కాన్పూర్/ఉన్నావ్(యూపీ): జనాభాలో దాదాపు 90 శాతమున్న బీసీలు, దళితులు, మైనారీ్టలకు మోదీ ‘రామరాజ్యం’లో సరైన ఉద్యోగాలు దక్కలేదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. భారత్‌జోడో న్యాయ్‌యాత్రలో భాగంగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కార్యకర్తలు, మద్దతుదారులనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ జనాభాలో 50 శాతం బీసీలు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనారిటీలు ఉన్నారు.
మొత్తంగా దాదాపు 90 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరికి సరైన ఉద్యోగాలు దక్కనపుడు ఇదేమీ మోదీ రామరాజ్యం?’ అని ప్రశ్నించారు. ‘‘ కులం పేరిట దళితులు, బీసీలు వివక్షకు గురికావడంతో మీడియాలో, పెద్ద పరిశ్రమల్లో, ఉన్నతోద్యోగాల్లో వారికి సరైన ప్రాధాన్యత లేదు. అణగారిన వర్గాలు ఆకలికి అలమటించి మరణిస్తున్నారు. అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చూశారుగా.
ఆరోజు విచ్చేసిన అతిథుల్లో వెనకబడివారు, దళితులు, గిరిజనులు ఎంతమంది?. గిరిజనురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దళితుడైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లకు ఆరోజు లోనికి అనుమతి లేదు. అందుకే వెనకబడిన వర్గాల సంక్షేమం, వారి ఆర్థిక స్థితిగతులు తెల్సుకునేందుకే కులగణన చేపట్టదలిచాం. ఇది దేశాభివృద్దిలో విప్లవాత్మకమైన ముందడుగు’’ అని రాహుల్ అన్నారు. ‘‘ అదానీ, అంబానీ, టాటా, బిర్లా.. ఇలా దేశంలో ఒక రెండు, మూడు శాతం మంది వ్యక్తుల వద్దే దేశ సంపదలో సింహభాగం పోగుబడింది.
వీళ్లే నూతన భారతావనికి మహారాజులు’’ అని ఆరోపించారు. 2016లో పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, అగ్నివీర్ పథకంలపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘‘ కొన్నిసార్లు మీ ప్రశ్నాపత్రం లీక్ అవుతుంది. ఇంకొందరు ఉద్యోగాలు కోల్పోతారు. హఠాత్తుగా జీఎస్‌టీ అని కొత్త పన్నుల విధానం ఒకటి వస్తుంది. పెద్ద నోట్లను రద్దుచేసి ఆర్థికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తారు. తీరా సైన్యంలో అయినా చేరదామంటే అగి్నవీర్ యోజన పేరిట శాశ్వత నియామకాలకు చిల్లుచీటీ పాడుతారు’’ అని రాహుల్ విమర్శించారు.
ఫిబ్రవరి 26– మార్చి 1 దాకా యాత్రకు బ్రేక్
ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 దాకా న్యాయ్‌యాత్రకు బ్రేక్‌పడనుంది. బ్రిటన్‌లో తాను చదువుకున్న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగం, ఢిల్లీలో పార్టీ కీలక సమావేశాల నేపథ్యంలో న్యాయ్‌యాత్రకు విరామం ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ చెప్పారు. నేడు, రేపు సైతం యాత్ర కొనసాగదు. ఫిబ్రవరి 24వ తేదీన మొరాదాబాద్‌లో యాత్ర మొదలవుతుంది. ఫిబ్రవరి 27, 28న కేంబ్రిడ్జ్‌లో రాహుల్ ప్రసంగిస్తారు. మార్చి రెండో తేదీన ధోల్‌పూర్‌లో యాత్ర పునఃప్రారంభమవుతుంది. మార్చి ఐదున ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయాన్ని దర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment