సాక్షి, హైదరాబాద్: ప్రతి వ్యక్తీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని వివరించారు. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ విండో ఎన్నికల్లో నిరుత్సాహపడినా ఆ తర్వాత పట్టుదలతో కష్టపడ్డారన్నారు. తెలంగాణ లక్ష్యసాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పారు.
గురువారం ఓ హోటల్‌లో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ సక్సెస్ మీట్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలలు కనాలని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలతో గిరిజన యువత అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పేర్కొన్నారు.
ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. ఆంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగిన గిరిజన యువత భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో జరిగిన ఆసక్తికరమైన ఘటనను తెలియజేశారు. గతంలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు షాపూర్జీ–పల్లోంజీ గ్రూప్‌కు చెందిన దివంగత బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ వచ్చారని చెప్పారు. అప్పుడు తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేసినట్లు కేసీఆర్ గుర్తుచేసుకోగా మిస్త్రీ ఆశ్చర్యపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. సైరస్ మిస్త్రీ ఇంటికి వెళ్లిన తర్వాత రికార్డులు తిరగేసి ఫోన్ చేశారని, 1950–60 మధ్య కాలంలో పనిచేసినట్లు వివరించారన్నారు.
ఎన్నికల్లో గెలిచేది మళ్లీ మేమే..
త్వరలో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఉత్పత్తుల పార్కు పెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు రైస్‌మిల్లు పెట్టుకున్నారని చెప్పారు. అదేవిధంగా వాటర్ వర్క్స్ విభాగానికి దళితబంధు పథకం కింద 150 వాహనాలు పంపిణీ చేశామన్నారు. వచ్చే నెల 3న మరోసారి బీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని, అప్పుడు మళ్లీ సక్సెస్ మీట్ జరుపుకుందామని చెప్పారు.
సీఎం వల్లే ఎస్టీల ఎదుగుదల: సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని, సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గతంలో అనేక పార్టీలు, ప్రభుత్వాలను చూశామని, కానీ గిరిజనులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవ కాశా లు కల్పించే స్థాయికి ఎదిగారని, గిరిజనులపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉందన్నారు. బీఆర్‌ఎస్ పాలన లోనే గిరిజన రిజర్వేషన్ పెంచుకోవడంతోపాటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎస్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించామని, గిరిపుత్రులకు పోడు పట్టాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మనం నష్టపోతామని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment