుల కోసం సర్వే నిర్వహించి పనులు ప్రారంభించాలి.
  • ఎస్సారెస్పీ రెండో దశలో అన్ని డిస్ట్రిబ్యూటరీలకు లైనింగ్‌ చేయాలి. దీనికోసం వెంటనే అంచనాలు రూపొందించి టెండర్లు పిలవాలి. ఎండాకాలంలోపు పనులు పూర్తి కావాలి.
  • ఎస్సారెస్పీ కాల్వల పనులు అన్ని చోట్ల పనులు సమాంతరంగా జరగాలి.
  • అన్ని ప్రాజెక్టుల కాల్వలకు సంబంధించిన హద్దులను నిర్ణయించాలి. ప్రాజెక్టుల భూముల సమగ్ర వివరాలను (ఇన్వెంటరీ) రూపొందించాలి.
  • ఎస్సారెస్పీ పంట కాల్వలను ఎవరైనా దున్నుకుంటే వాటిని పునరుద్ధరించాలి. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపి రైతులను ఒప్పించాలి.
  • అన్ని ప్రాజెక్టుల సమగ్ర స్వరూపం (ప్రొఫైల్‌) తయారు చేయాలి. ప్రతి ప్రాజెక్టుకు ఆపరేషన్‌ రూల్స్‌ తయారు చేయాలి.
  • ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం అంచనా వేయాలి. ఆ నిధులను వచ్చే బడ్జెట్‌లో కేటాయిస్తాం.
  • చనాఖా–కొరాటా పనులు మే 15 నాటికి పూర్తి కావాలి. కడెం గేటు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలి.
  • దేవాదుల నీటిని తరలించే రామప్ప, లక్నవరం, ఘన్‌పూర్, పాకాల కాల్వల పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఎండాకాలంలోనే పూర్తి చేయాలి.
  • దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన పాలకుర్తి, ఉప్పుగల్లు, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement