సమావేశంలో వాదనకు దిగిన మంత్రి, ఎమ్మెల్యే
సాక్షి, మహబూబాబాద్: మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మధ్య అంతర్గత విభేదాలు బుధవారం మరోసారి బహిర్గతమయ్యాయి. ఎస్సారెస్పీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అధికారుల ఎదుటే మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
నన్ను పిలవకుండానే సమావేశమా?
మధ్యాహ్నం 12.30కి సమీక్ష ప్రారంభం కాగా, కొద్దిసేపటికే ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అక్కడకొచ్చి తనకు సమాచారం ఇవ్వకుండా సమీక్ష నిర్వహిం చడం దారుణమని, స్థానిక సమస్యలు తెలియకుండా సమీక్షా సమావేశాలు పెట్టి చాయ్, బిస్కె ట్లు తిని ఫొటోలకు ఫోజులిస్తే ప్రయోజనం ఉండ దని మంత్రిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించా రు. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్ ‘మనం ముందుగానే అనుకున్నాం కదా? సమీక్ష గురించి తెలుసు కదా’అని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే.. తాను రాకుండానే ఎందుకు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రోడ్డురోలర్ మీద, ఎర్ర బస్సు ఎక్కి రాలేదని.. ఆర్‌ఈసీలో చదివి రాజకీయాల్లోకి వచ్చానంటూ శంకర్ నాయక్ మంత్రి విద్యాభ్యాసంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. దీంతో మంత్రి అసహనంతో ‘ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. మీ సమస్యలు ఏంటో చెప్పండి చర్చిద్దాం’అని బదులిచ్చారు. అప్పుడే కలెక్టర్ వీపీ గౌతమ్ జోక్యం చేసుకొని ‘సమన్వయ లోపం జరిగింది.. సారీ సర్’అని ఎమ్మెల్యేకు సర్ది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment