ధన్‌బాద్: గిరిజన ప్రజలకు నీరు, అడవి, భూమి(జల్–జంగిల్–జమీన్)పై హక్కుల ను, గిరిజన యువతకు ఉపాధిని కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం ఆయన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జరిగిన రోడ్ షోలో ప్రసంగించారు. రాష్ట్రంలో జోడో యాత్ర మూడో రోజుకు చేరుకుంది.
జిల్లాలోని తుండిలో శనివారం రాత్రి బస చేసిన రాహుల్ ఆదివారం గోవింద్‌పూర్ నుంచి తిరిగి యాత్రను మొదలుపెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం కాకుండా కాపాడటం, యువతకు గిరిజనులకు న్యాయం దక్కేలా చేయడమే యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్థిక అసమానతలు, నోట్లరద్దు, జీఎస్‌టీ, నిరుద్యోగం వంటి సమస్యలు దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం యాత్ర తిరిగి కొనసాగి బొకారో జిల్లాలోకి ప్రవేశించింది. బొకారో వైపు సాగుతూ గోధార్ కాళి బస్తీ వద్ద ఆయన బొగ్గు గని కార్మికులు, వారి పిల్లలతో ముచ్చటించారు. మధ్యాహ్నానికి యాత్ర బొకారో చేరుకుంది. భోజనానంతరం జెనామోర్ నుంచి మొదలైన యాత్ర రామ్‌గఢ్ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని గోలా వద్ద జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment