Tribal youth
-
గిరిజనుల తరఫున పోరాటం: రాహుల్
ధన్‌బాద్: గిరిజన ప్రజలకు నీరు, అడవి, భూమి(జల్–జంగిల్–జమీన్)పై హక్కుల ను, గిరిజన యువతకు ఉపాధిని కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం ఆయన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జరిగిన రోడ్ షోలో ప్రసంగించారు. రాష్ట్రంలో జోడో యాత్ర మూడో రోజుకు చేరుకుంది. జిల్లాలోని తుండిలో శనివారం రాత్రి బస చేసిన రాహుల్ ఆదివారం గోవింద్పూర్ నుంచి తిరిగి యాత్రను మొదలుపెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం కాకుండా కాపాడటం, యువతకు గిరిజనులకు న్యాయం దక్కేలా చేయడమే యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్థిక అసమానతలు, నోట్లరద్దు, జీఎస్టీ, నిరుద్యోగం వంటి సమస్యలు దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం యాత్ర తిరిగి కొనసాగి బొకారో జిల్లాలోకి ప్రవేశించింది. బొకారో వైపు సాగుతూ గోధార్ కాళి బస్తీ వద్ద ఆయన బొగ్గు గని కార్మికులు, వారి పిల్లలతో ముచ్చటించారు. మధ్యాహ్నానికి యాత్ర బొకారో చేరుకుంది. భోజనానంతరం జెనామోర్ నుంచి మొదలైన యాత్ర రామ్‌గఢ్ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని గోలా వద్ద జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. -
లక్ష్యంతో సాగితే విజయం తథ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రతి వ్యక్తీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని వివరించారు. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ విండో ఎన్నికల్లో నిరుత్సాహపడినా ఆ తర్వాత పట్టుదలతో కష్టపడ్డారన్నారు. తెలంగాణ లక్ష్యసాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పారు. గురువారం ఓ హోటల్లో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలలు కనాలని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలతో గిరిజన యువత అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. ఆంట్రప్రెన్యూర్స్‌గా ఎదిగిన గిరిజన యువత భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో జరిగిన ఆసక్తికరమైన ఘటనను తెలియజేశారు. గతంలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు షాపూర్జీ–పల్లోంజీ గ్రూప్‌కు చెందిన దివంగత బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ వచ్చారని చెప్పారు. అప్పుడు తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేసినట్లు కేసీఆర్ గుర్తుచేసుకోగా మిస్త్రీ ఆశ్చర్యపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. సైరస్ మిస్త్రీ ఇంటికి వెళ్లిన తర్వాత రికార్డులు తిరగేసి ఫోన్ చేశారని, 1950–60 మధ్య కాలంలో పనిచేసినట్లు వివరించారన్నారు. ఎన్నికల్లో గెలిచేది మళ్లీ మేమే.. త్వరలో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఉత్పత్తుల పార్కు పెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు రైస్‌మిల్లు పెట్టుకున్నారని చెప్పారు. అదేవిధంగా వాటర్ వర్క్స్ విభాగానికి దళితబంధు పథకం కింద 150 వాహనాలు పంపిణీ చేశామన్నారు. వచ్చే నెల 3న మరోసారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని, అప్పుడు మళ్లీ సక్సెస్ మీట్ జరుపుకుందామని చెప్పారు. సీఎం వల్లే ఎస్టీల ఎదుగుదల: సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని, సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గతంలో అనేక పార్టీలు, ప్రభుత్వాలను చూశామని, కానీ గిరిజనులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవ కాశా లు కల్పించే స్థాయికి ఎదిగారని, గిరిజనులపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉందన్నారు. బీఆర్ఎస్ పాలన లోనే గిరిజన రిజర్వేషన్ పెంచుకోవడంతోపాటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎస్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించామని, గిరిపుత్రులకు పోడు పట్టాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మనం నష్టపోతామని వ్యాఖ్యానించారు. -
పనసతో విలువ ఆధారిత పదార్థాల తయారీ
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభించే పనస ద్వారా గిరిజనులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పనసతో వివిధ విలువ ఆధారిత పదార్థాల తయారీలో గిరిజన యువత శిక్షణ ఇస్తోంది. రెండేళ్ల కాలంలో వంద మంది ఆసక్తి కలిగిన గిరిజన యువత ఇందులో శిక్షణ తీసుకుంది. పనసలో విటమిన్–సి, కాల్షియం, ఐరన్, పోటాషియం, మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో పచ్చికాయలు, పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం వృతి నైపుణ్య శిక్షణ ఉచితంగా ఇస్తోంది. ఆగస్టు మొదటి వారంలో కొత్త బ్యాచ్‌కు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. 1164 హెక్టార్లలో పనస విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పనస ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ ప్రాంతాల్లో సుమారుగా 1,164 హెకార్లలో పనస చెట్లు ఉన్నాయి. రంపచోడవరం ఏజెన్సీలో మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో సుమారు 120 హెక్టార్ల విస్తీర్ణంలో పనస సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి 4,332 టన్నుల పనస దిగుబడి వస్తుంది. పనస కాయ తొనలు, పనస పొట్టుతో కూరను ఎక్కువగా తయారు చేస్తారు. అయితే కేవీకే శాస్త్రవేత్తలు పనస కాయలు, పండ్లతో చిప్స్, తాండ్ర, హల్వా, జామ్, ఐస్‌క్రీమ్, పనస తొనల పొడి, పనస పిక్కల పొడి, బజ్జీలు, పకోడి వంటి వాటి తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన గిరిజనులు స్వయం ఉపాధి పొందుతున్నారు. పనసలో పైబర్ ఎక్కువగా ఉండడంతో కేవీకే శాస్త్రవేత్తలు పిక్కలు, తొనలతో మన్యం జాక్‌ప్రూట్ పిండిని తయారు చేశారు. శరీరానికి పైబర్ అవసరమైన వారు ఈ పిండిని ప్రతి రోజూ చపాతీ, అన్నం, దోసెల పిండిలో 20 గ్రాముల వరకు కలుపుకుని తీసుకోవడం ద్వారా.. శరీరానికి పైబర్ పుష్కలంగా అందించవచ్చు. (క్లిక్: విద్యుత్ ఉత్పత్తిలో మేటిగా నిలిచి.. మహారత్న బిరుదు) శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు ఏజెన్సీలో ఎటువంటి పెట్టుబడి లేకుండా రైతులుకు పనస లభిస్తోంది. ఇక్కడ పండే పనస ద్వారా రైతులు పూర్తిగా ఆదాయాన్ని పొందలేకపోతున్నారు. పనసకు విలువ ఆధారితం జోడించడం ద్వారా మార్కెట్ విలువ పెరుగుతుంది. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న వారికి ఏటా పనసతో తయారు చేసే పదార్థాలపై శిక్షణ ఇస్తున్నాం. – ఆదర్శ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, పందిరిమామిడి -
కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ.25 లక్షల జరిమానా
భువనేశ్వర్: సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా కులాంతర వివాహాలను మాత్రం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని నియలిజరాన్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు మహేశ్వర్ బాస్కే అదే గ్రామంలో ఇతర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి వివాహాన్ని ఆ గ్రామ పెద్దలు, గ్రామస్థులంతా వ్యతిరేకించడమే కాక చంపుతామని బెదిరించారు. దీంతో ఆ జంట గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. అయితే ఇటీవల లాక్డౌన్ కారణంగా పట్టణాల్లో పనులు లేక తిరిగి అదే గ్రామానికి రావడంతో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. కులాంతర వివాహం చేసుకొని తప్పు చేసినందుకు గానూ, రూ.25 లక్షల భారీ జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చారు. అంతేకాక ఆ జరిమానా చెల్లించే వరకు వారికి ఎవరూ సహాయం చేయకూడదని, కనీసం నీళ్లు కూడా ఇవ్వకూడదని గ్రామస్తులకు షరతు విధించారు. దీంతో అంత పెద్ద మొత్తంలో జరిమానా కట్టలేక ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. మహేశ్వర్ మాట్లాడుతూ: ప్రస్తుతం మహేశ్వర్ తన భార్య, తల్లితో కలిసి ఊరు బయట ఉన్న తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తోందనీ, అంత పెద్ద మొత్తం జరిమానా తాము గ్రామ పెద్దలకి చెల్లించలేమని, తమని గ్రామంలోకి అనుమతించడానికి సాయం చేయాలని కోరుతున్నారు. ఇక ఇదే విషయంపై ఆనంద్ పూర్ కోర్టు దర్యాప్తుకి ఆదేశించింది. తాము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక ఘాసీపుర స్టేషన్ ఇన్స్పెక్టర్ మనోరంజన్ వెల్లడించారు. -
ఏనుగు మీదకు కుక్కలను వదిలి.. రాళ్లు, చెట్ల కొమ్మలతో కొడుతూ..
-
వైరల్: రాక్షసుల కన్నా దారుణంగా ప్రవర్తించారు
చెన్నై: మూగ జంతువులు పట్ల ఏ మాత్రం జాలి దయ లేకుండా ప్రవర్తించేవారు ఈ రోజుల్లో బాగా పెరిగిపోయారు. తమ బాధను వెల్లడించలేని మూగ జీవుల పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తిస్తూ.. వాటిని హింసిస్తూ.. రక్షసానందం పొందుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని తిరుమూర్తి ఆనకట్ట దగ్గర గిరిజన యువకులు కొందరు అడవి ఏనుగును దారుణంగా హింసిస్తూ రక్షసానందం పొందారు. ఏనుగు మీదకు కుక్కలను వదిలి.. రాళ్లు, చెట్ల కొమ్మలతో కొడుతూ.. రక్షసానందం పొందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన జంతు ప్రేమికుల వార మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మనుషులా.. మీకు కాస్త కూడా జాలీ, దయ లేదా.. ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియోల ఆధారంగా తిరుపూర్ జిల్లా అటవీ అధికారులు ముగ్గురు గిరిజన యువకులపై కేసు నమోదు చేశారు. అడవి ఏనుగును ఆటపట్టించినందుకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదైంది. ముగ్గురు యువకులను త్వరలో రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో -
వైద్య సేవల రంగంలో గిరిజన యువత
సాక్షి, అమరావతి: గిరిజన యువతకు ఉపాధి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ఎస్డీసీ) ద్వారా చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. గిరిజన యువత కోసం ఏపీ ఎస్‌ఎస్‌ఐడీసీ వివిధ ఉపాధి కోర్సులను అందుబాటులోకి తీసుకొచి్చంది. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో శిక్షణ ఇస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఒక శిక్షణా ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌లో ఇప్పటివరకు 361 మంది గిరిజన యువత హాస్పిటల్ సర్వీసెస్ కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 244 మందికి ఇప్పటికే ఉపాధి లభించినట్టు ఏపీ ఎస్ఎస్డీసీ ఈడీ హనుమాన్ నాయక్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రాథమికంగా రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు జీతం లభిస్తోందని తెలిపారు. విశాఖ, బేతంచర్లలో కూడా ఇటువంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో కలిసి నర్సింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా గిరిజన యువతులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విధంగా 2020లో 3,300 మందికి శిక్షణ ఇవ్వగా.. ఈ ఏడాది కనీసం 5,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. -
అటవీ అధికారులపై అడవి బిడ్డల ఆగ్రహం
కొయ్యూరు(పాడేరు): అటవీ అధికారుల తీరుపై గిరిజనుల్లో ఆగ్రహం కట్టలు తె చ్చుకుంది. తమ ప్రాణాలు కాపాడేందుకు వేస్తున్న రోడ్డు పనులు ఆపుతారా అంటూ అధికారులపై తిరుగుబాటు చేశారు. రెవెన్యూ భూమిలో రోడ్డు పనులు చేస్తున్న జేసీబీతో పాటు ఇతర వాహనాలను అడ్డుకుని, వాటి తాళాల ను అటవీ అధికారులు శుక్రవా రం బలవంతంగా తీసుకోవడంతో ఆగ్రహించిన గిరిజనులు వారిపై తిరగబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యూరు మం డలంలో దొడ్డవరం నుంచి బూదరాళ్ల పంచాయతీ ముకుడుపల్లికి వెళ్లే రహదారి పనులను నాలుగు నెలల కిందట చేపట్టారు. సాకులపాలెం, చౌడుపల్లి, భలబద్రం, లూసం, ముకుడుపల్లి, నూకరాయికోట గ్రామస్తులు ఉపయోగపడే 17 కిలోమీటర్ల పొడవైన రోడ్డు పనులు జరుగుతున్నాయి. పీఎంజీఎస్వైలో నాలుగు సంవత్సరాల కిందట పీఎంజీఎస్వైలో రూ.8.25 కోట్ల నిధులు మంజూరైనా, పనులు జరగలేదు. తీరా ఇప్పుడు పనులు జరుగుతుండగా రిజర్వ్‌ఫారెస్ట్‌లో పనులు జరుగుతున్నాయని భావించిన కొయ్యూరు సెక్షన్ అధికారి చిరంజీవి, ఎఫ్‌బీవోలు గంగరాజు,సన్యాసిరావు శుక్రవారం లూసం వెళ్లి పనులు చేస్తున్న జేసీబీ తాళాలు తీసుకున్నారు. పనులు ఆపి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఇతర సిబ్బందిని బెదిరించారు. సమాచారం తెలుసుకున్నచౌడుపల్లి,సాకులపాలెం గ్రామస్తులు దొడ్డవరం సమీపంలోకి వచ్చారు. రెవెన్యూ భూమిలో పనులు చేస్తున్న వాహనాల తాళాల ను ఎలా తీసుకుంటారని అటవీ సిబ్బందిని ప్రశ్నించారు. మావోయిస్టులను ఎదిరించాం, వారు వాహనాలను ఏమైనా చేస్తారని పనులు చేస్తున్న సమయంలో రోజూ 50 మంది రాత్రి వేళల్లో ఇక్కడే పడుకుంటున్నాం. రోడ్డు వస్తే వైద్య సౌకర్యం అందుబాటులోకి వచ్చి మా ప్రాణాలు నిలుస్తాయి, ఇప్పుడు అటవీ అధికా రులు రిజర్వ్ పారెస్టు పేరుతో పనులను ఆపాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తమతో పాటు గ్రామంలోకి బలవంతంగా తీసుకుపోతామని స్పష్టం చేశారు. సుమారు గంటన్నర పాటు వాగ్వాదం, తోపులాట జరిగాయి. రోడ్డు జోలికి రాబోమని, ఆగిపోతే మాదే బాధ్యత అని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపిస్తామని బూదరాళ్ల ఎంపీటీసీ సభ్యులు రామారావు, కృష్ణతో పాటు రెండు గ్రామాలకు చెందిన యువకులు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఎఫ్ఎస్వో చిరంజీవి రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో వారిని వదిలిపెట్టారు.దీనిపై ప్రాజక్ట్ ఏఈ ఈశ్వరరావు మాట్లాడుతూ చాలా వరకు సమస్య పరిష్కారం అయిందన్నారు.అనుమతులు వచ్చేస్తాయని చెప్పారు. రోడ్డు పనులు అడ్డుకోవడం తప్పే రెవెన్యూ భూమిలో రోడ్డుపనులు చేస్తున్నప్పుడు మా సిబ్బంది వెళ్లి అడ్డుకోవడం తప్పు. పనులు రిజర్వ్‌ఫారెస్ట్‌లో జరుగుతున్నాయా లేకుంటే రెవెన్యూలో జరుగుతున్నాయో చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉంది. త్వరలో ఆ రోడ్డుకు అనుమతులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు- షఫీ,కృష్ణాదేవిపేట రేంజర్ -
బ్యాంకు ఖాతాల్లోకి గంజాయి సొమ్ము
ఎలాంటి ఆదాయ వనరులు, సంపాదన లేని గిరిజన యువకులు రూ.లక్షలు ఖర్చు చేసి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. ఆదాయ వనరులు లేకపోయినా అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తోందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తే గంజాయి స్మగ్లర్లు వారి ఖాతాల్లో సొమ్ము జమచేస్తున్నారన్న విషయం బయటపడింది. దీంతో పోలీసులు మన్యంలో ఎనిమిది మండలాల్లో కొన్ని ఖాతాల లావాదేవీలపై నిఘా ఉంచారు. వాటిలోకి పరిచయంలేని వ్యక్తుల ఖాతాల నుంచి నగదు ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు తేలింది. ఇలాంటి ఖాతాలు ఐదు వేలు దాటి ఉంటాయని అనుమానిస్తున్నారు.రూ.50 వేల నుంచి లక్ష దాటి నగదు జమైన ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఖాతాదారుల నుంచి వివరాలు సేకరించనున్నారు. కొయ్యూరు(పాడేరు): రూపాయి ఆదాయం లేని వ్యక్తి ఒకేసారి లక్ష విలువ చేసే ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. అంత సొమ్ము ఎలా వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ఏదో చేసి ఉంటాడన్న అనుమానం కలుగుతుంది. ఇప్పుడు మన్యంలో కొన్ని మండలాల్లో ఎలాంటి ఆదాయం లేని వ్యక్తులు ఖరీదైన ద్విచక్ర వాహనాలను కొంటున్నారు. విలాసాలకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులకు అలాంటి వారిపై నిఘా ఉంచారు. డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. దీనిలో కొందరు గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తున్నట్టుగా తేలింది.గతంలో డబ్బులను నేరుగా ఇచ్చేవారు. ఇప్పుడు నగదు కొరత కారణంగా ఖాతాల్లో వేస్తున్నారు. అలాంటి వారిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.ఇక్కడ వారిని విచారిస్తే గంజాయి స్మగ్లర్ల భరతం పట్టే వీలుంటుందని భావిస్తున్నారు. మన్యంలో 11 మండలాలు ఉంటే వాటిలో ఎనిమిది మండలాల్లో జరుగుతున్న వ్యవహారాలపై నిఘా ఉంచా రు. డుంబ్రిగుడ, పాడేరు,ముంచంగిపుట్టు, పెదబయలు,గూడెంకొత్తవీధి,హుకుంపేట, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో ఖాతాలను పరిశీలిస్తున్నారు. కొయ్యూరు మండలంలో గంజాయి పండించకపోయినా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న కొందరు అనుమానితులపై పోలీసులు నిఘా ఉంచారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని ఖాతాలను పరిశీలించినట్టు సమాచారం. వాటి ఆదారంగా స్మగ్లర్లకు సహకరిస్తున్న వారిని ప్రశ్నించనున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోను గంజాయి ఎక్కడ బయటపడినా అది విశాఖ మన్యం నుంచే రవాణా అయినట్టు తేలుతోంది. ఎౖMð్సజ్ శాఖ కూడా గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు వీలుగా నర్సీపట్నం,పాడేరుతో పాటు కొయ్యూరులో రెండు ఎక్సైజ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ♦ ఈ రెండున్నర సంవత్సరాల్లో పోలీసులు 150 టన్నుల గంజాయిని పట్టుకున్నారు. ♦ ఎక్సైజ్ శాఖ 35 టన్నుల గంజాయి పట్టుకుంది. ఇలా రెండు శాఖలు పట్టుకున్న గంజాయి విలువ రూ.60 కోట్ల వరకు ఉంటుంది. -
దగాపడ్డ గిరిపుత్రులు
కూటికోసం... కూలికోసం... వలస వెళ్లిన గిరిపుత్రులకు ఎంత కష్టం... ఎంత నష్టం. ఐదు నెలలు ఎండనకా... వాననకా... కష్టపడిన ఆ యువతకు రిక్తహస్తమే మిగిలింది. పని ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి వారి శ్రమ దోపిడీ చేసిన ఏజెంట్ తీరుపై వారంతా మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. గుమ్మలక్ష్మీపురం(కురుపాం): పొట్టకూటికోసం వలస పనుల కెళ్లిన తమచే పనిచేయించుకున్న ఏజెంట్ తమకు రావాల్సిన కూలి సొమ్మును ఎగ్గొట్టాడంటూ గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయతీ చినవంకధార, బబ్బిడి, అచ్చబ, వాడపుట్టి గ్రామాలకు చెందిన 22 మంది గిరిజన యువతీ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు కె.సోమేష్, సోములు, సిద్ధు, జగన్, శ్రీహరి, గణేష్, భాస్కరరావు, క్రిష్ణ, కె.రోజా, కె.శాంతి, సన్యాసి, ఎన్.మధు తదితరులు శనివారం ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్, మండల కార్యదర్శి మండంగి శ్రీనివాస్‌లతో కలిసి ఎల్విన్‌పేటలో విలేకర్లతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సతీష్ అనే ఓ వ్యక్తి(ఏజెంట్) రోజుకు రూ.270లు చొప్పున కూలి వచ్చేలా పని ఇప్పిస్తానని తమను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వెలగపూడి గ్రామంలో ఉన్న సంధ్య కంపెనీ సైట్స్(హేచరీస్)కు గత ఏడాది సెప్టెంబర్ 6న తీసుకెళ్లాడని చెప్పారు. అప్పటి నుంచి తమచే పగలు, రాత్రిళ్లు కూడా రొయ్యల కంపెనీలో పనులు చేయించుకున్నారని చెప్పారు. అయితే వచ్చి చాలా రోజులైనందున స్వగ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబీకులను చూసి వస్తామనీ కూలి సొమ్ములు ఇవ్వాలని ఏజెంట్ సతీష్‌ను అడగ్గా... ఒక్కొక్కరికి కేవలం రూ.8వేలు వంతున మాత్రమే అందజేసారని తెలిపారు. తమకు ఒక్కొక్కరికి రూ.40లు పైబడి ఇవ్వాల్సి ఉండగా రూ.8వేలే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించగా, మళ్లీ వస్తేనే మిగతా డబ్బు చెల్లిస్తానని చెప్పాడని వారంతా వాపోయారు. చేసేది లేక వారం రోజుల క్రితం ఏజెంట్, కంపెనీ ప్రతినిధులకు చెప్పకుండా స్వగ్రామాలకు వచ్చామని, తమతో పాటు పనులకు వచ్చిన కె.త్రినాథ్, శ్యాం, కిరణ్, సంజయ్ అనే మరో నలుగురు అక్కడే ఉండిపోయారని చెప్పారు. తమతో సుమారు ఐదు నెలల పాటు పనిచేయించుకొని కూలి సొమ్ము ఇవ్వకుండా ఏజెంట్ అన్యాయం చేసాడని, దీనిపై గిరిజన సంఘం నాయకులకు తెలపగా వారితో పాటు ఎల్విన్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చామన్నారు. ఈ మేరకు వారంతా ఎల్విన్‌పేట ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడును కలసి సమస్యను వివరించి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎస్సై రొయ్యల చెరువు యజమానులతో పాటు ఏజెంట్ సతీష్‌తో ఫోన్లో మాట్లాడి బాధితులకు మిగతా సొమ్ము తక్షణమే చెల్లించాలని, లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గిరిజన యువకుడిపై చిరుత దాడి
ఖానాపూర్: నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని అక్టోనిమాడ గ్రామ శివారులో దారుగు ఒర్రె ప్రాంతంలో గిరిజన యువకుడిపై శనివారం చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన ఆత్రం సంతోష్ గ్రామశివారులోని కంది చేనుకు కాపలా కోసం శనివారం వెళ్లి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తిరిగి వస్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక్కసారిగా అతనిపై చిరుత దాడిచేసింది. దీన్ని గమనించిన గిరిజనులు కేకలు వేయడంతో చిరుత పారిపోయింది. గాయపడిన సంతోష్‌ను పెంబి పీహెచ్‌సీకి తరలించారు. పారిపోయిన చిరుత ఒర్రె గట్టు గుహలు ఉన్న నెమలి చెట్టు తొర్రలో నక్కింది. గమనించిన స్థానికులు అరవడంతో అక్కడి నుంచి పారిపోయి ముళ్ల పొదలపై రోజంతా గడిపింది. చిరుతను పట్టుకునేందుకు అటవీ, వైల్డ్ లైఫ్ అధికారులు రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గిరిజన యువకుడిపై దాష్టీకం.. వైరల్
సాక్షి, శ్రీశైలం: చెంచు గిరిజన యువకుడిపై ఓ ప్రసిద్ధ దేవస్థానానికి చెందిన ఓ ఉన్నతాధికారి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ సీఎస్వోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ గిరిజన యువకుడు శ్రీశైలం దేవస్థానంలో అభిషేకం చెంబులు శుభ్రపరిచేవాడు. ఈ క్రమంలో బాధిత గిరిజన యువకుడు అక్కడ చిల్లర డబ్బులు ఏరుకున్నట్లు దేవస్థానం సీఎస్ఓ దృష్టికొచ్చింది. తీవ్ర ఆవేశంతో ఆ గిరిజన యువకుడిని బూతులు తిడుతూ సీఎస్ఓ చితకబాదారు. దేవస్థానం సీసీ కెమెరాల నిఘా విభాగం గదిలో గిరిజనుడిని కొట్టిన వ్యవహారం వీడియోలు లీక్ కావడంతో విషయం వెలుగు చూసింది. -
గిరిజన ఉపాధికి జీసీసీ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల ఆర్థికాభివృద్ధికి జీసీసీ (గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్) సరికొత్త కార్యాచరణ రూపొందిస్తోంది. ఐటీడీఏలకే పరిమితమైన జీసీసీ మైదాన ప్రాంతాలకూ విస్తరిస్తోంది. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతోపాటు గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కార్యక్రమాలను అమలు చేయనుంది. ఐటీడీఏల్లోని గిరిజన ఉత్పత్తుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవహారాలను జీసీసీ చూసుకునేది. తాజాగా ఆయా ఉత్పత్తులను నగరాలు, పట్టణాలకు పంపేలా చర్యలు చేపడుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు మైదాన ప్రాంతాల్లో జీసీసీ నూనె, తేనె శుద్ధి, సహజ సబ్బుల తయారీ పరిశ్రమలు, న్యాప్కిన్స్ తయారీ, సోయా, చింతపండు శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అలాగే ఉత్పత్తులు పెరిగి అక్కడ వృద్ధి రేటు పెరగనుంది. నైపుణ్యాభివృద్ధి వైపు.. ఐటీడీఏ ప్రాంతాల్లోని కుటుంబాలు ఎక్కువగా వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. దీంతో ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటోంది. పెద్దగా మార్పుల్లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వలసలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక కేంద్రాలను జీసీసీ ఏర్పాటు చేయనుంది. శిక్షణతో కూడిన ఉపాధికి చర్యలు తీసుకోనుంది. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2018–24 ప్రణాళికలో భాగంగా ఈ అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఆరేళ్ల ప్రణాళిక కొలిక్కి రానుంది. అనంతరం క్షేత్రస్థాయిలో చర్యలు వేగిరం చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
గిరిజన యువతకు ఐఏఎస్ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: గిరిజన యువతను సివిల్ సర్వీసెస్ వైపు మళ్లించేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త కార్యాచరణ రూపొందించింది. సివిల్స్ సాధించాలనుకునే యువతకు కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అకాడమీని అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని ఏర్పాట్లు సైతం దాదాపు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్)లో ఈ అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి రూ. 1.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఈ అకాడమీలో 150 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఇందులో 50 మంది మహిళలు, 100 మంది పురుషులకు సీట్లు ఇవ్వనున్నారు. ప్రైవేటుకు చెక్... సివిల్స్‌కు సన్నద్ధమయ్యే గిరిజన యువతకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు గతంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం ఆశ్రయించింది. ఆయా కోచింగ్ సెంటర్లలో అధ్యాపకులను అంతంత మాత్రంగా ఏర్పాటు చేయడంతో ఫలితాలు సంతృప్తికరంగా రాలేదు. 2016–17 విద్యా సంవత్సరంలో దాదాపు రూ.1.35 కోట్లు ఖర్చు చేసి, వందకుపైగా అభ్యర్థులను ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేర్చారు. అందులో కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు స్వస్తి పలుకుతూ సొంతంగా అకాడమీని ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ భావించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. నిధులు విడుదల చేసింది. దీంతో రాజేంద్రనగర్‌లోని వైటీసీ భవనాన్ని అకాడమీగా మార్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ భవనంలో 35 విశాల గదులతో పాటు మరో 25 గదులున్నాయి. శిక్షణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు ఇక్కడే వసతి కల్పించనుంది. ఫ్యాకల్టీగా ప్రఖ్యాత ప్రొఫెసర్లను తీసుకురానుంది. సబ్జెక్టు నిపుణులను ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి రెండు నుంచి పది రోజుల వరకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి తీసుకురానుంది. నిర్ణీత వ్యవధిలో సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు అడ్మిషన్లు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ బాధ్యతలు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా రాత పరీక్ష, మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది. కార్పొరేట్ స్థాయిలో... రాజేంద్రనగర్‌లోని వైటీసీలో ఏర్పాటు చేస్తున్న ఈ అకాడమీని కార్పొరేట్ స్థాయిలో గిరిజన సంక్షేమ శాఖ తీర్చిదిద్దుతోంది. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, డార్మిటరీలు, 2 వేల పుస్తకాల సామర్థ్యం ఉన్న లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, పూర్తిస్థాయిలో ఫర్నిచర్, బయోమెట్రిక్ మెషీన్లతో హాజరు తదితరాలు ఏర్పాటు చేస్తోంది. అకాడమీలో భద్రత కోసం సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేసింది. అన్ని రకాల దినపత్రికలు, జర్నల్స్‌ను అభ్యర్థుల కోసం అందుబాటులోకి తేనుంది. అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం ‘గిరిజన ఐఏఎస్ అకాడమీని అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశాం. అకాడమీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రారంభించనున్నారు. ప్రైవేట్ అకాడమీలకు దీటుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అత్యుత్తమ అధ్యాపకులను తీసుకొచ్చి అభ్యర్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అకాడమీ నిర్వహణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించాం. అకాడమీలో డాటాఎంట్రీ ఆపరేటర్లు, గార్డ్లు, కిచెన్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్, ఆఫీస్ సబార్టినేట్లు, లైబ్రేరియన్లుగా కొత్తగా 13 మందిని నియమించాం’. – వి.సర్వేశ్వర్‌రెడ్డి, అదనపు సంచాలకుడు, గిరిజన సంక్షేమ శాఖ -
పత్తాలేని గిరిజన పారిశ్రామిక రాయితీ
⇒ నాలుగేళ్లుగా విడుదల కాని నిధులు ⇒ పేరుకుపోయిన బకాయిలు రూ.123 కోట్లు సాక్షి, హైదరాబాద్: గిరిజన యువతను స్వయం ఉపాధివైపు మళ్లించాలనే సంకల్పంతో తలపెట్టిన పారిశ్రామిక రాయితీ పథకం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ పథ కం కింద ఎంపికైన లబ్ధిదారుల రాయితీ విడు దలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేయడం... మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలోని బకాయిలపై స్పష్టత ఇవ్వకపో వడంతో రాయితీ బకాయిలు ఏకంగా రూ.123 కోట్లు పేరుకుపోయాయి. ఇందులో రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న రాయితీ బకాయిలు రూ.78 కోట్లు. వాస్తవానికి ఈ నిధులను 2013–14 సంవత్సరం చివర్లో విడుదల చేయాల్సి ఉండగా... అప్పట్లో ఖజానాపై ఆంక్షల నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం పాత బకాయిల విడుదలపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. దీంతో దాదాపు 4వేల మంది లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలు నెలకొల్పే చిన్న పరిశ్రమలకు గరిష్టంగా 75 శాతం రాయితీ ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2012–13 సంవత్సరంలో ఈ పథకం అందుబాటులోకి రాగా... గిరిజన యువతకోసం అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్ద మొత్తాన్ని రాయితీ కింద ఇచ్చేలా కేటాయించింది. దీంతో ఈ పథకం కింద భారీ వాహనాల కొనుగోలుకు వేలాది దరఖాస్తులు రాగా... అదేస్థాయిలో అధికారులు మంజూరు చేశారు. తొలి ఏడాది నిధుల విడుదల సంతృప్తికరంగా జరిగినప్పటికీ... ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశంలో రాయితీ నిధుల విడుదలపై ఎంపీ సీతారాం నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాయితీ సకాలంలో ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అప్పుల పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. -
గిరిజనుల సమస్యలు పరిష్కరించండి
కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ సీతారాం నాయక్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జ్యుయల్ ఓరంను ఎంపీ సీతారాం నాయక్ కోరారు. తెలంగాణలో గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్టోబర్ 26న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న జాతీయ ట్రైబ్స్ కార్నివాల్లో తెలంగాణ గిరిజనుల సంస్కృతి నృత్యాలు ప్రదర్శించడానికి అనుమతినివ్వాలని కోరారు. గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించి గిరిజన సంక్షేమానికి సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు ఎంపీ తెలిపారు. -
ఎవరెస్టు ఎక్కిన గిరిజన యువకుడు
మోతుగూడెం: ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యాన్ని ఓ గిరిజన యువకుడు ఎట్టకేలకు సాధించాడు. తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం మండలం కొత్తపల్లికి చెందిన దూపు భద్రయ్య(27) పదో తరగతి వరకు చదువుకున్నాడు. పస్తుతం అతడు లోయర్ సీలేరు జెన్కో జల విద్యుత్ ప్రాజెక్టులో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నాడు. చిన్ననాటి నుంచి ఎవరెస్ట్ అధిరోహించాలనే కోరిక బలీయంగా ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. తన లక్ష్యాన్ని రంపచోడవరం ఐటీడీఏ పీవోగా ఉన్న చక్రధర్‌బాబుకు తెలిపాడు. సాయం కోసం ఆర్థించాడు. అతడి విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియజేసిన పీవో మూడేళ్ల క్రితం రూ.25 లక్షల సాయం అందేలా కృషి చేశారు. అలా అందిన ఆర్థిక సాయంతో కావల్సిన శిక్షణ, సాధన సామగ్రిని భద్రయ్య సమకూర్చుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన శేఖర్‌బాబు వద్ద పర్వతారోహణలో శిక్షణ పొందాడు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎవరెస్ట్ అధిరోహకుల బృందంలో ఒక్కడిగా భద్రయ్య శుక్రవారం ఉదయం ఎవరెస్టు అధిరోహించాడు. తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఎవరెస్టు అధిరోహించిన భద్రయ్యకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. -
గిరిజనుడిని బలిగొన్న అధికార మదం
- విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుడి అఘాయిత్యం - చెక్కతో తలపై కొట్టడంతో మృతి - నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాన్ని ప్రశ్నించినందుకు దాడి - వీధినపడ్డ గిరిజనుడి కుటుంబం సాలూరు: గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదని ప్రశ్నించిన పాపానికి ఓ గిరిజనుడు బలైపోయాడు. అధికార మదంతో టీడీపీ నాయకుడే ఆ గిరిజనుడిని హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం తుండ పంచాయతీ ఇటుకలవలసలో మావుడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సారికొండ మందయ్య సీసీ రోడ్డు నిర్మాణ పనులు దక్కించుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తోందని, రాతిపిక్క(చిప్స్) ఎక్కువగా వేస్తున్నారని గిరిజనుడైన పాలిక లచ్చయ్య(35) శనివా రం పనులు చేయిస్తున్న మందయ్యను ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన మం దయ్య పక్కనే ఉన్న చెక్కతో తలపై బలంగా కొట్టడంతో లచ్చయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే మందయ్య అక్కడి నుంచి జారుకున్నాడు. లచ్చయ్య తల నుండి రక్తం కారడాన్ని గమనించిన స్థానికులు ‘108’కు సమాచారం ఇచ్చారు. ‘108’ సిబ్బంది లచ్చయ్యను సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రికి, ఆపై విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో లచ్చయ్య తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు వెల్లడించారు. అనాథలైన భార్య, పిల్లలు గిరిజనుడు లచ్చయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబం వీధిన పడింది. నాలుగు నెలల గర్భిణి అయిన భార్య ముత్తమ్మ, 12 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె స్వాతి అనాథలయ్యారు.కుటుంబాన్ని పోషించిన ఇంటిపెద్ద ఇక లేకుండా పోయాడంటూ ముత్తమ్మ రోదించింది. లచ్చయ్య మృతదేహం విశాఖ నుంచి ఆదివారం సాయంత్రం ఇటుకలవలసకు చేరుకుంది.పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. అనధికారికంగా కాంట్రాక్ట్ పనులు సాలూరు మండలంలో రెండు, మూడు పంచాయతీలకు నాయకుడిగా చెలామణీ అవుతున్న సారికొండ మందయ్య స్థానిక సర్పంచ్‌లు చేయించాల్సిన పనులను అనధికారికంగా కాంట్రాక్ట్‌కు తీసుకుని చేయిస్తున్నాడు. జిల్లా పరిషత్ ద్వారా మంజూరయ్యే పనులపై కూడా పెత్తనం చెలాయిస్తున్నాడు. అసెంబ్లీలో ప్రశ్నిస్తా ‘‘సాలూరు నియోజకవర్గంలో గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. లచ్చయ్య మృతికి కారణమైన టీడీపీ నేత మందయ్యను కఠినంగా శిక్షించాలి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.మెంటాడ మండలం ఆండ్రలో ఇటీవల గిరిజన మహిళపై లైంగికదాడి జరిపారు. మక్కువ మండలంలోని కొత్తకాముడివలసలో దంపతులను కొట్టి, కాల్చి చంపారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ - పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు -
గిరిజన యువతకు శిక్షణ ఎన్నడో?
* రూ.మూడు కోట్లతో సామర్లకోటలో భవనాలు * నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని వైనం సామర్లకోట : రంపచోడవరం ప్రాంతానికి చెందిన గిరిజన యువతీ, యువకులకు సామర్లకోటలో ఇవ్వ తలపెట్టిన శిక్షణ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సామర్లకోటలోని విస్తరణ శిక్షణా కేంద్రంలో సుమారు రూ. 3 కోట్లతో గిరిజన యువత శిక్షణా కేంద్రం నిర్మించారు. ఈ భవనాల నిర్మాణం పూర్తరుునా ప్రారంభానికి నోచుకోలేదు. కాగా భవనాల నిర్మాణంపై గతంలోనే కొన్ని వివాదాలు ఉన్నాయి. అప్పటి జిల్లా కలెక్టర్ రవిచంద్ర ఆదేశాల మేరకు సుమారు మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని భవనాలు నిర్మించారు. భూముల కేటాయింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ, కమిషనర్ అనుమతి పొందవలసి ఉంది. అరుుతే అనుమతి లేకపోవడంతో భవనాలను విస్తరణ శిక్షణా కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీనిపై విస్తరణ శిక్షణా కేంద్రం అధికారులను వివరణ కోరగా గతంలో జరిగిన విషయాలపై తమకు అవగాహన లేదని చెప్పారు. కాగా రంపచోడవరం నుంచి యువతీ, యువకులు సామర్లకోట వచ్చి ఎలా శిక్షణ పొందుతారన్న సందేహమూ ఉంది. ఐటీడీఏకి నిధులు ఉన్నా అప్పట్లో స్థల సమస్య కారణంగా సామర్లకోటలో ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణా కేంద్రం భవనాలు పూర్తయినప్పటికీ శిక్షణకు అవసరమైన ఫర్నీచర్, ఇతర సదుపాయూలు ఏర్పాటు చేయలేదు. ఈ శిక్షణా కేంద్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది. భవనాలు ప్రారంభమైన వెంటనే శిక్షణను కూడా ప్రారంభించవలసి ఉన్నా.. అదెప్పుడో అధికారులే చెప్పాలి. త్వరలో భవనాలు ప్రారంభిస్తాం సామర్లకోట విస్తరణ శిక్షణా కేంద్రంలో నిర్మించిన గిరిజన యువత శిక్షణా కేంద్రం త్వరలో ప్రారంభం అవుతుంది. యువతకు అవసరమైన అన్ని రకాల శిక్షణలూ ఈ కేంద్రంలో ఇస్తారు. శిక్షణ సమయంలో భోజన వసతి సౌకర్యాలు ఉంటాయి. శిక్షణ ప్రారంభానికి సంబంధించి పూర్తి వివరాలు రావలసి ఉంది. - కేవీఎన్ చక్రధరబాబు, ఐటీడీఏ పీఓ, రంపచోడవరం -
గిరిజనుడిపై పులి దాడి
ఖానాపూర్ మండలం సోమర్‌పేట పంచాయతీ కులాంగూడ గ్రామ సమీపంలో భీంరావు(34) అనే గిరిజనుడిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుని వివరాలు తెలియాల్సి ఉంది. అప్రమత్తమైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
విశాఖలో మావోయిస్టుల ఘాతుకం
విశాఖపట్నం: జిల్లాలోని మంచంగిపుట్ట మండలం గొబ్రపడలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. రామన్న అనే గిరిజన యువకుడిని హతమార్చారు. మృతదేహం తమ ఆధీనంలోనే ఉందంటూ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గిరిజన గూడెంలో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. తమ కదలికలపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే నెపంతో రామన్నను మావోయిస్టులు శనివారం కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. రామన్నను నిర్బంధించే క్రమంలో నాలుగు ఇళ్లను కూడా పేల్చేశారు. మావోయిస్టుల దుశ్చర్యను ఖండించిన విశాఖ జిల్లా పోలీసులు.. తమకు సహకరిస్తున్నాడనే నెపంతో అమాయక గిరిజనుణ్ని పొట్టనపెట్టుకున్నారన్నారు. -
కాల్పుల బాధ్యులను సస్పెండ్ చేయాలి
పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వి.రఘునాధ్ చర్ల: చట్ట విరుద్ధంగా కాల్పులు జరిపి, దోశిళ్లపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు కారం నర్సింహారావు మృతికి కారకులైన ఎస్సై, సీఐ, ఏఎస్పీ, సీఆర్పీఎఫ్ డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయూలని, వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయూలని, ఈ ఘటనపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ర్ట సంయుక్త కార్యదర్శి వి.రఘునాధ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దోశిళ్లపల్లి గ్రామాన్ని శనివారం పౌర హక్కుల సంఘం ప్రతినిధులు సందర్శించారు. నరసింహారావు భార్య సుశీల, కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడిన కనితి సత్తిబాబుతోపాటు స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, చర్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో కారం నర్సింహారావు మృతిచెందాడంటూ కట్టుకథలు అల్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే మృతదేహానికి పోస్ట్‌మార్టం జరపకుండా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేయించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కాల్పుల ఘటనపై ఐపీసీ 301, 201 సెక్షన్ల కింద కాకుండా కేవలం ఐపీసీ 147, 148, 307 సెక్షన్లతోనే కేసు నమోదు చేసి సరిపెట్టుకున్నారని విమర్శించారు. దీనినిబట్టి, ఈ కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమవుతోందన్నారు. దీనిని ప్రశ్నించిన విలేకరులతో... ‘విలేకరులే కాల్చి చంపారు’ అంటూ కొత్తగూడేనికి చెందిన ఆర్ఎస్ఐ శ్రీధర్ దురహంకారంగా మాట్లాడారని అన్నారు. దీనిని సుమోటోగా స్వీకరించి, ఆర్ఎస్ఐపై కూడా కేసు నమోదు చేయాలని మానవ హక్కుల సంఘాన్ని కోరారు. ఏజెన్సీలో గ్రీన్ హంట్ ఆపరేషన్నునిలిపివేయాలని, అమాయక ఆదివాసీలపై బైండోవర్ కేసులకు స్వస్తి చెప్పాలని ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. కాల్పుల ఘటనపై స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలతోపాటు హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కాల్పుల ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, హైకోర్టులో పిటిషన్ వేస్తామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.తిరుమలరావు, జిల్లా అధ్యక్షుడు కె.రవి, కార్యదర్శి పి.విప్లవ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు ఉన్నారు. పోలీసుల దమనకాండకు నిదర్శనం జిల్లాలో పోలీసుల దమనకాండకు దోశిళ్లపల్లి కాల్పుల ఘటనే నిదర్శనమని మావోయిస్టు పార్టీ వెంకటాపురం ఏరియా కార్యదర్శి సునీత పేర్కొన్నారు. ఈ కాల్పులకు బాధ్యులైన ఎస్సై మొదలు ఎస్పీ వరకు అందరినీ వెంటనే సస్పెండ్ చేయాలంటూ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేయాలని కోరారు. ఈ మేరకు, ఆమె పేరిట శనివారం రాత్రి పత్రికలకు లేఖలు అందాయి. కాల్పుల ఘటనను కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాల్పుల ఘటనకు బాధులైన చర్ల ఎస్సై సంతోష్, వెంటాపురం సీఐ అల్లం నరేందర్, భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్పీ షానవాజ్ ఖాసింను సస్పెండ్ చేయాలంటూ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేయాలని ఆమె కోరారు. -
దోశిళ్లపల్లిలో టెన్షన్ టెన్షన్
చర్ల : మండలంలోని దోశిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ కాల్పుల్లో ఓ గిరిజన యువకుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు సోమవారం రహస్య విచారణ నిర్వహించారు. విషయం తెలిసి ఆ ప్రాంతానికి వచ్చిన స్థానికులు, మీడియాను ఘటన స్థలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రహస్య విచారణపై గిరిజనులు, విలేకరులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బహిరంగ విచారణ చేయాల్సిందేనని ఆదివాసీలు, విచారణను చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. పోలీసులు ఎంతకూ ఒప్పుకోలేదు. ముందుకెళ్లేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతుల్లో ఉన్న కెమెరాలను లాక్కునేందుకు యత్నించారు. విలేకరులను బలవంతంగా నెట్టివేశారు. కొత్తగూడెం నుంచి విధి నిర్వహణకు వచ్చిన ఆర్ఎస్సై విలేకరులను ఉద్దేశించి ‘మీరే కాల్పులు జరిపి ఇప్పుడు ఫొటోలు తీసేందుకు వచ్చారా?.. వీళ్ల కెమెరాలు లాక్కోండి..’ అంటూ మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ సీపీఎం, గిరిజన సంక్షేమ పరిషత్‌ల ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు పూనుకున్నారు. గంటన్నరపాటు ఆందోళన నిర్వహించారు. భారీగా తరలివచ్చిన జనం పోలీస్ కాల్పుల్లో మరణించిన కారం నర్సింహారావు మృతదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శిం చేందుకు దేవానగరం, దోశిళ్లపల్లి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వారంతా ఆందోళనకు పూనుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది ఉధృతం అవుతుందని భావించిన పోలీసు ఉన్నతాధికారులు వెంకటాపురం, దుమ్ముగూడెం పోలీస్స్టేషన్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. ఇటు గిరిజనుల ఆందోళన..అటు భారీగా మోహరించిన పోలీస్ బలగాలు..ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దోశిళ్లపల్లి కాల్పుల ఘటనపై బహిరంగ విచారణ జరపాలని, మీడియా ప్రతినిధుల సమక్షంలో విచారణ కొనసాగాాలని, కాల్పులకు బాధ్యలైన పోలీసులను విధుల నుంచి తప్పించాలని, మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, 5 ఎకరాల సాగు భూమితో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కాల్పుల ఘటనపై సాక్షాధారాలను తారుమారు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, పోలీసుల అదుపులో ఉన్న మరో వ్యక్తిని తక్షణమే అప్పగించాలని, ఏజెన్సీలో పోలీసుల దూకుడుకు కళ్లెం వేయాలని, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాదాపు గంటన్నరపాటు ఈ ఆందోళన కొనసాగడంతో భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. ‘కాల్పులకు పాల్పడిన పోలీసులను బదిలీ చేస్తాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం, ఐదు ఎకరాల సాగుభూమి, కుటుంబంలో ఒకరికి నెలకు రూ.12 వేల రూపాయలకు పైబడిన ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. తాము నిత్యం వ్యవసాయ పనులు, వివిధ అవసరాల నిమిత్తం అర్థరాత్రి అపరాత్రి తిరుగుతుంటాం. మళ్లీ తమపై కాల్పులు జరుపుతారా? అని గిరిజనులు ప్రశ్నించారు. మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, గిరిజనులతో సక్యతతో మెలిగే వారినే ఇక్కడ విధుల్లో నియమిస్తామని, అవసరమైతే వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని డీఎస్పీ తెలపడంతో గిరిజనులు శాంతించారు. ఈ ఆందోళనలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏజె రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచిలి రవికుమార్, కొలగాని బ్రహ్మచారి, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు గడ్డం స్వామి, మండల కార్యదర్శి లంకా వెంకట్, డివిజన్ కమిటీ సభ్యులు సోయం రాజారావు, గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అద్యక్షులు పాయం సత్యనారాయణ, నాయకులు ఇర్పా ప్రకాశ్, ఎంపీపీ కోదండరామయ్య, ఎంపీటీసీ మచ్చా నర్సింహారవు, మొగళ్లపల్లి సర్పంచ్ పసల రాజేశ్వరి పాల్గొన్నారు. మృతదేహం కోసం ఎదురుచూపులు మండలంలోని దోశిళ్లపల్లిలో శనివారం రాత్రి పోలీసుల జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కారం నర్సింహారావు మృతదేహం కోసం బందువులు, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఆదివారం రాత్రే నర్సింహారావు మృతి చెందినప్పటికీ సోమవారం రాత్రి వరకు మృతదేహాన్ని స్వగ్రామం తరలించకపోవడంతో కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మృతి వార్త తెలుసుకున్న సమీప బంధువులు సోమవారం ఉదయం నుంచే దోశిళ్లపల్లికి పెద్ద ఎత్తున తరలివచ్చారు నర్సింహారావును కాల్చి చంపిన పోలీసులు కనీసం మృతదేహాన్ని కూడా సరైన సమయానికి ఇవ్వరా...? అంటూ ప్రశ్నించారు. సోమవారం రాత్రి వరకు మృతదేహాన్ని అప్పగించపోవడంపై మృతుని తరఫువారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
గిరిజన యువతులకు నర్సింగ్‌లో శిక్షణ
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలోని గిరిజన యువతులకు మొట్టమొదటి సారిగా నర్సింగ్‌లో శిక్షణ అందించేందుకు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఆర్ఎం గిరిధర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నర్సింగ్ కోర్సు చేసేందుకు తగిన ఆర్థిక స్థోమత లేని కారణంగా గిరిజన యువతులు ఆసక్తి కనబరచని నేపథ్యంలో కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కోర్సుకు ఇంటర్మీడియట్ లేదా ఎంపీహెచ్‌డబ్ల్యు (ఎఫ్) 18 నెలల ఏఎన్ఎం కోర్సు ఉత్తీర్ణులై, 17 నుంచి 38 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. వారి కుటుంబ సభ్యుల సంవత్సరాదాయం రూ.2.50 లక్షలకు మించకుండా ఉండాలన్నారు. జిల్లాకు రెండు సీట్లు కేటాయించడం జరిగిందని, అర్హులైన వారు జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులను ఈ నెల 12వ తేదీలోగా అందజేయాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కళాశాలలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు.